బండెనక బండిగట్టి పదహారు బండ్లు గట్టి.. ! ఈ పాట అందరికీ గుర్తెండే ఉంటుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో రచించిన అత్యంత ప్రసిద్ధ జానపద పోరాట గీతం. ఇప్పుడు ఈ పాటెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? ఆ బండ్లు వరుసగట్టినట్టే.. ఇక్కడ తెలంగాణ భవన్‌లో గులాబీ నేతలు వరుసగడుతున్నరు.
ఆ బండ్లు పోరాటానికైతే.. ఈ నేతల క్యూ ప్రెస్‌మీట్ల కోసం. అవును! బీఆరెస్ ఇప్పుడు ప్రజా ఉద్యమాలు మరిచింది. అయితే ప్రెస్‌మీట్లు, లేదా ప్రెస్‌నోట్లు.. ట్విట్టర్ పిట్టగూట్లో సందేశాలు.. సోషల్ మీడియాలో ప్రచారాలు.. !ఇవే ఇప్పుడు కేటీఆర్ సారథ్యంలో జరుగుతున్న పార్టీ విస్తృత కార్యక్రమాలు.
ఇప్పుడు జనాల్లోకి పోయి చేసేదేముంది? అనుకున్నారో.. ఎన్నికలు ఇప్పుడు లేవు కదా అని సరిపెట్టుకుంటున్నారో..! మమ్మల్ని ఓడగొట్టినందుకు ఇంతకు ఇంతా అనుభవించాలి ఇంకా అనే కసి మీద ఉన్నారో.. తెలియదు కానీ.. జనంలోకి పోవడం లేదు. అయితే ఫంక్షన్ హాళ్లలో పార్టీ కార్యకర్తలతో మీటింగులు. లేకపోతే తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్లు.. అంతే నడుస్తున్నది ఇప్పుడు గులాబీ పార్టీ ఆక్టివిటీస్.
అక్కడ ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ పుర్సత్.. ఇక్కడ రామన్న డైరెక్షన్‌లో సోషల్ మీడియాలో పార్టీ వంద స్పీడ్‌తో రయ్యిన ఉరకలు. అంతే ఇక మళ్లీ మేమే.. మేమే వస్తున్నాం.. మాదే రాజ్యం.. అని చెప్పుకుంటూ రోజులు లెక్కబెట్టుకుంటున్నారు. కాలం వెళ్లదీస్తున్నారు. అంతే తప్ప జనాల్లోకి వెళ్లడం లేదు. ప్రజా ఉద్యమాలు చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటంటే ఒక్క పిలుపు కూడా లేదు ఓడిన నాటి నుంచి.
కేటీఆర్ చేతిలో స్టీరింగ్ అలా ఇక్కడే పరిభ్రమిస్తుందన్నమాట. ముందుకు పోవడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం జోరుగా ఉందనే రిపోర్టులు వస్తున్నాయి. కేటీఆర్‌కు కూడా ఇదే కావాల్సింది. ఆ సోషల్‌మీడియాలో మనం నిత్యం ఉండాలె. అవే మనల్ని గెలిపిస్తాయి..! అని డిసైడ్ అయిపోయాడు. ఈ ముచ్చటను బహిరంగంగానే చెబుతూ వస్తున్నాడు కూడా. ఇక ఇప్పుడు అసలు విషయానికొద్దాం..
పొద్దున లేచిన కాడ్నుంచే తెలంగాణ భవన్‌ను బుక్ చేసుకుంటున్నారు నేతలు. ప్రెస్‌మీట్ల కోసం పోటీలు పడుతున్నారు. రేపు దేని మీద ప్రెస్‌మీట్ పెట్టాలో రాత్రే కూర్చుని డిసైడ్ చేసుకుంటున్నారు. అయినా తట్టలేదనుకో.. పొద్దున్నే పేపర్లు తిరిగేసి.. ఓ కంటెంట్ క్రియేట్ చేసుకుని.. వెంటనే తెలంగాణ ఆఫీస్ బాయ్‌కు ఫోన్ చేసి.. ఏమోయ్.. మన ప్రెస్‌మీట్.. ఉంటుంది రేపు.. మెసేజ్ ఫార్వార్డ్ చెయ్..! అని చెబుతున్నారు.
ఈయన గారు చెప్పే లోపల ఆ ఆఫీసు బాయికి మరో పది ఫోన్లు వచ్చి ఉంటాయి. ఇక వీళ్ల టైములు సెట్ చేయలేక వాడు చస్తున్నాడు రోజు. సార్.. ప్లీజ్ ఈ టైమ్ బాగా బిజీ ఉంది సార్.. ఇంకా వేరే వాళ్లున్నారు. మీరు మార్చుకోండి..పోస్ట్‌పోన్ చేసుకోండని బతిమాలుకుంటున్నాడు. అలా ఒకరి ప్రెస్‌మీట్ అయిందో లేదో.. ఇంకొకడు రెడీగా ఉంటున్నాడు.
ఆ బీట్ చూసుకునే రిపోర్టక్లైతే తీరికే లేదనుకో. గవ్వ ఆమ్‌దానీ లేదు.. గడియ పుర్సత్ లేదు.. అన్నట్టు తయారయ్యింది. మరి వీళ్లు పెట్టిన ప్రెస్‌మీట్ల వార్తలు ఏ పేపర్లోనైనా కవరవుతాయా అంటే లేదు. ఒక్క నమస్తేలో తప్ప ఏ పేపర్లో రావు.. ఏ చానెల్‌లో రావు. మా చానెల్ మాకు లేదా? మా పేపర్ మాకుందిగా.. మా సోషల్ మీడియా ఉండనే ఉంది..పదుల యూట్యూబులు ఉండనే ఉన్నాయి.. మీరొస్తే ఎంత .. రాకపోతే ఎంత..? అని ఎవరినీ పెద్దగా పట్టించుకోవడం లేదు.
చిన్నబాస్ నజర్‌లో పడాలే.. అబ్బ రోజూ ఏం తిడుతుండురా బై.. దినాం ఇరాం లేకుండా ప్రెస్‌మీట్లు పెడుతుండు… ఈనికి కూడా ఏదైనా మంత్రి పదవి ఇయ్యాలె..అని అనుకోవాలని తపన.. మంత్రి పదవి పోతే పోనీ.. కనీసం ఏదైనా నామినేటెడ్ పదవైనా ఇయ్యకపోతడా? అని తండ్లాట. ఎందుకంటే వచ్చేది మనమే కదా? ఆరు నూరైనా.. నూరు ఆరైనా.. కారు రాకతప్పదు.. సారు బయటకు రాక మానడు.. ! ఇలా ఎంతో విశ్వాసంతో, ధీమాతో ఓ యుద్దంలా ప్రెస్‌మీట్లు పెట్టుకుంటూ తిట్టుకుంటూ కాలం గడుపుతున్నారు గులాబీ లీడర్లు.