Rayalaseema Natu Kodi Pulusu: రాయలసీమ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అక్కడి పౌరుషం, ఆ పైన ఆతిథ్యం. ముఖ్యంగా సీమ వంటకాల్లో ఉండే ఆ ఘాటు, రుచి ఒక్కసారి మరిగితే జీవితాంతం గుర్తుండిపోతుంది. అందులోనూ ఆదివారం వచ్చిందంటే చాలు.. పల్లెటూరి వాతావరణంలో కట్టెల పొయ్యి మీద వండిన నాటు కోడి పులుసు వాసన ఊరంతా వ్యాపిస్తుంది. రాగి సంకటిలోకి ఈ పులుసు వేసుకుని తింటే వచ్చే తృప్తి మాటల్లో చెప్పలేం. మీరు కూడా అదే అసలైన సీమ రుచిని ట్రై చేయాలనుకుంటే.. ఈ పద్ధతిలో ఒకసారి ప్రయత్నించి చూడండి.
ముందుగా ఒక కేజీ నాటు కోడి మాంసం తీసుకోండి. దీనికి మూడు పెద్ద ఉల్లిపాయలు, రెండు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు చెంచాలు సిద్ధం చేసుకోవాలి. మసాలా కోసం ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, గసగసాలు కావాలి. వీటితో పాటు కారం పొడి, పసుపు, ఉప్పు, నూనె, కొత్తిమీర, కరివేపాకు సమకూర్చుకోవాలి. ముఖ్యంగా ఘాటు కోసం మిరియాల పొడి కూడా కలుపుకోవడం మర్చిపోవద్దు.
Also Read: ఇంటికి చుట్టాలొస్తే ఇలా ‘మటన్ కీమా ఉండల’ కూర చేసి పెట్టండి.. మీ వంటకు ఫిదా అయిపోతారు!
నాటు కోడి మాంసాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మసాలా దినుసులన్నింటినీ దోరగా వేయించి మెత్తని పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద పాత్రలో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఎర్రగా వేయించాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాక, చికెన్ ముక్కలను వేసి బాగా కలపాలి. మాంసం నుంచి నీరు బయటకు వచ్చి ముక్కలు గట్టిపడే వరకు ఉడికించాలి.
ఆ తర్వాత తగినంత కారం, పసుపు, ఉప్పు వేసి కలిపి, ముందుగా నూరి పెట్టుకున్న మసాలా పేస్ట్, టమాటా ముక్కలు వేయాలి. మసాలా అంతా మాంసానికి పట్టి నూనె పైకి తేలుతున్నప్పుడు, తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టాలి. నాటు కోడి ఉడకడానికి సమయం పడుతుంది కాబట్టి.. ముక్క మెత్తబడే వరకు ఉడికించాలి. చివరిగా పులుసు చిక్కబడ్డాక మిరియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర చల్లుకుని దించేసుకుంటే సరి.
Also Read: ముక్క జ్యూసీగా, గ్రేవీ రుచిగా రావాలంటే చికెన్ కర్రీ ఇలా ట్రై చేయండి!