ఆంధ్ర వంటల్లో మటన్ కర్రీ చాలా స్పెషల్. కారం, మసాలా రుచులతో ఘుమఘుమలాడే ఈ కర్రీ వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది. ఇక రోటీ, చపాతీతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. ఈ రుచికరమైన ఆంధ్ర స్పైసీ మటన్ కర్రీని ఎలా వండాలో ఇక్కడ సింపుల్ గా చెప్పాము. ఇది అద్భుతంగా ఉంటుంది.
ఆంధ్ర స్లైల్ స్పైసీ మటన్ కర్రీకి కావలసిన పదార్థాలు
మటన్ – అర కిలో
ఉల్లిపాయలు – మూడు
టమాటాలు – మూడు
పచ్చిమిర్చి – మూడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు స్పూన్లు
కారం పొడి – రెండు స్పూన్లు
పసుపు – అర స్పూన్
ధనియాల పొడి – ఒక స్పూన్
జీలకర్ర పొడి – ఒక స్పూన్
గరం మసాలా – ఒక స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – నాలుగు స్పూన్లు
కొత్తిమీర తరుగు – కొద్దిగా
కరివేపాకులు – గుప్పెడు
నీరు – తగినంత
లవంగాలు – నాలుగు
యాలకులు – రెండు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
మిరియాలు – అర స్పూన్
గసగసాలు లేదా కొబ్బరి తురుము – రెండు స్పూన్లు
స్పైసీ మటన్ కర్రీ రెసిపీ
1. ముందుగా మటన్‌ను బాగా కడిగి ప్రెజర్ కుక్కర్‌లో వేసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీరు పోసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, గసగసాలు లేదా కొబ్బరి తురుమును వేసి స్వల్పంగా వేయించాలి. చల్లారిన తర్వాత కొద్దిగా నీరు వేసి మిక్సీలో పేస్ట్ చేయాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. అందులో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
4.ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముదురు వాసన పోయే వరకు కలపాలి. తర్వాత టమాటాలు వేసి మెత్తగా అయ్యే వరకు వండాలి.
5. ఇప్పుడు కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. మసాలా నుంచి నూనె పైకి రావడం ప్రారంభమైతే ముందుగా తయారు చేసిన మసాలా పేస్ట్ వేయాలి. రెండు నిమిషాలు బాగా కలుపుతూ వండాలి.
6. ఇప్పుడు ఉడికించిన మటన్ ముక్కలు, మటన్ ఉడికించిన నీరు వేసి బాగా కలపాలి. మూత పెట్టి మధ్య మంటపై 20 నిమిషాలు మగ్గనివ్వాలి.
7. చివరగా గరం మసాలా చల్లి కలపాలి. కర్రీ చిక్కగా అయ్యి నూనె పైకి కనిపిస్తే స్టవ్ ఆఫ్ చేయాలి.
8. కొత్తిమీర తరుగు చల్లితే కూర రెడీ అయినట్టే. రుచికరమైన ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ అద్భుతంగా ఉంటుంది.
Also read: Homemade Skin care: జపనీయుల్లాగా మీ చర్మం మెరిసిపోవాలంటే వీటిని వాడండి చాలు
మటన్ ఇష్టపడే వాళ్లు ఇక్కడ చెప్పినట్టు కూర వండుకుని చూడండి జీవితంలో మర్చిపోలేనంత మంచి రుచి వస్తుంది.