కవిత రెండు పార్టీలను లాగుల పార్టీలంటూ విమర్శించారు. ఆమె మీట్ ది ప్రెస్‌లో వేసిన ఓ ప్రశ్నకు సమాధానం వ్యంగ్యంగా చెప్పారు. బీఆరెస్, కాంగ్రెస్ రెండూ లాగులు పార్టీలేనన్నారు. ఆమె మాటల ఆంతర్యం.. ఈ మధ్య ఎక్కువగా ఈ రెండు పార్టీల నేతల నుంచి లాగులు అనే పదం రావడమే. ఇంకా లోతుగా ఆమె మాటల ఆంతర్యం విశ్లేషించుకుంటే.. చాలా రోజుల తరువాత బయటకు వచ్చిన కేసీఆర్.. జగిత్యాల పబ్లిక్ మీటింగుకు హాజరయ్యారు. ఆ సభలో ఆయన ఓ సందర్భంలో కాంగ్రెస్ నేతలను లాగులు పగిలేదాకా కొట్టాలె..! అని పిలుపునిచ్చారు.
వాస్తవానికి, ఆయన నోటి వెంట ఎప్పడూ ఈ మాట రాలేదు. అదే మీటింగులో నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను… కొడుకా! అని కూడా రేవంత్‌ను ఉద్దేశించి మాట్లాడారాయన. అయితే కేసీఆర్ నోటి వెంట వచ్చిన లాగులు పగిలేదాకా… అనే తిట్టు చక్కర్లు కొట్టింది సోషల్ మీడియాలో. ఎందుకంటే.. అంతకు ముందు చాలా సార్లు రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో లాగుల తొండలిడుస్తా..! అని కేటీఆర్ అండ్ టీమ్‌కు వార్నింగులిచ్చారు. దీన్ని కేటీఆర్ చాలా సందర్భాల్లో విమర్శించారు. ఈ లాగుల తొండలిడుస్తా అనడమేందీ..? నువ్వు రేవంత్‌రెడ్డా? తొండల్ రెడ్డా? అని తిట్టడం ప్రారంభించారు. ఇది వేరే అంశం. ఇక కవిత విషయానికొద్దాం.. ! ఆ రెండూ లాగుల పార్టీలే అన్నారు. అంటే.. బీఆరెస్, కాంగ్రెస్ లాగుల పార్టీలేనని. లాగులు వేసుకునేది ఆరెసెస్. లాగులు తొడుక్కొని శాఖా నిర్వహిస్తారు. కర్రసాము చేస్తారు.
ఇది ఆరెసెస్‌కు డ్రెస్ కోడ్. ఆరెసెస్ అంటే బీజేపీ అనే అర్థం దాదాపుగా. అంటే కవిత అన్నది ఆ రెండు పార్టీలు మోడీకి దగ్గరి దోస్తులని. అదేందీ.. ఉంటే గింటే బీఆరెస్ మోడీకి దగ్గర. రేపు భవిష్యత్‌లో బీజేపీతో పొత్తుకు బీఆరెస్ తహతహలాడుతుందనే కదా అంతా అనుకుంటున్నారు. కవిత కూడా ఆరోపించారు. కానీ మరి రేవంత్‌రెడ్డికి మోడీకి ఎందుకు ముడిపెట్టారు? బహుశా పూర్వాశ్రమంలో రేవంత్.. ఆరెస్‌స్‌లో కీలకంగా ఉన్నారనే భావన కావొచ్చు. కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారనే ఉద్దేశ్యం కావొచ్చు. బడేమియా, చోటేమియా అనే రాజకీయ విమర్శలు కామన్‌గా వస్తున్న తరుణంలో ఒకరికొకరు మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటారనే అర్థం కావొచ్చు.
అలా వాళ్లు మాట్లాడిన లాగుల భాషలకు లింకు చేసి. బీజేపీకి ఈ రెండు కూడా తోక పార్టీలని ఆమె వ్యంగ్యంగా విమర్శించారన్నమాట. అంతే కాదు.. నేను అలా కాదు.. నా భాష బాగుంటుంది. ఒకటి రెండు సార్లు ఆలోచించి మాట్లాడుతాను.. అని కూడా అన్నారు. నిజం చెప్పాలంటే కవిత కూడా కొంచెం టంగ్ స్లిప్ అవుతున్నారు. సీఎం రేవంత్‌ను గుంపు మేస్త్రీ అంటున్నారు. హరీశ్‌ను గుంట నక్క అంటున్నారు. ఈ తిట్లపై ఆమెకు మైలేజీ కన్నా మైనస్సే ఎక్కువొస్తుంది. ఎందుకంటే సబ్జెక్టు మీద మాట్లాడి.. విమర్శ హుందాగా ఉన్నప్పుడు సహజంగానే ఆ స్పీచ్‌పై, ఆ కామెంట్లపై గౌరవం పెరుగుతుంది. అందరిలో ఆమె పట్ల మర్యాద రెట్టింపవుతుంది. కంటెంట్ లేనప్పుడే తిట్ల దండకం చదువుతారనే విమర్శ ఉంటుంది. ఆ కోవలోకి ఆమె రావొద్దంటే పాలసీ పరంగా విమర్శించడమే మేలు.
కానీ కవిత కూడా మాస్ పీపుల్‌కు దగ్గర కావాలనుకుంటున్నారేమో? ఇలా పంచులు లేకపోతే.. ప్రసంగంలో ఊపు రాదని ఫిక్స్ అయ్యారేమో? సరే, ఏమాటకామాటే.. ఈ ముగ్గురిలో కేసీఆర్ తిట్లకు ప్రశంసలు ఎక్కువ దొరుకుతాయి. నవ్వుకుంటారు. ఎంజాయ్ చేస్తారు. ఆ భాష, యాసకున్న పవర్ అలాంటిది మరి. ఇక లాస్ట్ ముచ్చటేందంటే.. లాగు అంటే.. చెడ్డీ అనే అర్థమొకటే రాదు. తెలంగాణలో బాగా లూజు లూజుగా ఉన్న ప్యాంటును కూడా లాగు అనే పిలుస్తారు వాడుక భాషలో. ఒరేయ్ లాగుల మియా! అని చిలిపిగా ఆట పట్టిస్తారు కూడా అలాంటి వాళ్లను.ఈ లాగుల గోల మాకెందుకంటారా? అయితే ఇక్కడితో ముగించేస్తా..! మళ్లా మీరు కూడా మన సీఎంలాగా.. లాగుల…… అనేరు!