తెలంగాణ నీటి వనరుల దోపిడీ, సాగునీటి అంశంపై కేసీఆర్ కు అపారమైన పట్టుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్ల పంపకాల పట్ల సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎలా దోపిడీకి గురవుతుందో వివరించి.. ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను విడమర్చి చెప్పడంలో కేసీఆర్ సక్సెసయ్యాడు. అందుకే ఆయన్ను జనం నమ్మారు. తెలంగాణ వస్తే ఇక్కడి భూములను ఎలా సస్యశ్యామలం చేసుకోవచ్చో.. కృష్టా, గోదావరి నీటిని ఏ విధంగా వినియోగించుకుని ప్రతి ఎకరాకూ సాగునీటిని ఎలా అందించవచ్చో.. విపులంగా చెప్పి.. ఉద్యమ స్పూర్తిని నింపిన వాడు కేసీఆర్. కానీ ఇన్నాళ్లకు కవిత బయటకు వచ్చి.. తన సొంత పార్టీ వేదికగా సాగునీటి వనరుల విషయంలో తీవ్ర అన్యాయం, మోసం చేసింది బీఆరెస్, కేసీయారేనని బహిరంగ సభ సాక్షిగా చెప్పడం కలకలం రేపింది.
పరోక్షంగా కేసీఆర్నే టార్గెట్ చేసింది. ఆయన పేరును ఎక్కడా తీయకుండానే, హరీశ్ రావు కమీషన్లకు ఆశపడి.. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో ఎత్తు పెంచాడని దీని వల్ల రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు రావాల్సిన దాదాపు ఏడు లక్షల ఎకరాల సరిపడే సాగునీరు రాలేదని, పదేళ్లలో రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం 33వేల కోట్లు ఖర్చు చేసి 33 ఎకరాలకు కూడా సాగునీటిని అందించలేకపోయారని ఆమె విమర్శించడం.. బీఆరెస్ పార్టీ ఆయువు పట్టుమీద దాడిగా చూస్తున్నారు. అంతే కాదు.. కాళేశ్వరం ద్వారా ఒక్క జిల్లాకు కూడా సాగునీరు అదనంగా అందలేదన్న ఆమె… ఒక్క మెదక్ జిల్లాకు మాత్రం కొంత మేర సాగునీరు ఇచ్చుకోగలిగారని చెప్పారు.
జూరాల సోర్స్‌ను వదిలి.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటి జలాల వాటాలను వాడుకుందామని డిసైడ్ కావడమే కేసీఆర్ చేసిన చారిత్రక తప్పని కవిత వాదించడం.. గులాబీ శ్రేణుల్లో కలకలం రేపింది. ఓ వైపు కాళేశ్వరం బీటలు వారింది.. నిరూపయోగమైంది… లక్ష కోట్లు వృథా అయ్యాయని కాంగ్రెస్ ముప్పుతిప్పలు పెడుతుంటే.. ఇప్పుడు కవిత కూడా దీనికి అదనంగా మొత్తం తెలంగాణ నీటి వనరుల విషయంలోనే తాము ఫెయిల్ అయినట్టుగా చిత్రీకరించడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు వైపుల నుంచి తమపై దాడి జరుగుతోంది. ఇతర అంశాలపైన దాడి జరుగుతున్న వేళ.. దాన్ని లైట్‌గా తీసుకున్న కేసీఆర్.. సాగునీటి వనరుల విషయంలో తాము ఫెయిల్ అయినట్టుగా అవినీతిమయంగా తమ పాలన కొనసాగినట్టుగా, తెలంగాణ ప్రజలకు సాగునీరందించే విషయంలో ఘోరంగా విఫలమైనట్టుగా జరుగుతున్న దాడిని మాత్రం తట్టుకోలేకపోతున్నారు.
ఇప్పటి వరకు కవిత చేసిన ఏ ఆరోపణకూ బీఆరెస్ స్పందించలేదు. స్పందించకపోతేనే ఆమె మాటకు విలువ ఇచ్చినట్టు కాదని అదో రాజకీయ వ్యూహంగా.. ముందుకు సాగుతున్నారు. కానీ నిన్న జరిగిన బహిరంగ సభ వేదికగా ఆమె విమర్శించిన తీరుపై అగ్గి మీద గుగ్గిలమే అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా రొటీన్‌గా జరిగే తిప్పికొట్టే వ్యూహాలు పన్నినా.. అది సరిపోదనే భావనలో గులాబీ శ్రేణులున్నారు. దీనిపై పార్టీ పరంగా ఖండన ఉండాల్సిందేననే అభిప్రాయం వెలువడుతున్న నేపథ్యంలో..అంతా కేసీఆర్ నిర్ణయం వైపే చూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ..తమ అభిప్రాయాన్ని విరవిస్తూనే కవిత చేసే ఆరోపణలకు కూడా మెల్లగా వివరణ ఇచ్చుకున్నట్టు మాట్లాడాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
దీంతో ఇవాళ హరీశ్ రావు ప్రెస్‌మీట్ పెట్టాడు. ప్రధానంగా మంత్రులు జూపల్లి, వివేక్‌లు ఇద్దరు నిన్న తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత- చేవెళ్ల కోసం బ్యారేజీ నిర్మాణం కోసం అవకాశాలు.. సమస్యలపై చర్చించేందుకు వెళ్లిన ఉదంతాన్ని తీసుకుని హరీశ్ విమర్శలు చేశారు. సాగునీటి లభ్యత.. కాళేశ్వరం అనివార్యత.. కాంగ్రెస్ అనుభవరాహిత్యం.. అవగాహనరాహిత్యం.. వీటన్నింటిపైనా దాడి చేశాడు. పరోక్షంగా కవితకు కూడా తన కౌంటర్లు వర్తిస్తాయనే దోరణిలో ఆయన ప్రెస్‌మీట్ సాగింది.