కత్తి నాది కాదు.. నెత్తీ నాది కాదు..! అట్లనే ఉన్నాయి బీజేపీ రాజకీయాలు. గవర్నర్‌తో తమిళనాట ఆడిస్తున్న రాజకీయ క్రీడలో నవ్వుల పాలవుతున్నది కేంద్రం. దేశం కోసం.. ధర్మం కోసమనే ట్యాగ్‌లైన్‌తో కొనసాగుతూ.. తామేమి చేసినా చెల్లుబాటవుతుందనే దోరణిలో సాగుతున్న బీజేపీ పెద్దల వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. పిల్లికి చెలగాటం… ఎలుకకు ప్రాణ సంకటం అనే సామెత గుర్తుంది కదా..! ఇక్కడ పిల్లి పాత్ర పోషిస్తూ బీజేపీ పైశాచికానందం పొందుతున్నట్టుగా భావిస్తున్నారు. కానీ ఎలుకకు ప్రాణ సంకటంలా.. ఇక్కడ విజయ్‌కు ప్రాణ సంకటం లేదు. రీల్ హీరోగా సక్సెసయినట్టుగానే.. ఇక్కడి పరిస్థితులు ఆయన్ను రియల్ హీరోగా చేస్తున్నాయి.
కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు.. బీజేపీ పెద్దలు విజయ్‌ను రాజకీయ పరిణతి సాధించిన రాజ నీతిజ్ఞుడిగా ఎలివేట్ చేయడంలో తెలియకుండానే పావులుగా మారుతున్నారు. కానీ అవేవీ పట్టించుకునే స్థితిలో కేంద్రం లేదు. ఇక్కడ గవర్నర్ ఒక పావు మాత్రమే. తానూ ఆరెసెస్, బీజేపీ నుంచి వచ్చిన బ్రీడే. అందుకే ఇలా ఆటలో మజాను వెతుక్కుంటున్నారు. ప్రజాస్వామ్యంతో ఆడుకుంటున్నారు. నెంబర్ గేమ్ అనే సాంకేతిక అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని ఓ రకంగా సైకోలాగే ప్రవర్తిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీని వల్ల బీజేపీ నిజ స్వరూపం మరింత బట్టబయలు కావడమే గానీ, అంతిమంగా అక్కడ విజయ్ సీఎం పీఠమెక్కడమే ప్రజాస్వామ్య విజయంగా జనం డిసైడ్ చేసేసుకున్నారు. ఈ చర్యలతో బీజేపీ ఇక్క తమిళనాడుకే విలన్‌గా మారలేదు. చాల మంది ఆ పార్టీ తీరును గమనిస్తున్నారు. బీజేపీకి వచ్చిన సీటు ఒక్కటే. అక్కడ ఆ పార్టీ ఉనికే లేదు. కానీ రెండు ప్రధాన ప్రతిపక్షాలైన అన్నా డీఎంకే, డీఎంకే ను కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.. మీకు మాత్రం కానీయమనే కక్ష పూరిత ధోరణి కేంద్రం క్రిమినల్ మనస్తత్వాన్ని సూచిస్తుందనే విమర్శలు వెల్లు వెత్తాయి.
తమిళనాడు రాజకీయ చరిత్రలోనే ఇలాంటి రిజల్టు, ఘటనలు మొదటిసారంటున్నారు. అయితే విజయ్‌కు ఇది ఆదిలోనే మంచి రాజకీయ పరిపక్వతను ప్రదర్శించే చాన్స్‌ను ఇచ్చింది. తమకు కాకుండా.. వేరే వారికి ప్రభుత్వం ఏర్పాటే చేయించే చాన్సిస్తే.. తామంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని విజయ్ ప్రకటించడం కూడా అక్కడ బీజేపీ వికృత రాజకీయ క్రీడకు అద్దం పడుతున్నదంటున్నారు. ఇప్పటికే స్టాలిన్ చెప్పేశాడు విజయ్‌కు చాన్స్ ఇవ్వండని. తాజాగా అన్నాడీఎంకే ప్రతినిధులూ కామెంట్లు చేశారు.. మీమిద్దరం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే.. అసాధ్యం… అలాంటి ప్రచారాలు కట్టి పెట్టండని. అయినా గవర్నర్ తిక్కగా, మొండిగా ప్రవర్తిస్తే పోయే ఇజ్జత్ వారిదేనంటున్నారు. మోడీ, అమిత్‌షా ద్వయం.. చేస్తున్న రాజకీయం పై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.
నవ్విపోదురు మాకేటీ సిగ్గు అన్నట్టుగా ఇప్పటి వరకు ప్రవర్తించిన తీరు. .ఇకపై కూడా అదే విధానంతో కొనసాగుతున్న వైనం.. విజయ్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా సాగుతోందంటున్నారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో కేసీఆర్ కూడా తెలంగాణలో ప్రతిపక్షం లేకుండ చేశాడు. తానేం చేసినా అది తెలంగాణ కోసమేనని ఇక్కడి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడు. అప్పటి పరిస్థితుల్లో అంతా సైలెంట్‌గా ఉండిపోయారు. మౌనం అంగీకారంగా.. తామేం చేసినా జనం మా వైపే ఉన్నారనే అధికార దర్పం నడుమ తీసుకునే నిర్ణయాలు.. ఆ తరువాత గుణపాఠాలే నేర్పుతాయంటున్నారు.
అది తెలంగాణలో నిరూపితమైంది. తమిళనాట ఇలాంటి రాజకీయ చర్యలకు దిగి.. దేశం కోసం… ధర్మం కోసం.. అని నెపంతో సాగుతున్న డ్రామా వెనుక కాంగ్రెస్‌ను ఉనికి లేకుండా చేయాలనే విపరీత ప్రయత్నం దాగుందనే విషయం తెలిసిపోతూనే ఉన్నది. ఇక తమిళనాట భవిష్యత్తులో ఎన్డీయేతో జత కట్టాలన్నా పార్టీలు ముందుకు రాని పరిస్థితి అక్కడ వచ్చేసింది. ఇది ఒక రకంగా కాంగ్రెస్‌కు మరింత జీవం పోసినట్టే అయ్యింది. ఒకరు చావాలని కోరుకుంటే.. అది తన చావుకే వచ్చిందట.. అదే జరగబోతుంది అనిపిస్తున్నది తమిళ రాజకీయాల్లో.