Bakasura Restaurant Movie Review :కమెడియన్ ప్రవీణ్ తొలిసారి హీరోగా మారి చేసిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో అతను హీరోగా కూడా సక్సెస్ అందుకున్నాడా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…
కథ:
పరమేష్(ప్రవీణ్) పరిస్థితుల కారణంగా నచ్చని జాబ్ చేస్తూ తన నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి ఓ రూంలో నివసిస్తూ ఉంటాడు. ఏదో ఒక రకంగా రూ.50 లక్షలు సంపాదించి సొంతంగా ఒక రెస్టారెంట్ పెట్టుకుని సెటిల్ అవ్వాలనేది అతని డ్రీమ్. అందుకోసం అతను చాలా ప్రయత్నాలు చేస్తాడు. చివరికి తన స్నేహితుల సలహా మేరకు యూట్యూబ్ లో ఘోస్ట్ వీడియోస్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో వాళ్ళ ఫస్ట్ వీడియో అనుకున్నట్టు రాదు.
దీంతో 2 వ వీడియో కోసం రియల్ లొకేషన్స్ కి వెళ్తారు. అక్కడ వీళ్ళకి ఒక పుస్తకం దొరుకుతుంది. అందులో తాంత్రిక విద్య గురించి క్లుప్తంగా ఉంటుంది. దాన్ని వాడి డబ్బులు సంపాదించాలి అని అనుకుంటారు. అలా చేస్తున్న టైంలో బక్కసూరి అలియాస్ బకాసురుడు(వైవా హర్ష) ఆత్మ బయటకి వస్తుంది. ఆ తర్వాత ఆ దెయ్యం వీళ్ళని చాలా ఇబ్బందులకు గుర్తి చేస్తుంది. మరి ఆ దెయ్యం బారి నుండి వీళ్ళు ఎలా తప్పించుకున్నారు? పరమేష్ సొంత రెస్టారెంట్ కల నెరవేరిందా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ :
దర్శకుడు శివకి ఇది తొలి చిత్రం అయినప్పటికీ చాలా వరకు బాగానే హ్యాండిల్ చేశాడు అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో అతి తక్కువ టైంలోనే మెయిన్ స్టోరీలోకి ఆడియన్స్ ను తీసుకెళ్లగలిగాడు. ఆ తర్వాత ఆడియన్స్ కథతో ట్రావెల్ అవ్వడం మొదలుపెడతారు. హీరో అతని ఫ్రెండ్స్ మాట విని చేసే పనులు ఫన్నీగా అనిపిస్తాయి. కొన్ని చోట్ల కామెడీ బాగానే వర్కౌట్ అయ్యింది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా బాగా డిజైన్ చేశారు. మొత్తానికి ఫస్ట్ హాఫ్ పాస్ మార్కులు వేయించుకోగలుగుతుంది.సెకండాఫ్ పై ఆసక్తి పెంచుతుంది.
అయితే సెకండాఫ్ లో వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ ట్రాక్ కొంత బోర్ కొట్టిస్తుంది. అలాగే లవ్ ట్రాక్స్ వంటివి కూడా కథకి స్పీడ్ బ్రేకర్స్ గా మారాయి అనే ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ ను కొంత ఎమోషనల్ గా డీల్ చేశారు. అది ఎక్కడా ఫోర్స్డ్ గా ఏమీ అనిపించదు. కాకపోతే నిర్మాణ విలువలు ఆశించిన స్థాయిలో లేవు. దర్శకుడు శివలో టాలెంట్ ఉంది. కానీ నిర్మాత అతని విజన్ కు తగ్గ సహకారం అందించలేదు. ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా బాగా పూర్ అని చెప్పాలి. అసలు ఈ సినిమా వస్తున్నట్టు కూడా చాలా మందికి తెలీదు అంటే ప్రమోషన్స్ ఎంత వీక్ గా చేశారో అర్ధం చేసుకోవచ్చు. చిన్న సినిమా యూనిట్లు చేసే తప్పులే ఇవి. కెమెరా వర్క్ కూడా సాదా సీదాగానే ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సో సో.
నటీనటుల విషయానికి వస్తే.. ప్రవీణ్ హీరోగా మారాడు కదా అని.. అతని హీరోయిజం కోసం అనవసరమైన లిబర్టీస్ తీసుకోకపోవడం కొంత ప్లస్ అయ్యింది.అతను కూడా కామెడీ చేయడానికి ఇబ్బంది పడలేదు. కానీ లవ్ స్టోరీ ఇంకాస్త బాగా డిజైన్ చేసుకోవాల్సింది. మరోపక్క వైవా హర్ష పాత్రని కూడా బాగా డిజైన్ చేశారు. క్లైమాక్స్ లో ఇతని బ్యాక్ స్టోరీకి ప్రేక్షకులు ఎమోషనల్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. కృష్ణ భగవాన్ చాలా కాలం తర్వాత తన మార్క్ కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అది పూర్తి స్థాయిలో ఫలించలేదు. మిగిలిన నటీనటులు ఓకే.
ప్లస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
కామెడీ
ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్
మైనస్ పాయింట్స్ :
ప్రొడక్షన్ వాల్యూస్
సినిమాటోగ్రఫీ
మొత్తంగా… ‘బకాసుర రెస్టారెంట్’ ఇంట్రెస్టింగ్ గా మొదలై.. కొంచెం నవ్వించి.. ఆ తర్వాత లేని పోనీ సాగదీత వల్ల.. అప్పటివరకు డెవలప్ అయిన అంచనాలను డౌన్ చేసేస్తుంది. కానీ ఓటీటీలో అయితే ఒకసారి టైం పాస్ కి ట్రై చేసేలానే ఉంటుంది.
Bakasura Restaurant Telugu Movie Rating : 2/5