Survival Thriller Series OTT : ఒక గర్ల్స్ సాకర్ టీమ్ ప్రయాణిస్తున్న విమానం దట్టమైన అడవుల్లో కూలిపోతుంది. దీంతో వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. మొదట అందరూ కలిసి బతకడానికి ప్రయత్నిస్తారు. కానీ రోజులు గడిచేకొద్దీ ఆహారం తగ్గిపోవడం, చలి పెరగడం, రక్షణ కోసం చేసే ప్రయత్నాలు విఫలం కావడంతో టీమ్ లోని అమ్మాయిలే వేర్వేరు గ్రూపులుగా విడిపోతారు. బతకడానికి వాళ్లు తీసుకునే నిర్ణయాలు ఎంత దారుణంగా మారతాయంటే… 25 ఏళ్ల తర్వాత కూడా ఆ సంఘటన వాళ్లను వెంటాడుతూనే ఉంటుంది. సర్వైవల్, సైకలాజికల్ హారర్, మిస్టరీ వంటి అంశాలన్నీ ఉన్న సిరీస్ ‘ఎల్లోజాకెట్స్’ (Yellowjackets). మరి ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడ ? అంటే…
1996లో న్యూజెర్సీకి చెందిన వైస్కాయోక్ హై స్కూల్ గర్ల్స్ సాకర్ టీమ్ జాతీయ ఛాంపియన్ షిప్ కోసం సియాటిల్ కు బయలుదేరుతుంది. టీమ్ లో షానా, జాకీ, టైస్సా, నటాలీ, మిస్టీ, లోటీ వంటి అమ్మాయిలు ఉంటారు. విమాన ప్రయాణం మొదట సరదాగానే ఉంటుంది. కానీ వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం మార్గాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. కొద్దిసేపటికే విమానంలో తీవ్రమైన సమస్య తలెత్తి అది కెనడా సమీపంలోని మారుమూల అడవుల్లో కూలిపోతుంది. పైలట్లు, కోచ్ సహా పలువురు అక్కడికక్కడే చనిపోతారు. మిగిలినవాళ్లు గాయాలతో బయటపడతారు.
మొదట టీమ్ అంతా కలిసి బతకడానికి ప్రయత్నిస్తుంది. గాయపడిన వారికి చికిత్స చేయడం, నీరు, ఆహారం వెతకడం, రాత్రికి ఆశ్రయం ఏర్పాటు చేయడం వంటి పనులు మొదలవుతాయి. మిస్టీ తనకు ఉన్న నైపుణ్యాలతో గాయపడిన వారికి సహాయం చేస్తుంది. కానీ విమానంలోని కమ్యూనికేషన్ పరికరాలు దెబ్బతినడంతో ఎవరైనా తమను గుర్తిస్తారనే ఆశ తగ్గిపోతుంది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారతాయి. అడవిలో వాతావరణం మరింత కఠినంగా మారుతుంది. ఆకలి, చలి, భయం వాళ్ల ఆలోచనా విధానాన్ని మార్చేస్తాయి. లోటీకి విచిత్రమైన విజన్స్ కనిపించడం మొదలవుతుంది. కొందరు వాటిని మానసిక భ్రమలుగా భావిస్తే, మరికొందరు అడవిలో ఏదో అతీంద్రియ శక్తి ఉందని నమ్మడం మొదలుపెడతారు.
ఇదే సమయంలో కథ 25 ఏళ్ల తర్వాతి కాలానికి మారుతుంది. అప్పటికి ఆ ప్రమాదం నుంచి బయటపడిన కొద్దిమంది తమ తమ జీవితాల్లో స్థిరపడిపోయినట్టు కనిపిస్తారు. కానీ గతంలో అడవిలో ఏం జరిగిందో వాళ్లు పూర్తిగా బయటకు చెప్పలేదు. ఆ రహస్యం మళ్లీ బయటకు వస్తుందనే భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. వాళ్లు నిజంగా అడవిలో ఎలా బతికారు ? ఆ 19 నెలల్లో ఏం జరిగింది ? వాళ్లలో కొందరు ఎందుకు తమ గతాన్ని దాచుకుంటున్నారు ? అడవిలో మొదలైన ఆ భయంకరమైన సంఘటనలు 25 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు వాళ్లను వదలడం లేదు ? అనేది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.
Also Read : అయ్యబాబోయ్ ఆ అద్దంలో డెవిల్ ఉందంట… సీక్రెట్ టెస్ట్ చేయబోతే మైండ్ బ్లాకయ్యే సీన్స్… వైరల్ అవుతున్న హారర్ మూవీ
‘ఎల్లోజాకెట్స్’ అమెరికన్ థ్రిల్లర్ డ్రామా సిరీస్. మెలనీ లిన్స్కీ, క్రిస్టినా రిచ్చి, టానీ సైప్రస్, జూలియట్ లూయిస్ మెయిన్ లీడ్స్ గా నటించారు. JioHotstarలో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ నాలుగు సీజన్లుగా కంటిన్యూ అవుతోంది. నాలుగో సీజన్ 2026లో చివరి సీజన్‌గా రావాల్సి ఉంది. ఇక ఈ సిరీస్ తెలుగులో లేదు.