బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరైంది. ఆ బెయిల్ కోసం బండి సంజయ్.. వాళ్ల కుటుంబ సభ్యులు ఎంతలా ఎదురు చూశారో తెలియదు కానీ.. అంతకన్నా ఎక్కువగా, ఆత్రుతగా, దీక్షగా.. ఆరెస్ ప్రవీణ్‌కుమార్, బీఆరెస్ పార్టీ ఎదురుచూసినట్టుంది. ఇలా బెయిల్‌పై విడులయ్యాడో లేదో.. ప్రవీణ్ బయలుదేరాడు తనదైన మార్కు ఆరోపణలను వెంటేసుకుని! ఏమన్నాడో తెలుసా? భగీరథ్‌కు బెయిల్ రావడమంటేనే.. రేవంత్ సర్కార్ సహకారం అందించినట్టేనన్నాడు.
రేవంత్ తన మిత్రధర్మంలో భాగంగానే.. ఈకేసులో చేయాల్సిన వాదనలు చేయలేదని, తన పోలీస్ వ్యవస్థను నిమిత్తమాత్రంగా ఉంచడం మూలంగానే బెయిల్ సాధ్యమైందనేది ఆరెస్ ప్రవీణ్ వాదన. నవ్వుతెప్పిస్తుందా? అప్పుడే కాదు.. ఆగండి ఇంకా నవ్వుకునే ముచ్చట కూడా చెప్పాడు. తెలంగాణ మహిళలారా, మైనర్ బాలికలారా, మన ధన మాన ప్రాణాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సురక్షితంగా ఉన్నాయని ఇంకా నమ్ముతున్నారా? అని జనాన్ని అడిగారు.
ఏ సర్కారైనా.. ఇక్కడ బీఆరెస్ ఉన్నా.. ఆడవాళ్ల మీద దాడులు, అత్యాచారాలు.. పోక్సో కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించవు. అలా చేయడానికి కూడా సాహసించవు. ఎందుకంటే.. అంతకన్నా సర్కార్‌కు బద్నాం మరొకటి ఉండదు. బండి భగీరథ్ కేసు విషయంలో ఇప్పటికే సర్కార్‌ను ఎంత బద్నాం చేయాలో అంత చేసేందుకు బీఆరెస్, బీఆరెస్ సోషల్ మీడియా టీం విశ్వప్రయత్నం చేసింది.
కొంత దిగజారి ప్రవర్తించారు. పోస్టర్ల రాజకీయాలతో చులకనయ్యారు. వాస్తవానికి, సర్కార్ ఈ విషయంలో ఎలాంటి పార్శాలిటీ చూపలేదు. అలసత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నం కనబడలేదు. బండి సంజయ్ వల్లే ఈ కేసు విచారణలో జాప్యం జరిగిందనే దాంట్లో వాస్తవం లేకపోలేదు. ఇది రేవంత్ మెడకు చుట్టే ప్రయత్నం జరిగింది. దీన్ని గ్రహించిన రేవంత్ వెంటనే తేరుకున్నారు. డీజీపీ ని సైతం ఈ విషయంలో చురకలంటించిన సందర్బాన్ని చూశారు జనం.
బండి సంజయ్‌కు కూడా తత్వం బోధపడ్డది. ఎంత లేట్ చేస్తే అంత బద్నాం అవుతానని గ్రహించాడు. అందుకే తానే కొడుకును అప్పగిస్తున్నట్టు ప్రకటించి మరీ బండి భగీరథ్‌ను బయటకు తీశాడు. ఇక కేసు విచారణలో ఎక్కడా లోపం లేదు. జాప్యం లేదు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి ఇంకా సెక్షన్లు యాడ్ చేశారే గానీ, దీని తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయలేదు. కానీ కేవలం రాజకీయం కోసమే బీఆరెస్ దీన్ని ఎక్కువ చేసిచూపే ప్రయత్నం చేసింది.
ఓవర్ యాక్షన్ చేశారనే విమర్శలూ ఎదుర్కొన్నది. ఇప్పుడు బెయిల్‌పైనా మళ్లీ తమదైన మార్కును వదల్లేదు బీఆరెస్. ఇవాళ కేటీఆర్ రైతుల ఇష్యూ మాట్లాడిన సందర్బం బాగుంది. సబ్జెక్టు పరంగా , వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలా చేసే విమర్శలు హుందాతనాన్ని తెచ్చిపెడతాయి. బాధితుల పక్షం వహించారనే మంచి గుర్తింపు వస్తుంది. పార్టీకి కూడా మేలు జరుగుతుంది. సబ్జెక్టు పరంగా చేసే విమర్శలు, వాస్తవాలను అద్దం పట్టే విమర్శలు నాయకులను జనాల్లో మరింతగా చేరువయ్యేలా చేస్తాయి. కానీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని భావిస్తే.. పట్టించుకోరు! పైగా జోకర్లుగా కూడా చూస్తారు.