తొందరపడి ఓ కోయిల ముందే కూసింది.. అన్నట్టుగా ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. బీఆరెస్ మాత్రం ఇప్పట్నుంచే మార్పు రాజకీయమంటూ కొత్త రాగమందుకుంది. 20న జగిత్యాలలో జరిగే బహిరంగ సభ నుంచి ఈ నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. జీవన్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునే ఈ వేదికపై నుంచి కేసీఆర్ మాట్లాడనున్నారు. దీంతో ఈ బహిరంగ సభకు ప్రాధాన్యత సంతరించుకున్నది. శనివారం కేసీఆర్, హరీశ్‌రావులు సభాస్థలాన్ని పరిశీలించారు.
కేసీఆర్ ఈ సభా వేదిక నుంచి ఏం మాట్లాడుతారా? అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొన్నది. దాదాపు ఆయన ఓటమి తరువాత బయటకు రాలేదు. అసెంబ్లీ సెషన్స్‌కు కూడా హాజరుకావడం లేదు. ఫామ్‌హౌజ్‌కే కేసీఆర్ పరిమితమవుతున్నారని కాంగ్రెస్ నేతలు ఎన్ని విమర్శలు చేసినా.. ఆయన స్పందించలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి హాజరవుతారని భావించినా..దాన్ని కూడా ఆయన క్యాన్సల్ చేసుకున్నారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆరెస్‌లో చేరారు. దీని కోసం ఓ పబ్లిక్ మీటింగును ఏర్పాటు చేసి.. బీఆరెస్ యాక్టివ్ కావాలని భావిస్తోంది. మరి కొంత మంది నేతలను పార్టీలోకి లాగాలనే ప్రయత్నమూ చేస్తున్నది.
అయితే జగిత్యాల నుంచే మార్పు జరగనుందని, ఈ సభ కీలకం కానుందని బీఆరెస్ నేతలు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. మార్పు అనే నినాదం నిజానికి కాంగ్రెస్‌ది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయింది. పదేళ్ల పాటు బీఆరెస్ పాలన కొనసాగిన నేపథ్యంలో.. చాలా వర్గాలు కేసీఆర్ పాలనపై అప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. దీన్ని గమనించే కాంగ్రెస్ మార్పు జరిగితే ప్రజలకు మేలు జరుగుతుందనే నినాదాన్ని తీసుకున్నది. దీనికి జనం నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. పదేళ్ల పాలన ప్రజల కోసం కాకుండా.. నియంతలా సాగిస్తున్నారని, అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజా పాలనను తీసుకొస్తామని కూడా ప్రచారం చేసుకున్నారు. దీనికి బాగా కనెక్టయ్యారు జనం.
మరిప్పుడు బీఆరెస్ ఎత్తుకున్న ఈ కొత్త రాగం మార్పు… పై జనం ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఎన్నికల్లేవు. దరిదాపుల్లో కూడా లేవు. మరి మూడేండ్ల ముందు నుంచే మార్పు మార్పు.. అని అంటే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తి చేసుకుంటున్నది. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నది. ఇంకా చేయాల్సి ఉన్నది. పింఛన్లు పెంచాల్సి ఉన్నది. ఇవన్నీ చేసేందుకు సర్కార్ దగ్గర టైం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ బయటకు రానున్నారు. జగిత్యాల బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారని బాగా ప్రచారం చేసుకుంటున్నది గులాబీ దళం. ఆయన బయటకు రావాలనే కోరుకుంటున్నారు ఆ పార్టీ నేతలు.
కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితం కావడం… కేటీఆర్ అంతా తానై వ్యవహరించడంతో చాలా మందికి పార్టీ దూరమైంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న గులాబీ దళానికి దిశా నిర్దేశం చేసేవాళ్లు కరువయ్యారు. పార్టీ పదవులు లేక ఎంతో కాలమైంది. కేసీఆర్ ఇకనైనా పార్టీ వ్యవహారాలను పట్టించుకుంటే బాగుండనే అభిప్రాయం మెజారిటీ కార్యకర్తల నుంచి వస్తోంది. మరోవైపు కవిత కొత్త పార్టీ ఈనెల 25న ప్రకటించనున్నారు. పార్టీ ప్రకటన తరువాత ఆమె మరింత దూకుడుగా ముందుకు సాగేందుకు ప్రణాళికలు రెడీ చేసుకున్నారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు టార్గెటెడ్ గా ఆమె రాజకీయ విమర్శనాస్త్రాలు సంధిస్తారని, అవి పార్టీని మరింత ఇరకాటంలో పడేస్తాయనే భావనలో గులాబీ శ్రేణులున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలోకి వచ్చే వలసలపై కాకుండా.. ఉన్నవారిని పట్టించుకోండి సారు..!అనే నినాదం వస్తుంది. మార్పు రాజకీయాలేమో గానీ, మనం ముందు మారుదామనే అభిప్రాయాలు అక్కడి నుంచి వస్తున్నాయి.