పవన్ కళ్యాణ్.. అచ్చంగా తన కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమాలో మీడియాకు ఇచ్చిన ట్రీట్మెంట్‌లాగే ఏపీలో కూడా కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ప్రశ్న రావణ్‌ను ఇకపై జీవితంలో బయటకు రాకుండా పెట్టని కేసులు లేవు. చట్టాలన్నీ చుట్టచుట్టి.. కేసులన్నీ మూటగట్టి రావణ్ నెత్తిమీద ఎత్తి.. చూశారా..? యూట్యూబర్స్.. నాతో పెట్టుకుంటే రఫ్ ఆడించేస్తానని.. చిరంజీవిలా ఓ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు పరోక్షంగా.
ఇది చాలదనుకున్నాడు. దీనిపైనా పవన్‌ను బెదిరించే శక్తులు రెడీ అయ్యాయి. మరీ ఇంత అన్యాయమా? అని నిలదీసేందుకు రెడీ అయ్యారు. అయినా వినడం లేదు రాంబాబు. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం లేదు. ఇంత జరిగిన తరువాత కూడా ఇప్పుడు వెనక్కి వస్తే.. ఇక తన మాట వినరు.. మరింతగా లైట్ తీసుకుంటారని అనుకున్నాడేమో… ఓ కొత్త టాస్క్ మళ్లీ మొదలుపెట్టాడు.
ఏంటో తెలుసా? ఏపీలో ఎంత మంది యూట్యూబులు నడిపిస్తున్నారో.. వారందరికీ నోటీసులిచ్చే పని. వార్నింగ్ లాంటి నోటీసు. బెదిరింపు లాంటి నోటీసున్నమాట.బిడ్డా.. ఒళ్లు దగ్గర పెట్టుకుని నడుచుకోండ్రి.. మీడియా ముసుగులో ఏం మాట్లాడినా చెల్లుతుంది… వ్యక్తిగతంగా ఎంత తిడితే అంత హీరోలమైపోతాయమని విర్రవీగకండి..! మీకూ రావణ్‌కు పట్టిన గతే పడుతుందని స్టేట్ వార్నింగే ఇచ్చాడు.
ఇక్కడ ఎప్పట్నుంచో పవన్‌కు హోంమంత్రి కావాలని ఉండే.. ఇప్పుడు అక్కడ పరిస్థితులను బట్టి.. చంద్రబాబు సహకారంతో అనధికారికంగా హోంమంత్రి పాత్ర పోషిస్తున్నాడమన్నమాట మన రాంబాబు. అందుకే పోలీస్ వ్యవస్థతో యూట్యూబర్లను జల్లెడ పట్టించాడు. ఏకంగా వారి ఇళ్లలోకి వెళ్లి.. ఓ సీల్డ్ కవరు చేతిలో పెట్టి .. ఉండమ్మా..! బొట్టు పెడతా..! అన్నట్టుగా నుదిటిన తిలకం దిద్ది మరీ చెప్పినట్టుగా .. జర జాగ్రత్తరోయ్.. ! ఇకపై ఎడాపెడా ఏది పడితే అది.. ఎట్లంటే అట్ల.. నోటికేదొస్తే అది.. నోరు పారేసుకోకండి.. మేం లాఠీలను మీ వీపై వాడేసుకోవాల్సి వస్తుంది. కేసులను కట్టెల మోపుల్లా కట్టగట్టి మీ నెత్తిన ఎత్తాల్సి వస్తుందని ఇస్తినమ్మా వాయినాం.. అనే లెవల్లో మర్యాదగా ఇచ్చి వచ్చారట.
ఇదీ ఇప్పుడు ఏపీలో వైరల్ న్యూస్. ఇదేందీ..? అరెస్టులకు ముందే నోటీసులిస్తారు. ఇలా వార్నింగులు ఇచ్చేందుకు కూడా నోటీసులు ఇచ్చి మరీ భయపెడుతున్నారే..? అని యూట్యూబర్ల గొట్టాలు నివ్వెరపోయాయట. అంతే కాదు.. ఆ నోటీసుల్లో యూట్యూబర్లు విచ్చలవిడిగా పత్రికా స్వేచ్ఛ ముసుగులో హద్దులు దాటి వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టి.. వాటి వల్ల ఏఏ సెక్షన్లు అమల్లోకి వస్తాయి? అవి ఎంతటి శిక్షార్హమో..? ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుందో.. సవివరంగా, కులంకషంగా.. చట్టబద్దంగా.. పోలీస్ భాషలో వివరించి మరీ వస్తున్నారట.
మీరిక్కడ మళ్లా పాత వేశాలే వేస్తే..అక్కడ పవన్.. కెమెరామెన్ గంగతో రాంబాబు.. అని అనాల్సి వస్తుందని, రంగంలోకి దిగాల్సి ఉంటుందని, పరోక్షంగానే కాదు.. ప్రత్యక్షంగానే విడమరిచి మక్కెరిచినట్టే చెప్పారట ఏపీ ఖాకీలు.