రివ్యూ : ది కాంజ్యూరింగ్: లాస్ట్ రైట్స్ సినిమా
దర్శకుడు: మైఖేల్ చావ్స్
నటీనటులు: వెరా ఫార్మిగా (లొరైన్ వారెన్), పాట్రిక్ విల్సన్ (ఎడ్ వారెన్), ఎలియట్ కోవాన్, బెన్ హార్డీ, జాన్ బ్రదర్టన్, మియా టామ్లిన్సన్ (జూడీ వారెన్)
నిర్మాతలు: జేమ్స్ వాన్, పీటర్ సాఫ్రాన్
The Conjuring: Last Rites Review : ‘ది కాంజ్యూరింగ్: లాస్ట్ రైట్స్’ కాంజ్యూరింగ్ ఫ్రాంచైజ్‌లో నాల్గవ చిత్రం. మొత్తం కాంజ్యూరింగ్ యూనివర్స్‌లో 11వ చిత్రం. ఈ సినిమాలో పాపులర్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఎడ్, లొరైన్ వారెన్‌ల చివరి కేసును ఆవిష్కరించారు మేకర్స్. హర్రర్ సినిమాలలోనే భయంకరమైన సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ ‘కాంజ్యూరింగ్’ ఫ్రాంచైజీలో చివరిది. సెప్టెంబర్ 5న ఈ హర్రర్ మూవీ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి ఈ చివరి పార్ట్ హర్రర్ మూవీ లవర్స్ ను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.
‘ది కాంజ్యూరింగ్: లాస్ట్ రైట్స్’ మూవీ 1956లో ప్రారంభమవుతుంది. లొరైన్ వారెన్ (వెరా ఫార్మిగా) ఒక పురాతన అద్దాన్ని పరిశీలిస్తుండగా, ఆమె గర్భంలోని బిడ్డ జూడీకి సంబంధించిన భయంకరమైన సైకిక్ విజన్‌ను చూస్తుంది. 30 సంవత్సరాల తర్వాత అంటే 1986లో, పెన్సిల్వేనియాలోని స్మర్ల్ కుటుంబం కొత్త ఇంట్లోకి వెళ్తుంది. హీథర్ స్మర్ల్ బర్త్ డే కోసం తెచ్చిన ఒక అద్దం దెయ్యాలు కేంద్రంగా మారుతుంది. దీంతో ఫ్యామిలీలో భయంకరమైన సమస్యలు మొదలవుతాయి. ఎడ్ (పాట్రిక్ విల్సన్), లొరైన్ తమ కుమార్తె జూడీ (మియా టామ్లిన్సన్) సహాయంతో… స్మర్ల్ కుటుంబాన్ని రక్షించడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. అయితే అద్దం వెనుక రెండు హత్యల రహస్యం ఉందనే విషయం బయట పడుతుంది. ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటి? ఆ ఇద్దరూ ఎలా చనిపోయారు ? లోరైన్, ఎడ్ ఈ కథకు ఎలా ముగింపు పలికారు? అన్నది తెరపై చూడాల్సిందే.
అత్యంత భయంకరమైన సినిమాలలో ‘కాంజ్యూరింగ్’ ఫ్రాంచైజీకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. చివరి పార్ట్ కావడంతో ‘ది కాంజ్యూరింగ్: లాస్ట్ రైట్స్’పై భారీ అంచనాలు ఉన్నాయి. విషయానికొస్తే… సినిమా ఓపెనింగ్ పవర్ ఫుల్ గా మొదలవుతుంది. లొరైన్ 1956 విజన్, స్మర్ల్ కుటుంబ ఇంట్లో జరిగే హారర్ సన్నివేశాలు (జానెట్ స్మర్ల్‌పై దెయ్యం దాడి, బేస్‌మెంట్‌లో నీడ సన్నివేశం) థియేటర్లలో ఆడియన్స్ ను భయపెట్టడంలో సక్సెస్ అవుతాయి. అలాగే ఈ ఫ్రాంచైజ్ లో ఐకానిక్ అన్నాబెల్ డాల్‌తో ఒక సన్నివేశం ఉంటుంది. అది సినిమాలో బెస్ట్ హారర్ మూమెంట్‌గా నిలుస్తుంది.
అయితే ఫస్ట్ హాఫ్ స్లోగా సాగుతుంది. వారెన్ దంపతులు కేసులో చేరడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో కథ డ్రాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. అలాగే హారర్ సన్నివేశాలు (అద్దాలలో వికృత ముఖాలు, నీడలు) మునుపటి కాంజ్యూరింగ్ చిత్రాల నుండి రిపీట్ అయినట్లు అన్పించడంతో కొత్తదనం లోపించిన ఫీల్ కలుగుతుంది. క్లైమాక్స్ హడావిడిగా అనిపిస్తుంది. దెయ్యం గురించి చాలా ప్రశ్నలు సమాధానం లేకుండా మిగిలిపోతాయి. అంతేకాదు స్మర్ల్ కుటుంబం కథలో మొదట ఆసక్తికరంగా కనిపించినప్పటికీ, సెకండ్ హాఫ్‌లో వారి ప్రాముఖ్యత తగ్గుతుంది. దీంతో కథ అసంపూర్ణంగా అన్పిస్తుంది. కానీ చివరి 20 నిమిషాలు కొంతమందికి నచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే లోరైన్ దంపతులకు ఇదొక ఎమోషనల్ ముగింపు అని చెప్పొచ్చు.
వెరా ఫార్మిగా, పాట్రిక్ విల్సన్ తమ పాత్రలైన లొరైన్ – ఎడ్ వారెన్‌లలో మరోసారి అద్భుతంగా నటించారు. వారి ఎమోషనల్ కెమిస్ట్రీ సినిమాకు సోల్ లాంటిది. జూడీ పాత్రలో మియా టామ్లిన్సన్ కూడా ఆకట్టుకుంది. ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ వంటి టెక్నీకల్ అంశాల పరంగా మూవీ పర్లేదు.
నటన
అన్నాబెల్ సన్నివేశం
ఊహించదగిన హారర్ సీన్స్
ఫస్టాఫ్
కాంజ్యూరింగ్ ఫ్రాంచైజ్ అభిమానులకు ఇదొక ఎమోషనల్, హారర్ థ్రిల్ ఎండింగ్. కానీ The Conjuring, The Conjuring 2 స్థాయి హర్రర్ సీన్స్ ను ఆశిస్తే నిరాశ తప్పదు.
The Conjuring: Last Rites Rating : 2.5/5