ఈ మాటలంటున్నది టీఆరెస్ పార్టీ నేతలు. అదే కవిత పార్టీ నేతలు. అవును.. ఆ రెండు పార్టీల మధ్య వార్ పీక్‌కు పోతున్నది. మొన్ననే కదా కవిత తన కొత్త పార్టీ పేరును టీఆరెస్ అని పెట్టుకున్నది. ఆ వెంటనే తోక తొక్కిన తాచులా కస్సున లేచింది బీఆరెస్. మేమే ఒరిజినల్ అని ప్రచారం చేసుకున్నది. తండ్రినే తిట్టే స్థాయి నీదా? నీకు పదవులు, ఇన్ని పైసలు ఎక్కడ్నించి వచ్చాయి? ఇలా ఒక్కొక్కటిగా బీఆరెస్ సోషల్ మీడియా వేదికగా ఆమెను కార్నర్ చేసే పనిని సీరియస్‌గా ఎత్తుకున్నది. దీనికి కౌంటర్‌గా ఘాటుగానే కవిత సోషల్ మీడియా కూడా జవాబిస్తూ వస్తున్నది. అయితే ఇవాళ బీఆరెస్ పార్టీ ..అదే కేసీఆర్ టీఆరెస్ పార్టీ ఆవిర్భావ దినం. దీనిపైనా సెటైర్లు వేస్తున్నది కవిత టీఆరెస్ పార్టీ.
టీఆరెస్ పార్టీ పుట్టిన రోజు కదా .. మరి బీఆరెస్ నేతలు ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఎవరికి శుభాకాంక్షలు చెప్పాలె? అని సెటైర్లు వేస్తున్నారు. అయితే ఇవన్నీ నడస్తున్న క్రమంలో ఆసక్తికరమైన ఓ టాపిక్‌ను కవిత టీఆరెస్ పార్టీ తెర మీదకు తెచ్చింది. చంద్రబాబుకు, కేసీఆర్‌కు పోలిక పెట్టి చూపుతున్నారు. ఓడిన తరువాత చంద్రబాబేం చేశాడు..? మీరేం చేస్తున్నారు? ఆయన జనం మీద అలిగాడా? ఫామ్‌హౌజ్‌కు పరిమితమయ్యాడా? అని నిలదీస్తున్నారు. ఇప్పుడీ చర్చ బీఆరెస్ పార్టీని డిఫెన్స్‌లో పడేస్తున్నది. కేసీఆర్ వైఖరి ఆది నుంచి అంతే.
ఉద్యమ సమయంలో కూడా ఆయన బయటకు వచ్చే సందర్భాలు తక్కువగా ఉండేవి. ఏదైనా ఉప ఎన్నికలో ఓడిపోయినా బయటకు వచ్చేవారు కాదు. ప్రకటనలు కూడా ఉండకపోయేవి. అసలు జనంతో సంబంధం లేదన్నట్టుగా, రాజకీయ పరిణామాలను గమనిస్తున్న నేతగా కనిపించేవారు కాదు. అవసరం ఉందనుకున్నప్పుడు, ఇక ఈ సమయంలో బయటకు రావాల్సిందేనని ఆయన డిసైడ్ అయితే తప్ప.. బయటకు వచ్చేవారు కాదు. ఇదిప్పట్నుంచే ఆయనకు అలవాటు. ఆయన బలాబలాలేమిటో కవితకు బాగా తెలుసు. అందుకే అదును చూసి ఇలా మాటల రూపంలో ఆ పార్టీ అధినేత టార్గెటెడ్‌గా ఆమె పార్టీ నుంచి కౌంటర్లుంటున్నాయి. చంద్రబాబు ఓడిన తరువాత కూడా జనంలో ఉండి పోరాడిన విషయం ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు కవిత టీఆరెస్ నేతలు.
బాబు పాపం.. ఆ వయస్సులో కూడా జైలుకు పోయి వచ్చాడు. జనం కోసం ఎక్కడా తగ్గలేదు.. పోరాడుతూనే ఉన్నాడు. జనాన్ని విడిచి ఆయన ఏనాడూ దూరంగా లేడు.. అని బాగా ప్రొజెక్టు చేస్తున్నారు. మీరు మాత్రం జనం ఓడగొట్టగానే.. ఫామ్‌హౌజ్ కే పరమితమయ్యారు. జనం మీద అలిగడం ఎంత వరకు కరెక్టు..? తమను ఓడించి జనం తప్పు చేశారనే విధంగా కేసీఆర్ వైఖరి ఉంటుందని విమర్శిస్తున్నారు కవిత పార్టీ నాయకులు. కవిత కూడా నేరుగా తండ్రినే టార్గెట్ చేస్తూ విమర్శనాస్ట్రాలు సంధిస్తున్నారు. కత్తి ఒకరి చేతికిచ్చి తనను యుద్దం చేయమంటే ఎలా? అని కేసీఆర్ అన్న మాటలను ఆమె ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. హైడ్రా బాధితులు కేసీఆర్.. అన్న నువ్వు రావాలె..! అని బాధతో పిలిస్తే.. కేసీఆర్ నుంచి ఇంత వెటకారపు మాటలా? అని జనానికి కేసీఆర్ వైఖరిని, ఆయనలోని అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.