Summer Healthy Drinks: సాధారణంగా ఏదైనా పనిమీద బయటికి వెళ్లినప్పుడు ఎండల తీవ్రతను తట్టుకోలేక.. ఎక్కడపడితే అక్కడ చల్లని పానీయాలను తాగేస్తుంటాం. కానీ ఇలా ప్రతిసారీ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోడ్డు పక్కన కనిపించే ఆ రంగు రంగుల సోడాలనో, కూల్ డ్రింక్స్‌నో తాగేబదులు.. ఇంట్లోనే చక్కగా ఫ్రెష్ ఫ్రూట్స్ లేదా కొన్ని రకాల పదార్థాలతో ఒంటికి చలువ చేసే పానీయాలు చేసుకుని తాగొచ్చు. ఈ నేపథ్యంలో సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకోగల 5 రిఫ్రెషింగ్ డ్రింక్స్ గురించి తెలుసుకుందామా.
ఎండలో తిరిగి ఇంటికి రాగానే గ్లాసుడు చల్లని మజ్జిగ తాగితే శరీరానికి ఎంతో హాయిగా ఉంటుంది. దీని కోసం ముందుగా పెరుగును తీసుకుని బాగా చిలకాలి. అందులో కొన్ని నీళ్లు పోసి పల్చగా చేయండి. ఆ తర్వాత అందులో కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, సరిపడా ఉప్పు వేయాలి. పైన కొంచెం కొత్తిమీర, వేయించిన జీలకర్ర పొడి చల్లితే ఆ రుచికి ఫిదా అయిపోతారు. ఇది మన కడుపుని చల్లబరచడమే కాకుండా, తిన్నది అరగడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది.
వేసవిలో నిమ్మరసం అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. దానికి కొంచెం పుదీనా తోడైతే ఇక తిరుగుండదు. దీని కోసం మిక్సీ జార్‌లో గుప్పెడు పుదీనా ఆకులు, నిమ్మరసం, తగినంత పంచదార లేదా తేనె వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ రసాన్ని గ్లాసులో తీసుకుని చల్లని నీళ్లు, ఐస్ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. పుదీనా ఇచ్చే ఆ ఫ్రెష్‌నెస్ మన మైండ్‌ని అప్పటికప్పుడు ప్రశాంతంగా మార్చేస్తుంది.
Also Read: గ్యాస్ వద్దు.. ఇండక్షన్ అక్కర్లేదు.. కేవలం 10 నిమిషాల్లో హై-ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ రెడీ!
ఎండ దెబ్బ తగలకుండా ఉండాలంటే రాగి అంబలిని మించిన డ్రింక్ లేదని మన పెద్దవాళ్లు చెప్తుంటారు. ఒక గిన్నెలో నీళ్లు మరిగించి, అందులో కొంచెం నీళ్లలో కలిపిన రాగి పిండిని వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి. అది బాగా చల్లారాక.. అందులో పల్చని మజ్జిగ, కొంచెం ఉప్పు కలిపి తాగేయడమే. ఇది శరీరానికి కావాల్సిన ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది, ఎముకలను కూడా గట్టిపరుస్తుంది.
పండుగ రోజే కాదు.. ఈ వేసవిలో కూడా పానకం తాగడం వల్ల బోలెడన్ని లాభాలున్నాయి. ఒక పాత్రలో నీళ్లు తీసుకుని అందులో తురిమిన బెల్లం వేసి బాగా కరిగించి వడకట్టాలి. ఆ తర్వాత అందులో యాలకుల పొడి, మిరియాల పొడి, కొంచెం సొంఠి పొడి కలపాలి. బెల్లంలో ఉండే ఐరన్, మిరియాల ఘాటు మనల్ని వడదెబ్బ నుంచి కాపాడుతాయి. ఇది తాగితే అలసట ఇట్టే మాయమైపోతుంది.
వేసవి వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా పుచ్చకాయలే కనిపిస్తాయి. ఇందులో నీటి శాతం ఎక్కువ కాబట్టి బాడీకి చాలా మంచిది. పుచ్చకాయ ముక్కల్లోంచి గింజలు తీసేసి మిక్సీ పట్టాలి. ఆ రసంలో కొంచెం నిమ్మరసం, చిటికెడు నల్ల ఉప్పు కలిపి సర్వ్ చేయాలి. ఎలాంటి ఆర్టిఫిషియల్ షుగర్ లేకుండా పిల్లలకి ఇచ్చినా వాళ్లు ఇష్టంగా తాగుతారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి బెస్ట్ డ్రింక్ ఇదే.
Also Read: చెరుకురసంతో ఐస్‌క్రీమ్.. ఈ సమ్మర్‌లో ఇలా చేసుకుని తింటే ఆ టేస్టే వేరబ్బా!