కొత్త పార్టీ పెట్టే సమయం ఆసన్నమైంది. కవిత మరింత దూకుడును పెంచారు. కేసీఆర్ జగిత్యాల సభ నేపథ్యంలో కవిత ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ దేవుడే.. కానీ చుట్టూ దయ్యాలున్నాయని కవిత గతంలో ఆరోపించారు. ప్రస్తుతం ఒక్కొక్కరిగా అందరిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆమె దేవుడిగా అభివర్ణించిన కేసీఆర్‌నూ వదల్లేదు. కేసీఆర్ సభ తీరు తెన్నులను ఆమె లోతుగా విశ్లేషించారు. కేసీఆర్ ప్రసంగాన్ని కూడా ఆమె జల్లెడ పట్టారు. డీలిమిటేషన్, మహిళా బిల్లుపై కేసీఆర్ పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదని, తమకు తాము ఓ జాతీయ పార్టీగా పేరు మార్చుకున్న బీఆరెస్.. కీలకమైన ఈ అంశంపై, కేంద్ర ప్రభుత్వ విధానంపై ఎందుకు మాట్లాడలేదని కేసీఆర్‌ను పరోక్షంగా ప్రశ్నించారామె.
ఆ పార్టీలో ఆడబిడ్డలకు విలువ లేదు. మర్యాద లేదు… కనీసం ఉన్నట్టన్నా పైకి మాట్లాడొచ్చు కదా.. మహిళా బిల్లు వీగిపోయిన నేపథ్యంలో వారికి అండగా మేముంటామనే విషయాన్ని సభ ద్వారా చెప్పొచ్చు కదా! అని సూటిగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారామె. ఆడబిడ్డలకు విలువ లేదనడం… కన్నబిడ్డెనైనా తననే అన్యాయంగా బయటకు గెంటేసిన ఉదంతాన్ని పరోక్షంగా గుర్తు చేశారామె. ఉద్యమకారుల ఊసు కూడా ఎత్తలేదని, వాళ్లు బిచ్చమడుక్కునే స్థితిలో ఉన్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితికి కారణం కేసీయారే అన్నట్టుగా ఆమె విమర్శించడం చర్చకు తెరతీసింది. ఇప్పటికీ ఓటమిని అంగీకరించలేకపోతున్నారని, తమను ఓడించి జనం పెద్ద తప్పు చేశారనే విధంగా కేసీఆర్ మాట్లాడటాన్ని ఆమె తప్పుబట్టారు. మీరు ఇక మారరు.. వెయ్యి జన్మలైనా మారరు.. అంటూ కేసీఆర్‌ను, బీఆరెస్ పార్టీని ఉద్దేశించి విమర్శించిన తీరు చర్చనీయాంశమైంది.
కవిత ఈనెల 25న కొత్త పార్టీ పెట్టనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఆమె కొత్త పార్టీ పేరు.. విధి విధానాలను ప్రకటించనున్నారు. ఇప్పటికే మహిళా రిజర్వేషన్లను తమ పార్టీలో అమలు చేస్తామని ఆమె ప్రకటించారు. పార్టీలో పదవులు కూడా ఇస్తామన్నారు. రెండు ప్రధాన పార్టీలను ఇరుకున పెట్టే విధంగా ఆమె రాజకీయంగా దూకుడును ప్రదర్శిస్తున్నారు. నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా బీఆరెస్‌ను ఆమె టార్గెట్ చేస్తున్నారు. హరీశ్‌రావు, సంతోష్ రావులతో మొదలు పెట్టి అందరినీ బయటకు లాగుతున్నారు. కేటీఆర్ వంతు కూడా అయిపోయింది. ఇప్పుడు దేవుడు.. అదే కేసీఆర్ వంతు వచ్చింది. పేరు ఉచ్చరించకుండా అన్నను, తండ్రిని రాజకీయపరమైన విధానాలపై ఆమె గట్టిగానే విభేస్తున్నారు. విమర్శిస్తున్నారు. ఇక పార్టీ స్థాపన రోజున ఆమె ప్రసంగం కీలకంగా ఉంటుందనే ప్రచారం జరుగుతున్నది.
పార్టీలైన్ ఎట్లుంటుందో ఆ రోజే ఆమె మరింత క్లారిటీని ఇవ్వనుంది. కేసీఆర్, కేటీఆర్‌ను , పార్టీ విధానాలపై ఇక పరోక్ష వైఖరి కాకుండా నేరుగానే విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం ఉంది. ఓ వైపు అధికార పార్టీ పాలనపై, హామీలపై విమర్శలు చేస్తూనే, డిమాండ్లతో ఒత్తిడి పెంచుతూనే.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆరెస్‌ను చీల్చి చెండాడే పనిని భుజానికెత్తుకున్నారామె. పార్టీ ఆవిర్భావం రోజున కవిత రెండు ప్రధాన పార్టీలే లక్ష్యంగా దూకుడుగా విమర్శలు చేసేందుకు సంసిద్ధమైనట్టు తెలుస్తోంది. తమకు పోటీ కాంగ్రెస్ ఒక్కటే.. అని బీఆరెస్ అనుకోవడానికి వీలులేకుండా.. పంటికింద రాయిలా.. తలనొప్పి వ్యవహారంలా అన్నింటా కవిత గులాబీ బాస్‌ను ముప్పు తిప్పలు పెట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది.