భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక వంటకాలు ఉంటాయి. అలాగే గోవాలె చికెన్ కర్రీ ఎంతో స్పెషల్. ఈ కర్రీలో కొబ్బరి, మసాలాలు, చింతపండు లేదా టమాటా వంటి పదార్థాలు ఉపయోగించడం వల్ల రుచికి ప్రత్యేకత వస్తుంది. గోవా వంటకాలపై పోర్చుగీస్ ప్రభావం ఉండటం వల్ల మసాలా, పులుపు కలయిక స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా గోవా చికెన్ కర్రీను అన్నం, రోటీ లేదా బ్రెడ్‌తో తింటారు. గోవా చికెన్ కర్రీ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో కొబ్బరి లేదా కొబ్బరి పాలు తప్పనిసరిగా ఉంటాయి. ఇవి కర్రీకి మృదువైన టెక్స్చర్ ఇస్తాయి. అలాగే ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి వంటి పదార్థాలు కలిపి వండటం వల్ల సువాసన పెరుగుతుంది.
గోవా స్టైల్ చికెన్ కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చికెన్ ముక్కలు – అరకిలో
ఉల్లిపాయలు – రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూను
కొబ్బరి తురుము లేదా కొబ్బరి పాలు – ఒక కప్పు
ఎండుమిర్చి / పచ్చిమిర్చి – నాలుగు
జీలకర్ర, ధనియాలు – కొద్దిగా
మిరియాలు – అర చెంచా
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
నూనె లేదా కొబ్బరి నూనె – 2 టేబుల్ స్పూన్లు
చింతపండు లేదా టమాటా – ఒక టమోటా లేదా ఉసిరికాయంత చింతపండు
Also read: Mutton Curry: కొత్తిమీర మటన్ ఇలా వండారంటే గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది, రెసిపీ ఇదిగో
గోవా స్టైల్ చికెన్ కర్రీ రెసిపీ
1. మొదట కొబ్బరి తురుము, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మిర్చి, కొద్దిగా ఉల్లిపాయ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పేస్ట్ కర్రీకి ఘాటైన రుచి ఇవ్వడంతో పాటు మంచి రంగును కూడా ఇస్తుంది.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయలు వేసి గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి.
3. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు వేయించాలి. తరువాత చికెన్ ముక్కలు వేసి మధ్య మంటపై కలుపుతూ వేపాలి.
4. ముందుగా తయారు చేసిన మసాలా పేస్ట్‌ను చికెన్‌లో వేసి బాగా కలపాలి. కొద్దిగా నీరు పోసి మూతపెట్టి ఉడికించాలి. చికెన్ మృదువుగా అవుతుండగా మసాలా రుచి మాంసంలోకి చేరుతుంది.
5. చివరగా కొబ్బరి పాలు లేదా కొబ్బరి తురుము మిశ్రమం కలిపి కొద్దిసేపు ఉడికించాలి. కావాలంటే చింతపండు రసం లేదా టమాటా వేసి స్వల్ప పులుపు రుచి తీసుకురావచ్చు. దీన్ని ఇగురులాగా అయ్యే వరకు ఉడికిస్తూనే ఉండాలి.
6. ముక్క ఉడికి ఇగురులా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంటే గోవా స్టైల్ చికెన్ కర్రీ సిద్ధమైనట్టే. చూస్తుంటేనే నోరూరిపోతుంది.
Also read: Sajjala khichdi: డయాబెటిస్ ఉన్నవారికి ఆరోగ్యాన్నిచ్చే సజ్జల కిచ్డీ, రెసిపీ ఇదిగో
ఈసారి గోవా చికెన్ కర్రీని ఇంట్లో ప్రయత్నించి చూడండి. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే రోటీ, చపాతీతో కూడా బావుంటుంది. స్పైసీగా కావాలనుకుంటే కారం వేసుకుంటే సరిపోతుంది.