Bengali Crime Thriller: సైకో కిల్లర్స్ అంటే ఎలా ఉంటారు ? మనకున్న సినిమా జ్ఞానం ప్రకారం ఎప్పుడూ మనుషులను చంపుతూ, పోలీసులను పరిగెత్తిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో మాత్రం కిల్లర్ జంతువులను చంపుతూ ఉంటాడు. పిచ్చుకల తలలు నరికే వేటగాడు పోలీసులకు ఎలా చుక్కలు చూపించాడు ? అన్న స్టోరీ లైన్ తో రూపొందిన మూవీనే ‘బ్యాధ్’ (Byadh). 2022లో విడుదలైన ఈ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ లో వింత కేసులను డీల్ చేసే ఒక ప్రత్యేక విభాగం ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ ను లేజీ సీనియర్ ఇన్‌స్పెక్టర్ కనైచరణ్, కొత్తగా చేరిన పోలీస్ సౌవిక్ హ్యాండిల్ చేస్తారు. పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని గ్రామాల్లో వందలాది పిచ్చుకల తలలను ఎవరో ఒక ఆగంతకుడు దారుణంగా నరికి చంపేస్తుంటాడు. సాధారణంగా జంతు హింస కేసులను పోలీసులు పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ పిచ్చుకల హత్యల కేసు లాల్‌బజార్‌లోని ఈ ‘వింతైన కేసుల విభాగానికి’ బదిలీ అవుతుంది.
మొదట్లో ఇన్‌స్పెక్టర్ కనైచరణ్ ఈ కేసును చాలా తేలికగా తీసుకుంటాడు. కానీ సౌవిక్ పట్టుబట్టడంతో ఇద్దరూ కలిసి గ్రామాల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ క్రమంలో మృణాళిని అనే ఫోరెన్సిక్ నిపుణురాలి సహాయం తీసుకుంటారు. విచారణలో వారికి ఒక వింత వ్యక్తి గురించి తెలుస్తుంది. ఆ వ్యక్తి కేవలం పిచ్చుకలను చంపడమే కాకుండా, వాటి వెనుక ఒక పెద్ద సైకలాజికల్, హిస్టారికల్ ప్యాటర్న్‌ను ఫాలో అవుతున్నాడని గ్రహిస్తారు. ఈ పక్షుల హంతకుడు ఎవరు ? అనే దానికంటే అసలు ఎందుకు చంపుతున్నాడు? అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది.
ఇన్వెస్టిగేషన్ లో బెంగాల్ చరిత్రకు, పాతకాలపు మూఢనమ్మకాలకు, మూగజీవాల పట్ల మనుషులు చూపే క్రూరత్వానికి సంబంధించిన షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తాయి. చివరికి ఆ పిచ్చుకల వేటగాడు ఎవరు అన్నది కనిపెట్టారా ? అతని మానసిక స్థితి అలా అవ్వడానికి గల కారణం ఏంటి ? పోలీసులు అతడిని ఎలా పట్టుకున్నారు ? అనేదే ఈ 6 ఎపిసోడ్ల థ్రిల్లర్ సిరీస్ కథ.
ఈ సిరీస్ చూస్తుంటే హంతకుడి మెంటల్ సిట్యుయేషన్ వెనుక ఉన్న కారణాలు ఏంటి ? మనం కూడా సమాజంలోని చిన్న చిన్న అన్యాయాలను ఎలా పట్టించుకోకుండా వదిలేస్తున్నాము అనే విషయాలను ఆలోచింపజేస్తుంది. రాజర్షి దాస్ భౌమిక్ రాసిన ‘చోరై హత్యా రహస్య’ అనే పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. అభిరూప్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ Hoichoiలో ఒరిజినల్ బెంగాలీ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది. అనిర్బన్ చక్రవర్తి, రజతావ దత్తా, ఖరాజ్ ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు డబ్బింగ్ మాత్రం అందుబాటులో లేదు.
Read Also: మనుషులను బంగారంగా మార్చే శాపం… ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు సినిమా