Survival Documentary: రీసెంట్ గా తునిలో ఓ చిన్న పాప మిస్ అయితే తెలుగు రాష్ట్రాలు ఎంతగా అల్లాడిపోయాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి అలాంటి చిన్న పిల్లలు నలుగురు మిస్ అయితే… అది కూడా 40 రోజుల పాటు మిస్సయితే… అమెజాన్ అడవుల్లో 40 రోజుల పాటు సాగిన ఆ అద్భుతమయిన సర్వైవల్ డ్రామా ఎలా ఉండెనో తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ‘ది లాస్ట్ చిల్డ్రన్ (The Lost Children) అనే టైటిల్ తో 2024లో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా ఎమోషనల్ స్టార్మ్ సృష్టించిన ఈ డాక్యుమెంటరీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? తెలుగులో ఉందా లేదా ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.
కథ మొత్తం దట్టమైన అమెజాన్ అడవుల్లో సాగుతుంది. కొలంబియాలో కథ మొదలవుతుంది. తోడుగా ఒక్క పెద్ద మనిషి లేకుండా, ఆ అభయారణ్యంలో పిల్లలు మాత్రమే 40 రోజుల పాటు సర్వైవ్ అవుతూ చేసిన పోరాటమే ఈ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ స్టోరీ. మే 2023లో ఒక చిన్న విమానం కొలంబియా అమెజాన్ అడవుల్లో కూలిపోతుంది. ఈ ప్రమాదంలో పైలట్, మరికొందరు పెద్దలతో పాటు ముకుటుయ్ కుటుంబానికి చెందిన తల్లి అక్కడికక్కడే మరణిస్తారు. ఆ ప్రమాదం నుండి నలుగురు తోబుట్టువులు మాత్రమే ప్రాణాలతో బయటపడతారు.
వారి వయస్సు కూడా చిన్నదే. 13 ఏళ్ల లెస్లీతో పాటు… 9 ఏళ్లు, 4 ఏళ్లు, 11 నెలల పసికందు అలా బతికిన వాళ్ళలో ఉంటారు. ఘోరమైన వన్యప్రాణులు, విషసర్పాలు, ఆగకుండా కురిసే వర్షాలు… ఇలాంటి ఆ దట్టమైన అమెజాన్ అడవిలో ఆ నలుగురు పిల్లలు ఒంటరిగా మిగిలిపోతారు. అయితే వాళ్ళు స్థానిక ‘ఉయిటోటో’ అనే గిరిజన తెగకు చెందినవారు కావడంతో, పెద్దల ద్వారా చిన్నతనం నుండి నేర్చుకున్న పూర్వీకుల అడవి జ్ఞానం వారిని కాపాడుతుంది.
ఏ పండ్లు తినాలి ? క్రూర జంతువుల నుండి ఎలా తప్పించుకోవాలి ? పసిబిడ్డను ఎలా చూసుకోవాలి ? అనేది చెప్పే బాధ్యతను 13 ఏళ్ల పెద్దమ్మాయి లెస్లీ తీసుకుంటుంది. తన లీడర్‌షిప్ లో తన తమ్ముడు, చెల్లెళ్లను నడిపిస్తుంది. మరోవైపు వాళ్ళను వెతుకుతున్న పోలీసులు, ఆ తెగ వారికి పిల్లలు బ్రతికే ఉన్నారనే ఆధారాలు దొరుకుతాయి. అంటే సగం తిన్న అడవి పండ్లు, వాడిన డైపర్లు దొరకడంతో కొలంబియా సైన్యం రంగంలోకి దిగుతుంది.
అయితే ఆ సైన్యానికి అడవి గురించి పెద్దగా తెలియకపోవడంతో, స్థానిక గిరిజన వాలంటీర్లు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. అంతకుముందు ఒకరినొకరు శత్రువులుగా చూసుకున్న సైనికులు, గిరిజనులు కేవలం ఆ నలుగురు పిల్లల ప్రాణాలను కాపాడటం కోసం ఎలా ఒకటయ్యారు ? చివరకు 40 రోజుల సుదీర్ఘమైన, ఉత్కంఠభరితమైన గాలింపు చర్యల తర్వాత ఆ పిల్లలను ఎలా సురక్షితంగా రక్షించి తీసుకొచ్చారు ? అనేదే ఈ డాక్యుమెంటరీలోని ఉద్వేగభరితమైన కథ.
‘ది లాస్ట్ చిల్డ్రన్’ రియల్ గా జరిగిన స్టోరీతో రూపొందిన ట్రూ సర్వైవల్ డాక్యుమెంటరీ. ఆస్కార్ విజేత ఓర్లాండో వాన్ ఐన్‌సీడెల్, జార్జ్ డురాన్, లాలీ హౌటన్‌లు సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 2023లో కొలంబియా అమెజాన్ అడవుల్లో జరిగిన ఓ నిజమైన విమాన ప్రమాదం, దాని తదనంతర సహాయక చర్యల ఆధారంగా రూపొందింది. 2024 నవంబర్ 14న విడుదలైన ఈ స్పానిష్ డాక్యుమెంటరీ Netflixలో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. డోంట్ మిస్.
Read Also: కాంక్రీట్ గోడలో యువతి శవం… పుట్టిన ప్రతీ ఆడపిల్లను క్రూరంగా చంపే ముఠా