Gongura Pulihora Recipe: పులిహోర అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. ముఖ్యంగా టెంపుల్ స్టైల్లో చేసే పులిహోరా టేస్టే వేరు. సాధారణంగా చింతపండు లేదా నిమ్మకాయతో చేసే పులిహోర మనకు తెలుసు. కానీ, ఆంధ్రా స్పెషల్ గోంగూరతో చేసే పులిహోరను ఒక్కసారి తిన్నారంటే చాలు ఇక ఎప్పటికీ మర్చిపోలేరు ఆ రుచిని. ఆలయ ప్రసాదంలా ఉండే ఈ గోంగూర పులిహోరను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
బియ్యం – 250 గ్రాములు, గోంగూర – 100 గ్రాములు, తాలింపు కోసం – ఆయిల్, వేరుశెనగలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు. మసాలా పొడి కోసం – మెంతులు, జీలకర్ర, మిరియాలు ఒక ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, పసుపు, ఉప్పు, చిన్న చింతపండు ముక్క.
Also Read: మైదా లేకుండా హెల్దీ పన్నీర్ రోల్స్.. ఈ సీక్రెట్ మసాలాలతో చేసుకుంటే టేస్ట్ మామూలుగా ఉండదు!
ముందుగా అన్నాన్ని పొడిపొడిగా వండుకుని ఒక వెడల్పాటి గిన్నెలో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం మెంతులు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చిని దోరగా వేయించి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఆ తర్వాత పాన్‌లో కొద్దిగా నూనె వేసి, శుభ్రం చేసిన గోంగూర ఆకులు, పచ్చిమిర్చి, చిన్న చింతపండు ముక్క వేసి మగ్గించాలి. నూనె పైకి తేలే వరకు వేయించి, చల్లారాక మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి.
ఇప్పుడు ఆరబెట్టిన అన్నంలో ఈ గోంగూర పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడి, సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా తాలింపు కోసం పాన్‌లో నూనె వేసి వేరుశెనగలు, పప్పులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తాలింపు వేగాక పసుపు, ఇంగువ వేసి ఆ మిశ్రమాన్ని అన్నంలో కలిపేస్తే చాలు.. గోంగూర పులిహోర రెడీ.
Also Read: బరువు తగ్గి నాజూగ్గా కనిపించాలా? ఈ రాగి ఊతప్పం ట్రై చేయండి, తయారీ విధానం కూడా ఈజీ!