Romantic Comedy on OTT: ఒక అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు… ఆమె కూడా అతని ప్రేమను అంగీకరిస్తుంది. కానీ రెండు కుటుంబాల మధ్య ఉన్న తేడాలు, పాత గొడవలు, సంప్రదాయాలు ఈ ప్రేమకు అడ్డుగా నిలిస్తే ? ప్రేమను నిలబెట్టుకోవడానికి హీరో చేసే చిన్న ప్రయత్నం కాస్తా రెండు కుటుంబాల మధ్య పెద్ద గందరగోళానికి దారితీస్తే ? అలాంటి ప్రేమ, కుటుంబం, కామెడీ కలగలిసిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘అన్బే డయానా’ (Anbe Diana) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు అబ్బాయి, ఆంగ్లో-ఇండియన్ అమ్మాయి మధ్య పుట్టే ప్రేమ, ఆ తర్వాత కుటుంబాల్లో మొదలయ్యే రచ్చ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. మరి వీళ్ల ప్రేమ ఎలా మొదలైంది ? కుటుంబాలు ఎందుకు అడ్డుపడ్డాయి ? చివరికి ప్రేమ గెలిచిందా ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
చెన్నైలోని పెరంబూర్ నేపథ్యంలో కథ సాగుతుంది. సంప్రదాయ కుటుంబానికి చెందిన తెలుగు కుర్రాడు చిరుమామిళ్ల సీతాకృష్ణ, అంటే CSK. తన కాలేజ్‌మేట్ మ్యాజిక్ డయానా డిసౌజాతో ప్రేమలో పడతాడు. డయానా మాత్రం మొదట్లో అతని ప్రేమకు పెద్దగా ఆసక్తి చూపదు. కానీ అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం వీరిద్దరినీ దగ్గర చేస్తుంది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. అక్కడి వరకు అంతా బాగానే ఉన్నా, అసలు సమస్య ఆ తర్వాతే మొదలవుతుంది. ఇద్దరి కుటుంబాల నేపథ్యాలు వేరు కావడంతో పెద్దలు ఈ సంబంధాన్ని అంత ఈజీగా అంగీకరించరు. సంప్రదాయాలు, కుటుంబ విలువలు, పాత మనస్పర్థలు ప్రేమికుల మధ్యకు వస్తాయి. ఒకరి కుటుంబ ఆచారాలను మరొకరు పాటించాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. దీంతో ప్రేమకథ కాస్తా కుటుంబాల మధ్య జరిగే ఫుల్ కామెడీతో గందరగోళంగా మారుతుంది.
అయితే ప్రేమ కోసం CSK ఏం చేయాల్సి వచ్చింది ? డయానా కుటుంబాన్ని ఒప్పించడానికి అతను వేసిన ప్లాన్స్ ఏంటి ? రెండు కుటుంబాల పెద్దలు తమ పాత అభిప్రాయాలను మార్చుకుంటారా ? చివరికి ఈ జంట ప్రేమను గెలిపించుకుంటుందా ? అనేదే సినిమాలో చూడాల్సిన అసలు ఫన్. ప్రేమకథతో పాటు కుటుంబ సంబంధాలు, కల్చరల్ డిఫరెన్సెస్, కామెడీని కలిపి కథను లైట్‌హార్టెడ్‌గా నడిపించారు.
పారి ఎలవళగన్ దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించిన ‘అన్బే డయానా’లో రమ్య రంగనాథన్ హీరోయిన్‌గా నటించారు. రోజా సెల్వమణి, చేతన్, పార్థిబన్ గోపీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. భరత్ శంకర్ సంగీతం అందించారు. ఈ సినిమా 2026 జూలై 17న థియేటర్లలో విడుదలైంది. ఆగస్టు 28 నుంచి SonyLIVలో ‘అన్బే డయానా’ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, కల్చరల్ డిఫరెన్సెస్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
Read Also : మూడేళ్ల క్రితం అదృశ్యమైన మహిళ… ఇప్పుడు మరో పేరుతో… సీను సీనుకో ట్విస్ట్