Amrakhand Recipe: శివరాత్రి పర్వదినం అంటేనే పరమశివుడి ఆరాధన. వాడవాడలా మారుమోగే మంత్రోచ్ఛారణలు, భక్తుల ఉపవాస జాగరణలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. ఈ పవిత్ర రోజున అర్ధనారీశ్వరుడికి భక్తితో సమర్పించుకునేందుకు ఎంతో రుచికరమైన ‘ఆమ్రఖండ్’ నైవేద్యాన్ని సిద్ధం చేసుకోండి. ఇంట్లోని వారందరికీ ప్రసాదంగా అందించి ఆ పరమశివుడి కృపకు పాత్రులు అవ్వండి. ఇప్పుడీ ఆమ్రఖండ్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
రెండు తీయని మామిడిపండ్లు, మూడున్నర కప్పుల గడ్డ పెరుగు, అర కప్పు పంచదార, రెండు చెంచాల బాదం పప్పులు, రెండు చెంచాల పిస్తా, రెండు చెంచాల జీడిపప్పు, ఒక చెంచా పుచ్చపప్పు, ఐదు యాలకులు, చిటికెడు జాజికాయ పొడి, కొద్దిగా కుంకుమపువ్వు, ఒక టేబుల్ స్పూన్ పాలు.
Also Read: హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇదే.. ‘ఎయిర్ ఫ్రైయర్’ ఆమ్లెట్ ఎప్పుడైనా ట్రై చేశారా?
ముందుగా యాలకులను మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెలో వేడి పాలు తీసుకుని అందులో కుంకుమపువ్వు వేసి నాననివ్వాలి. డ్రైఫ్రూట్స్ ముక్కలను దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పెరుగులో ఉన్న నీరంతా పోయి గడ్డలా అయ్యేలా ఒక పల్చని వస్త్రంలో కట్టి రెండు గంటల పాటు వేలాడదీయాలి లేదా పళ్లెంలో ఉంచాలి.
ఆ తర్వాత మామిడిపండ్ల తొక్క తీసి ముక్కలుగా కోసుకోవాలి. మిక్సీ జార్‌లో పెరుగు, మామిడి పండు ముక్కలు, పంచదార, యాలకుల పొడి వేసి మెత్తని మిశ్రమంగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో కుంకుమపువ్వు కలిపిన పాలు, వేయించిన డ్రైఫ్రూట్స్ వేసి కలిపితే ఎంతో రుచికరమైన ఆమ్రఖండ్ నైవేద్యం సిద్ధమవుతుంది.
Also Read: బరువు తగ్గి నాజూగ్గా కనిపించాలా? ఈ రాగి ఊతప్పం ట్రై చేయండి, తయారీ విధానం కూడా ఈజీ!