Holi Special Recipes: హోలీ పండుగ అనగానే రకరకాల కలర్స్‌తో పాటు మన తెలుగు వాళ్లందరికీ ముందుగా గుర్తొచ్చేది నోరూరించే పిండివంటలు. ఒళ్లంతా కలర్స్, చుట్టూ స్నేహితులు, కుటుంబ సభ్యులు.. ఈ హడావిడి మధ్యలో కమ్మని మిఠాయి పడితే ఉత్సాహం డబుల్ అయిపోద్ది. అందుకే, ఈసారి మీ హోలీ సెలబ్రేషన్స్‌ను మరింత స్పెషల్‌గా మార్చేందుకు, తక్కువ టైమ్‌లో ఈజీగా చేసుకోగలిగే 4 రకాల కమ్మని రెసిపీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హోలీ అంటే అందరికీ గుర్తొచ్చేది గుజియా. దీన్ని చేయడం చాలా సులభం. మైదా పిండిలో కొంచెం నెయ్యి వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. లోపల పెట్టే స్టఫింగ్ కోసం కోవా, పంచదార పొడి, ఇలాచీ, ఎండుద్రాక్ష కలిపి పక్కన పెట్టుకోవాలి. పిండిని చిన్న పూరీల్లా ఒత్తి, మధ్యలో ఈ కోవా మిశ్రమాన్ని పెట్టి అంచులను మూసేయాలి. వీటిని నూనెలో దోరగా వేయిస్తే కరకరలాడే గుజియాలు రెడీ.
Also Read: 10 నిమిషాల్లో హెల్దీ కొబ్బరి లడ్డూలు.. బరువు తగ్గాలనుకుంటున్న వారికి బెస్ట్ డెజర్ట్!
పండగ రోజున వేడివేడి పాల తాలికలు తింటే ఆ మజానే వేరు. బియ్యం పిండిలో కొద్దిగా వేడి నీళ్లు పోసి మృదువుగా కలుపుకుని, సన్నని తాలికల్లా చేసుకోవాలి. మరోవైపు పాలను మరిగించి అందులో ఈ తాలికలను ఉడికించాలి. తాలికలు ఉడికాక తగినంత బెల్లం తురుము, ఇలాచీ పొడి వేసి కలపాలి. చివరగా నెయ్యిలో వేయించిన జీడిపప్పు వేసుకుంటే కమ్మని పాల తాలికలు మీ ముందుంటాయి.
సాంప్రదాయ వంటకాల్లో బూరెలకు ప్రత్యేక స్థానం ఉంది. శనగపప్పును ఉడికించి బెల్లంతో కలిపి దగ్గరకు అయ్యే వరకు ఉంచి పూర్ణం తయారు చేసుకోవాలి. దీనిని చిన్న ఉండలుగా చేసి, మినప్పప్పు బియ్యం పిండి కలిపిన మిశ్రమంలో ముంచి నూనెలో వేయించాలి. పైన కరకరలాడుతూ లోపల తీయగా ఉండే ఈ బూరెలు హోలీ విందులో మెయిన్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి.
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్ గవ్వలు. గోధుమ పిండి లేదా మైదాలో కొంచెం ఉప్మా రవ్వ, నెయ్యి కలిపి గవ్వల చెక్కపై చిన్న చిన్న గవ్వల్లా చేసుకోవాలి. వీటిని నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బెల్లం పాకం పట్టి, వేయించిన గవ్వలను అందులో వేసి బాగా కలిపితే ఎంతో రుచిగా ఉండే గవ్వలు సిద్ధమైనట్టే.
Also Read: కమ్మని నెయ్యి సువాసనతో పుదీనా రైస్.. లంచ్ బాక్సులోకి బెస్ట్ ఆప్షన్!