ఆయన కేసీఆర్ కేబినెట్‌లో వ్యవసాయశాఖ మంత్రిగా చేశాడు. వయసులో పెద్దాయన. కేసీఆర్ సరదాగా మా భీముడు.. అని కూడా పిలిచేవాడు వేదికల మీద. లక్ష్మీ పుత్రుడు అని ఉబ్బిచ్చేవాడు. ఈ మాటకు ఆ పెద్దాయన కూడా ఉబ్బితబ్బిబ్బయ్యేవాడు. కానీ ఇప్పుడు పార్టీ మారిన తరువాత బాన్సువాడ వదిలి రావడం లేదు. సెక్రటేరియట్ ఛాయలకు కూడా వచ్చినట్టు కనిపించడం లేదు. సీఎంతో భేటీ అంటే.. అప్పుడెప్పుడో రెండున్నరేండ్ల ముందు సర్కార్ ఏర్పడిన తరువాత పార్టీ మారేందుకు వచ్చి కండువా కప్పించుకుని వెళ్లిపోయాడు. నేను చెప్పేది ఎవరి గురించో అర్థమైపోయింది కదా? ఇక పేరు చెప్పాల్సిన అసవరమే లేదా? అయితే సరే! అసలు విషయంలోకి వెళ్దాం.
ఇప్పుడా లక్ష్మీ పుత్రుడు, భీముడు.. కాంగ్రెస్ సర్కార్‌లో లేడు.. అటు బీఆరెస్ మనిషీ కాడు. అట్లనే ఉంది మరి పరిస్థితి. వాస్తవానికి, ఆయన్ను ఎవరూ పిలవలేదు. కానీ వెంటనే పార్టీ ఎందుకు మారాడో తెలియదు. దీనికి కారణం.. తన నియోజకవర్గంలో అభివృద్ధి కోసమని చెప్పుకొచ్చాడు. కొడుకు ఒత్తిడికి తట్టుకోలేకో.. ఐదేండ్లు ప్రతిపక్షంలో ఉంటే.. మమ్మల్ని పట్టించుకునేవాడే ఉండడనే భయమో.. అధికారం అనుభవించి ఇంచి ఒక్కసారిగా దూరం కావడం తట్టుకోలేకో.. ఏదో ఒకటి.. మొత్తానికి రేవంత్ పంచన చేరాడు.
పెద్దాయన కదా.. అదీ వ్యవసాయశాఖ మంత్రిగా అనుభవం ఉండేనాయె. అందుకే వ్యవసాయ శాఖకు ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. కానీ ఒక్క రైతు పండుగకూ ఆహ్వానం లేదు ఇంత వరకు. రైతు ఆశీర్వాద సభకూ పిలవలేదు. పిలవని పేరంటానికి వెళ్లేందుకు ఆయనేమైనా ఆషామాషీ లీడర్ కాదు. థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ… లెక్కన్న మాట!
ఓ వైపు కేటీఆర్ వస్తడు.. తిట్టిపోతడు. అక్కడున్న బీఆరెస్ వాళ్లంతా బాన్సువాడల మోపై.. మీటింగు పెట్టి తిట్టీ తిట్టీ దుమ్మెత్తిపోసి పోతరు. ఇది చాలదంటూ పక్కలో బళ్లెంలెక్క అక్కడ్నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఏనుగు కూడా ఘీంకరించి పోతడు. ఇంచార్జి నేను… ఇక్కడ ఇసుక వ్యాపారాలు మావీ.. కాంట్రాక్టులు మావీ.. అని వాటాల లెక్కలు లేవంటాడు. అంతా మాకే అంటాడు.
ఈ వాటాల లెక్కలు, నిధుల లేమీ.. పట్టించుకోవడం లేదనే కోపం.. ఫోన్లు కూడా ఎత్తరా? అనే అసహనం అంతా బయటకు వచ్చి మొన్న పొట్టు పొట్టు సీఎంను అర్సుకున్నడు పెద్దాయన. ఇగ అప్పట్నుంచి అజ్ఞాత వాసమే అన్నట్టు. బయటకు రావడం లేదు. పార్టీ కార్యక్రమాలకు దూరం. మొన్న ఉత్తమ్‌నే పిలిపించుకుని, కొన్ని నిధులు కూడా విడుదల చేపించుకున్నాడు. మరి కులం చెడ్డా సుఖం దక్కాలే కదా!
ఇన్ని తిట్లు పడి.. ఇంత బద్నామయినంక.. కనీసం నిధులన్నా రప్పించుకోకపోతే.. .పనులన్నా చేపించుకోకపోతే.. ఇంకా పట్టుమని రెండేండ్లు కూడా లేదాయె..! ఇక్కడ ఈయన ఇంతటితో సరిపెట్టుకున్నాడు. అక్కడ వాళ్లు ఈయనను పిలవడమే మరిచినట్టున్నారు. లేదా లిస్టుల నుంచి పేరే తీసేసినట్టున్నారు. ఇందంతా చూస్తున్న బీఆరెస్ వాళ్లు మాత్రం .. బాగైంది.. బాగైంది.. అని చంకలు గుద్దుకుంటున్నారంట..