Tomato Pulao: పిల్లలకైనా, ఆఫీసుకి వెళ్లేవాళ్ల కోసమైనా మధ్యాహ్నం లంచ్ బాక్స్‌లోకి ఏం వండాలో తోచనప్పుడు లేదా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు తక్కువ శ్రమతో చేసుకునే బెస్ట్ వంటకం టమాటో పులావ్. టమాటోలోని పులుపు, మసాలాల ఘాటు కలిసి అన్నానికి అద్భుతమైన రుచిని ఇస్తాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ టేస్టీ టమాటో పులావ్‌ను కేవలం 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం.
ఒక కప్పు పొడిపొడిగా వండుకున్న అన్నం సిద్ధం చేసుకుని, దీనికి 2 స్పూన్ల నెయ్యి లేదా నూనె, ఒక స్పూన్ షాహీ జీరా, 2 లవంగాలు, 2 యాలకలు, కొద్దిగా దాల్చిన చెక్క ముక్క అవసరం అవుతాయి. కూరగాయల కోసం పావు కప్పు ఉల్లిపాయ చీలికలు, పావు కప్పు టమాటో పేస్ట్, అర కప్పు టమాటో ముక్కలు తీసుకోవాలి. మసాలాల కోసం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం, అర స్పూన్ చొప్పున గరం మసాలా, ధనియాల పొడి తీసుకోవాలి. వీటికి తోడు రుచికి సరిపడా ఉప్పు, చివరగా గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీరను రెడీ చేసుకోవాలి.
Also Read: అస్తమానం బయట ఎందుకు? ఇంట్లోనే టేస్టీ మటన్ బోన్ సూప్ ఇలా చేసేయండి!
బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి వేడయ్యాక షాహీ జీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు వేసి వేయించాలి. మొత్తం గరం మసాలా వేగిన తర్వాత ఉల్లిపాయ చీలికలు వేసి రంగు మారే వరకు వేపి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పచ్చివాసన పోనివ్వాలి. ఇప్పుడు టమాటో పేస్ట్ వేసి బాగా వేయించి, అందులోనే కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వాలి.
ఆపై టమాటో ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు ఉడికించాలి. మసాలా మిశ్రమం తయారయ్యాక ఉడికించిన అన్నం వేసి మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని దించుకుంటే వేడి వేడి టమాటో పులావ్ సిద్ధం. దీనిని ఉల్లిపాయ లేదా కీరా రైతాతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
Also Read: పక్కా అమ్మమ్మ స్టైల్లో తలకాయ కూర.. వేడి వేడి అన్నంలోకి అదిరిపోయే టేస్ట్!