తాజా రాజకీయాల్లో మైనర్ అనే పదం చాలా విస్తృతంగా, విరివిగా వాడబడింది. కారణం.. బండి భగీరథ్ కేసు అంశం. ఇప్పుడు చట్టం పరిధిలోకి వెళ్లింది. జైలు, విచారణ.. కొనసాగుతున్నాయి. ఇది సద్డిమణిగిందనుకుంటున్న తరుణంలో.. మైనర్ అనే పదాన్ని ఇప్పుడు బీజేపీకి తెరపైకి తీసుకువచ్చింది. బీఆరెస్ పదేళ్ల పాలనలో.. 29 మంది ఇంటర్మీడియట్ మైనర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనికి కేటీఆరే కారణమని ఆందోళన బాట పట్టింది బీజేపీ. ఎప్పుడో 2019లో జరిగిన సంఘటన ఇప్పుడే అకస్మాత్తుగా ఎందుకు ముందుకు వచ్చింది? అదీ బీజేపీ ఎందుకు తీసుకొచ్చింది? దీని వెనుక కారణమేంటీ? ఈ ప్రశ్నలకు పెద్దగా వెతుక్కోకుండా సమాధానాలు దొరికిపోయాయి.
బండి సంజయ్‌ను టార్గెట్ చేశాడు కేటీఆర్… కొడుకు కేసు విషయంలో. భగీరథ్ జైలుకు పోయిన తరువాత .. అది మా ఘనతేనని గొప్పులు చెప్పుకునే మీటింగు కూడా ఒకటి పెట్టుకుని అంతా తమకు తామే భేష్ భేష్ అని భుజాలు చరుచుకున్నారు. ఆ మరుసటి రోజే .. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ ఆధ్వర్యంలో కేటీఆర్ టార్గెట్‌గా ఈ పాత కేసును తీశారు. మళ్లీ తెలంగాణ సమాజానికి ఆనాటి పరిస్థితులు గుర్తు చేశారు. ఇంటర్ ఫలితాలను లెక్కించేందుకు ఓ ప్రైవేటు సంస్థ.. గ్లోబరీనాకు అప్పగించడమే బీఆరెస్ చేసిన అతిపెద్ద తప్పిదంగా అప్పుడంతా సర్కార్‌పై దుమ్మెత్తి పోశారు. ఆ సంస్థ చేసిన వాల్యూయేషన్ కారణంగానే ఈ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు.
దీంతో అప్పుడు సర్కార్ హడావుడిగా రీ వాల్యూయేషన్ చేపించింది. మార్కులు అధికంగా రావడంతో చాలా మంది పిల్లల జీవితాలతో ఈ సంస్థ ఆడుకున్నదని, దీనికి కారణం కేటీఆరేనని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు ఆందోళన బాట పట్టాయి. ఆ 29 మంది ఇంటర్ మైనర్ విద్యార్థుల బంగారు జీవితాలను ఛిదిమేసిన పాపం.. కేటీఆర్‌కే తగులుతుందని సర్వత్రా మండిపడ్డారు. తీవ్ర విమర్శలనెదుర్కొన్నది కేసీఆర్ సర్కార్. కానీ దీనిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు కేటీఆర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలేదు.. ఆ గ్లోబరీనా సంస్థపై విచారణ లేదు.. చర్యలూ లేవు. అలా గడిచింది అప్పుడు బీఆరెస్ పాలన.
మరి ఇంతకాలం తరువాత ఇప్పుడే ఎందుకు గుర్తు చేసుకుంటున్నది బీజేపీ? అంటే.. బండి సంజయ్ ఇమేజీని డ్యామేజీ చేసే విధంగా పోస్టర్లు అతికించడం, మెట్రో రైలులో ప్రచారం చేయించడం.. తన సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టింగులు పెట్టించడం.. ఇవన్నీ బీజేపీని ఇబ్బంది పెట్టాయి. ఇదంతా కేటీఆర్ రాజకీయంగా చేస్తున్న కుట్రగా వారంతా అభిప్రాయపడ్డారు. దొరికింది మోఖా అని బండి భగీరథ్ కేసును అడ్డం పెట్టుకుని .. బండి సంజయ్ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనే ఏకైక లక్ష్యంతో కేటీఆర్ ఇదంతా చేశాడని బీజేపీ గుర్రుగా ఉంది. తాము మోఖా కోసం చూస్తూనే.. గతంలో చేసిన పాపాల లిస్టులో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య.. లిస్టును బయటపెట్టారు బీజేపీ శ్రేణులు. మైనర్లయిన 29 మంది విద్యార్థుల బంగారు జీవితాలను కాలరాసిన కాలయముడు కేటీఆర్.. అని తెలంగాణ సమాజానికి మరోసారి గుర్తు చేయడం ద్వారా తన రాజకీయ ప్రత్యర్థిపై ఇలా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నది బీజేపీ.