Kuberaa Movie Review : ధనుష్ – నాగార్జున – శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ‘కుబేర’ రూపొందింది. క్రేజీ కాంబినేషన్ కావడంతో సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…
కథ :
నీరజ్(జిమ్ సరబ్) పెద్ద బిజినెస్మెన్. ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ అనిపించుకోవాలి… సెలబ్రిటీ స్టేటస్ తో పాటు రాజకీయ నాయకులను కూడా గ్రిప్లో పెట్టుకుని పవర్ఫుల్ పర్సన్ గా చలామణి అవ్వాలి అనేది ఇతని లక్ష్యం. కొన్నేళ్ళకు సరిపోయే ఆయిల్ అండ్ గ్యాస్ లభించింది అనే విషయం తెలుసుకుని.. ఆ ప్రాజెక్టుని లాక్కోవాలని రాజకీయ నాయకులతో పొత్తు పెట్టుకుంటాడు. అందుకు గాను ఆ రాజకీయనాయకులు లక్ష కోట్లు డిమాండ్ చేస్తారు. అందులో కొంత లిక్విడ్ క్యాష్ గా.. బ్లాక్ మనీగా ఇస్తారు. మిగిలిన యాభై వేల కోట్లను బినామీల పేరు మీదకి మార్చి వీళ్ళకి అందేలా చేద్దామని దీపక్(నాగార్జున) నీరజ్ కి సలహా ఇస్తాడు.
అందుకోసం నలుగురు బిచ్చగాళ్ళని ఎంపిక చేసుకుంటారు. వాళ్ళకి ఆధార్ కార్డు, పాన్ కార్డు క్రియేట్ చేసి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి.. వాళ్ళని బినామీలుగా పెట్టుకుని డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఒక్కొక్కరి అకౌంట్ నుండి డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే ఆ బిచ్చగాళ్ళని చంపేయమని ఆర్డర్ వేస్తాడు నీరజ్.
వీరిలో దేవా(ధనుష్) కుష్బూ(దివ్య డేకటే) కూడా ఉంటారు. కుష్బూ ప్రెగ్నెంట్. అయినప్పటికీ ఆమెను చంపేసే ముందు శారీరకంగా అనుభవించాలని అనుకుంటాడు రోబో(సౌరవ్ ఖురానా). కానీ అందుకు దేవా అడ్డుపడతాడు. దీంతో దేవాని చెంపేయాలని అనుకుంటాడు రోబో. కానీ ఇంతలో దేవా అకౌంట్ నుండి డబ్బు ట్రాన్స్ఫర్ అవ్వదు. తర్వాత ఏమైంది? దేవా.. నీరజ్ బారి నుండి తప్పుకున్నాడా? దీపక్ గతమేంటి? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ :
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందే సినిమాలు ఫలితాలతో సంబంధం లేకుండా ఓ గౌరవాన్ని సంపాదించుకుంటాయి. ఎందుకంటే టిపికల్ స్టోరీ లైన్ ను తీసుకుని సెన్సిబిల్ గా డీల్ చేస్తూ ఉంటాడు. రియాలిటీకి అది దగ్గరగా ఉంటుంది. సంభాషణలు కూడా అంతా రిలేట్ చేసుకునే విధంగా ఉంటాయి. ‘ఆనంద్’ నుండి ‘లవ్ స్టోరీ’ వరకు అన్ని సినిమాలు అలానే ఉంటాయి. ‘కుబేర’ కూడా అలానే మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది. ఒక్కో క్యారెక్టర్ పరిచయం, వరల్డ్ బిల్డింగ్ అనేది కరెక్ట్ మీటర్లోనే ఉంటుంది.
కానీ సెకండాఫ్ తేడా కొట్టేసింది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుండి ఇంటర్వెల్ వరకు ఏదైతే కథ నడిచిందో.. సెకండాఫ్ అంతా అదే కథ నడుస్తూ ఉంటుంది. మంచి సన్నివేశాలు ఉన్నా సింపుల్ గా చెప్పి ముగించాల్సి అంశాన్ని ఇంత సాగదీయాల్సిన అవసరం ఏముంది అనే ఫీలింగ్ కలుగుతుంది. దీంతో శేఖర్ కమ్ముల ట్రాక్ తప్పాడు అనే ఫీలింగ్ కూడా వస్తుంది.
సినిమాలో స్టార్ క్యాస్టింగ్ ఉన్నా.. లొకేషన్స్ అన్నీ నేచురల్ గానే ఉన్నాయి. నిర్మాతలు కథకి ఎంత పెట్టాలో, ఎక్కడ పెట్టాలో అక్కడ బాగానే ఖర్చు చేశారు. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది అని చెప్పాలి. రన్ టైం మాత్రం 3 గంటల పైనే ఉంది. ఎడిటర్ ఈజీగా ఓ 20 నిమిషాలు ట్రిమ్ చేసే అవకాశం ఉన్నా ఎందుకో ఆ పని చేయలేదు.
నటీనటుల విషయానికి వస్తే.. ధనుష్ తప్ప ఇలాంటి పాత్ర చేసే గట్స్ తమిళ్ లో కూడా మరో హీరోకి లేవనే చెప్పాలి. అతని నటనకి మరో నేషనల్ అవార్డు అనేది చిన్న మాట. నాగార్జున కూడా తన బెస్ట్ ఇచ్చాడు. ఇలాంటి పాత్ర చేసే గట్స్ మన సీనియర్ హీరోల్లో నాగార్జునకి మాత్రమే ఉన్నాయి. రష్మిక పోర్షన్ కొంత ఫోర్స్డ్ గా అనిపించినా ఆమె బాగానే చేసింది. జిమ్ సరబ్ కూడా చాలా బాగా చేశాడు. మిగతా నటీనటులు ఓకే.
ప్లస్ పాయింట్స్ :
ధనుష్ నటన
నాగార్జున నటన
ఫస్ట్ హాఫ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్ :
నిడివి
సాగదీత
సెకండాఫ్
ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అవ్వడం
మొత్తంగా ‘కుబేర’… ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ వరకు అంతే ఇంట్రెస్టింగ్ గా సాగింది. తర్వాత వచ్చిన సీన్లే మళ్ళీ మళ్ళీ వస్తుండటంతో ఇరిటేట్ చేస్తుంది. చాలా ఓపికతోనే థియేటర్ కి వెళ్లి కూర్చోవాలి.
Kuberaa Movie Rating : 2.25/5