Legal Drama Series OTT : భార్యాభర్తలు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇది సాధారణ విడాకుల వ్యవహారం కాదు. వందల కోట్ల ఆస్తులు, వ్యాపార ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రతిష్ట అన్నీ లెక్కలో ఉన్నప్పుడు ఒక్క సంతకం కూడా కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఈ కేసును గెలిపించేందుకు రెండు ప్రత్యర్థి లా ఫర్మ్స్ రంగంలోకి దిగడంతో కుటుంబ సమస్య కాస్తా భారీ లీగల్ వార్ గా మారుతుంది. వ్యక్తిగత జీవితాలు, న్యాయపోరాటాలు, కార్పొరేట్ ప్రయోజనాలు వంటి అంశాలను కలగలిపి తెరకెక్కించిన ఇంటెన్స్ లీగల్ డ్రామా సిరీస్ ‘వార్’ (War). మరి ఈ భార్యాభర్తల లీగల్ బ్యాటిల్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో ఉందా ? అంటే…
మోర్గాన్ హెండర్సన్ టెక్ రంగంలో భారీ ఆస్తులు సంపాదించిన బిలియనీర్. అతని భార్య కార్లా డువాల్ ప్రముఖ నటి. చూడడానికి ఇద్దరూ సక్సెస్ ఫుల్ జంట. కానీ వారి వివాహ బంధంలో చాలా కాలంగా పేరుకుపోయిన సమస్యలు చివరకు విడాకుల వరకు తీసుకెళ్తాయి. కార్లాకు విడాకుల పత్రాలు అందడంతో ఆమె తన హక్కుల కోసం న్యాయ పోరాటానికి సిద్ధమవుతుంది. ఈ కేసు విలువ కేవలం ఆస్తుల పరంగా మాత్రమే కాదు… ఇద్దరి ప్రతిష్టకు కూడా సంబంధించినది. అందుకే ఇరువైపులా అత్యంత శక్తివంతమైన లాయర్లను రంగంలోకి దింపుతారు.
టేలర్ అండ్ బైర్న్, క్యాత్‌కార్ట్స్ అండ్ సన్స్ అనే రెండు ప్రముఖ లా ఫర్మ్స్ ఈ కేసులో ప్రత్యర్థులుగా మారతాయి. కోర్టులో ఒకరి వాదనను మరొకరు తిప్పికొట్టే ప్రయత్నం చేయడంతో పాటు, ప్రత్యర్థి వైపు బలహీనతలను బయటపెట్టేందుకు తెరవెనుక కూడా వ్యూహాలు మొదలవుతాయి. ఈ కథలో జానీ వారెన్ అనే యువ లా గ్రాడ్యుయేట్ పాత్ర కూడా కీలకంగా మారుతుంది. లండన్ లోని ప్రతిష్టాత్మక లా ఫర్మ్‌లో తన కెరీర్ ను నిలబెట్టుకోవాలని ప్రయత్నించే అతనికి ఈ కేసు అనుకోని అవకాశాన్ని ఇస్తుంది. అయితే అతని చుట్టూ ఉన్న పరిస్థితులు కేవలం కెరీర్ కు సంబంధించినవి కావని క్రమంగా అర్థమవుతుంది.
భర్తాభార్యల మధ్య ఉన్న వ్యక్తిగత గొడవ కోర్టులోకి వచ్చిన తర్వాత పాత రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఎవరి దగ్గర ఏ సమాచారం ఉందో, దాన్ని ఎప్పుడు ఉపయోగించాలో కూడా ఈ యుద్ధంలో కీలకంగా మారుతుంది. కార్లా – మోర్గాన్ మధ్య అసలు సమస్య ఏంటి ? ఈ లీగల్ వార్ లో ఎవరు పైచేయి సాధిస్తారు ? జానీ ఏ వైపు నిలబడతాడు ? చివరకు ఈ కేసు ఇద్దరి జీవితాలను ఎంత దూరం తీసుకెళ్తుందనేది ? ‘వార్’లో చూడాల్సిన అంశం.
Also Read : రాత్రిళ్లు కనిపిస్తున్న ఆ శవం ఎవరిది ? హారర్ కాదు అంతకు మించి… ప్రతీ సీన్ సీట్ ఎడ్జ్ ట్విస్ట్
‘వార్’ ఇంగ్లీష్ లీగల్ డ్రామా సిరీస్. మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. సియెన్నా మిల్లర్ (Sienna Miller), డొమినిక్ వెస్ట్ (Dominic West), ఆర్చీ రెనాక్స్ (Archie Renaux) తదితరులు నటించారు. Jio Hotstarలో అక్టోబర్ 3 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు ఆడియో, తెలుగు సబ్‌టైటిల్స్ అందుబాటులో లేవు.