Preethi Reddy: స్వేచ్ఛ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి రాజకీయ అరంగేట్రంపై గత కొద్దిరోజులుగా చర్చ కొనసాగుతోంది. ఇటీవల ప్రధాని మోడీని కలిసిన ఆమె కుటుంబం తాజాగా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. దీంతో కాషాయ పార్టీలో ఆమె చేరిక లాంఛనమే అనేందుకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. అయితే చేరికల అంశంపై ఆమె ఎట్టకేలకు స్పందించారు. తాను ఇప్పట్లో చేరబోయేది లేని స్పష్టంచేశారు. అయినా ఆమె చేరికకు సంబంధించిన అంశంపై ప్రచారం ఆగట్లేదు. కేవలం డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ ప్రారంభోత్సవానికి మాత్రమే ఆహ్వానించినట్లు చెప్పినా ఈ భేటీ వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానిని కలిసిన వారం రోజుల వ్యవధిలోనే తివారితో భేటీ అవ్వడం పలు అనుమానాలకు తావిస్తోందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
ఇటీవల మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అయితే అత్యంత సీక్రెట్ గా భేటీ అవ్వడం వెనుక అసలు కారణమేంటనే అంశంపై ఇరు వర్గాలు మాట దాటవేస్తున్నా.. త్వరలోనే ఆ కుంటుంబం బీజేపీలో చేరడం లాంఛనమే అనేది అసలు నిజమని పొలిటికల్ సర్కిల్స్ లో కోడై కూస్తోంది. ఒకవేళ అదే నిజమైతే బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు ప్రీతిరెడ్డి ఢిల్లీ పెద్దలకు టచ్ లో వెళ్లినట్లు సమాచారం. కానీ భవిష్యత్ లో అయినా ఆ స్థానం నుంచి పోటీ చేయడమే ఆమె లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాక్. అందుకే తరచూ బీజేపీ పెద్దలతో టచ్ లో ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: పంపకాల్లో తేడాల వల్లే కొత్త పార్టీనా? కవితకు ఎంపీ చామల కౌంటర్
బీజేపీ కార్యాలయానికి మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి వచ్చారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో ఆమె భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న ఊహగానాలపై ఆమె స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టంచేశారు. తాను డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు వెళ్లినట్లు చెప్పారు. అందులో భాగంగానే బీజేపీ కార్యాలయానికి ఆహ్వానం ఇచ్చేందుకే వచ్చినట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ ఆహ్వానం అందించేందుకు తాను అన్ని పార్టీల నేతలను కలుస్తున్నట్లు వెల్లడించారు.
మల్లారెడ్డి బీఆర్ఎస్ లోనే ఉంటారని పేర్కొన్నారు. తాను వచ్చింది ఎంపీ టికెట్ కోసం కాదని, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందన్నారు. ఈ భేటీలో ఎలాంటి రాజకీయం లేదన్నారు. తాను ప్రస్తుతం రాజకీయాల గురించి మాట్లాడట్లేదని, విద్యా వ్యవస్థ కోసం పాటుపడుతున్నానని, భవిష్యత్ లో ఏదైనా జరగవచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూ పండుగలను తాను సెలబ్రేట్ చేసుకుంటానని, అంతమాత్రాన బీజేపీ కోసం పాటుపడుతున్నట్లు కాదు కదా అని వ్యాఖ్యానించారు. రాజకీయాల గురించి ప్రస్తుతం ఆలోచించట్లేదని, తమ మామయ్య మల్లారెడ్డి పోటీ చేయమంటే చేసేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పారు. డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలువబోతున్నట్లు ప్రీతిరెడ్డి వెల్లడించారు.
Also Read: కుంభ మేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. సర్కార్ ప్లాన్ ఇదే..?