రివ్యూ : మారీసన్ మూవీ
విడుదల తేదీ : జూలై 25
దర్శకుడు: సుధీష్ శంకర్
నటీనటులు: ఫహద్ ఫాజిల్, వడివేలు, అనుపమ పరమేశ్వరన్
సంగీతం : యువన్ శంకర్ రాజా
Maareesan Review in Telugu : మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్, తమిళ కామెడీ కింగ్ వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ కామెడీ-థ్రిల్లర్ చిత్రం ‘మారీసన్’ (Maareesan). సుధీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 25న అంటే ఈరోజు థియేటర్లలో విడుదలైంది. రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగే ఈ మూవీ, అందులో ఫస్ట్ టైం కలిసిన నటించిన ఫహద్ – వడివేలు కాంబో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.
కథ
‘మారీసన్’ మూవీ నాగర్‌కోయిల్ నుండి పొల్లాచి వరకు ఒక రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగే కామెడీ-థ్రిల్లర్ చిత్రం. ఫహద్ ఫాజిల్ ఇందులో ఒక దొంగ పాత్రలో కనిపిస్తాడు. అతను అల్జీమర్స్‌తో బాధపడుతున్న వడివేలును దోచుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఎందుకంటే వడివేలు బ్యాంక్ ఖాతాలో భారీ మొత్తం డబ్బు ఉంటుంది. కానీ ఆయన మతిమరుపు సమస్యతో బాధపడతాడు. అయితే వడివేలు తన జ్ఞాపకశక్తి కోల్పోతున్నప్పటికీ, తిరువణ్ణామలైలోని ఒక స్నేహితుడిని కలవడానికి బయలు దేరతాడు. ఫహద్ ఇదే అదనుగా, డబ్బు దొంగిలించే ఉద్దేశ్యంతో… వడివేలుని మోటార్ సైకిల్‌పై తీసుకెళ్తాడు. ఈ ప్రయాణంలో జరిగే సంఘటనలు కథను ముందుకు నడిపిస్తాయి. అందులో కామెడీ, థ్రిల్లర్, భావోద్వేగ అంశాలు మిళితమై ఉంటాయి. మరి ఇంతకీ వడివేలు ఎందుకు ఇలాంటి పరిస్థితిలో స్నేహితుడిని కలవడానికి వెళ్ళాడు? ఫహద్ అనుకున్నట్టుగానే దొంగతనం చేశాడా? చివరికి ఈ రోడ్ ట్రిప్ ఎలా ముగిసింది? అన్నది స్టోరీ.
విశ్లేషణ
ఫహద్ ఫాజిల్, వడివేలు మధ్య కెమిస్ట్రీ చిత్రానికి ప్రాణం పోసింది. అయితే రొటీన్ కథ కావడం, కథలో కొన్ని సీన్స్ ప్రేక్షకులకు ముందే అర్థం అయ్యేలా ఉండడంతో థ్రిల్లింగ్ ఫీల్ మిస్ అయ్యింది. అలాగే సినిమా రెండవ భాగంలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినట్లు అనిపించాయి. అంతేకాదు అనుపమ పరమేశ్వరన్ వంటి సహాయక నటులకు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉండటం వల్ల వారి పాత్రలు పెద్దగా ఎఫెక్టివ్ గా అన్పించవు. సినిమా చూశాక ఫహద్, వడివేలు తప్ప ఎవ్వరూ గుర్తుండరు.
ఫహద్ ఫాజిల్ తన నేచురల్ నటనతో ఒక చిన్న దొంగగా మెప్పించాడు. ముఖ్యంగా కథలోని ట్విస్ట్‌లలో అతని పాత్ర బాగా కుదిరింది. ఇక వడివేలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వడివేలు తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో పాటు భావోద్వేగ సన్నివేశాల్లో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. రోడ్ ట్రిప్ సన్నివేశాలు, తమిళనాడు గ్రామీణ ప్రాంతాల నేపథ్యాన్ని అందంగా చిత్రీకరించారు. సినిమాటోగ్రఫీ సినిమాకి విజువల్స్ పరంగా బలం చేకూర్చింది.
ప్లస్ పాయింట్స్
నటీనటులు
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ
సెకండాఫ్
సపోర్టింగ్ రోల్స్
మొత్తానికి
ఫహద్ ఫాజిల్, వడివేలు అభిమానులు ఈ కామెడీ లైట్ థ్రిల్లర్ సినిమాను కుటుంబంతో కలిసి ఈసారి సరదాగా చూడొచ్చు.
Maareesan Rating : 2/5