Mirai Movie Review : తేజ సజ్జా చిన్న హీరోనే అయినా.. ఆయన ఎంచుకునే స్టోరీస్ ఆయనకు పాన్ ఇండియా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇప్పటికే హనుమాన్ మూవీతో సూపర్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు అలాంటి సినిమా మిరాయ్‌తో మరోసారి వచ్చాడు. రాముడు అంటూ డివోషనల్ టచ్‌తో చేసిన ప్రమోషన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఆ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం..
అశోకుడు కలింగ యుద్దం జయించిన తర్వాత ఆ రక్తపాతాన్ని చూసి అన్నింటినీ వదిలి, తన శక్తిలను 9 గ్రంథాల్లో పొందుపరుస్తాడు. ఆ 9 గ్రంథాలను 9 మంది యోధులు కాపాలకాస్తూ ఉంటారు. కలియుగంలో మహాభీర్ లామా (మంచు మనోజ్) ఆ గ్రంథాలను ఒక్కోదాన్ని స్వాధీనం చేసుకుంటూ వస్తాడు. 9వ గ్రంథం మృత్యువు జయించే శక్తిని ఇస్తుంది. దాన్ని కూడా మహాభీర్ సొంతం చేసుకుంటే ప్రపంచం వినాశనం అవుతుంది.
9వ గ్రంథం మహాభీర్‌కు చిక్కకుండా అడ్డుకునే బాధ్యత వేద (తేజ సజ్జా). అందుకు వేదకు మిరాయ్ కావాల్సి వస్తుంది. దీని అంతటికీ విభా (రితిక నాయర్) సాయం చేస్తుంది. మిరాయ్ ను వేద ఎలా దక్కించుకున్నాడు ? మహాభీర్ ను ఎలా ఎదుర్కొన్నాడు ? ఆ ప్రాసెస్‌లో వేద ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడు ? అసలు 9వ గ్రంథాన్ని కాపాడే బాధ్యత వేదకు ఎందుకు వచ్చింది ? అందులో అభింక (శ్రియ) పాత్ర ఏంటి ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
డివోషనల్ టచ్‌తో చేసే సినిమాలకు తిరుగు ఉండదు. అది ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. కార్తికేయ 2, హనుమాన్ వంటి సినిమాల టైంలో అది మనం చూశాం. డివోషనల్ టచ్‌తో పాటు మంచి కథ, కథనం, వీఎఫ్ఎక్స్ తోడు అయితే ఆడియన్స్‌కి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మిరాయ్ మూవీని అలానే చేశారు.
ఇతిహాసాల నుంచి తీసుకున్న కథ కాబట్టి, కావాల్సినంత డివోషనల్ టచ్ ఉంది. యాక్షన్స్ సీన్స్ బాగున్నాయి. వీఎఫ్ఎక్స్ అద్భుతం. తేజ సజ్జా, మంచు మనోజ్, జగపతి బాబు, శ్రియ లాంటి స్టార్ కాస్ట్ ఉన్నారు. ఇలా ఓ మంచి సినిమాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అన్నీ బాగా కుదిరాయి. అలా కుదిరినా… డైరెక్టర్ సరిగ్గా డీల్ చేయకపోతే అన్నీ ఫెయిల్ అయ్యేవి. కానీ, ఇక్కడ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని చాలా బాగా డీల్ చేశాడు.
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి సినిమా చేశాడు అంటే డైరెక్టర్‌ను శభాష్ అనాల్సిందే. అది ఒక్కటే కాదు.. కథను నడిపిన విధానం కూడా బాగుంది. అయితే, ఎక్కువ డీటైల్డ్ చూపించాలని అనుకున్నాడేమో డైరెక్టర్.. కొన్ని సీన్స్‌లో బోర్ ఫీల్ వస్తుంది.
ఫస్టాఫ్ లో అసలు విషయాన్ని చెప్పి.. డైరెక్ట్ హీరో దగ్గరకు తీసుకెళ్లాడు. హీరో తన బాధ్యత ఏంటో కూడా త్వరగానే చూపించాడు. కానీ, ఎందుకో.. అక్కడ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కూడా కథనం బానే నడుస్తుంది. కానీ, మళ్లీ ఏదో ల్యాగ్ అనేలా ఫీల్ వస్తుంది.
వీఎఫ్ఎక్స్ సూపర్‌గా ఉన్నాయి. అంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి హై సీజీ వర్క్ చూపించడం నిజంగా గ్రేట్ అనుకోవాలి. కానీ, కొన్ని చోట్ల AI పల్లకింద రాయిలా తగులుతుంది. దాన్ని కూడా క్లియర్ చేసుకుంటే ఇంకా మంచి అవుట్ పుట్ వచ్చేది. క్లైమాక్స్‌లో రాముడు ఎంట్రీ ఉన్నా… ఎక్కువ సేపు ఉన్నట్టు అనిపిస్తుంది. దీని వల్ల క్లైమాక్స్ ఫైట్ ఎఫెక్ట్ అయింది. యూట్యూబ్ లో మంచి వ్యూస్ తెచ్చుకున్న వైబ్ ఉంది సాంగ్ లేకపోవడం నిరాశపరిచింది.
మొత్తానికి అయితే, డైరెక్టర్ ఈగల్ లో వచ్చిన మైనస్ లను ఇక్కడ మళ్లీ రాకుండా జాగ్రత్తగా డీల్ చేశాడు అని చెప్పొచ్చు. తేజ సజ్జా ఫర్ఫామెన్స్‌కి వంక పెట్టలేం. సూపర్ హీరో సినిమాలు ఈయన కోసం ఉన్నట్టు నటించాడు. మంచు మనోజ్… సరిగ్గా సెట్ అయ్యాడు ఈ పాత్రకు. గంభీర్యంగా వచ్చే వాయిస్ విలనీజాన్ని బాగా పండించింది. ఈ దెబ్బతో మంచు మనోజ్ పాన్ ఇండియా విలన్ అయిపోవచ్చు. ప్రభాస్ కనిపించలేదు కానీ, వాయిస్ వినిపించింది. అది సినిమాకు కొంతమేర హెల్ప్ చేసింది. రితికా నాయర్ చూడటానికి స్క్రీన్ పై బాగుంది. శ్రియ, జగపతి బాబు పాత్రలో ఒదిగిపోయారు. డైరెక్టర్ వెంకటేష్ మహా ఈ సినిమాలో ఎందుకు ఉన్నాడో అసలు అర్థం కాదు. ఆయన పాత్రకు సినిమాకు ఎలాంటి సంబంధం లేదు.
సినిమాకు మరింత హెల్ప్ చేసింది మ్యూజిక్. గౌర హరి న్యాయం చేశాడు. ఎడిటింగ్ విషయానికి వస్తే.. సినిమాలో కొంత ట్రిమ్ చేయాల్సింది. కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా కోసం నిర్మాతలు ఎక్కడా తగ్గలేదు అనేది స్క్రీన్ పై కనిపిస్తుంది.
తేజ సజ్జా
మంచు మనోజ్
కథ , కథనం
మ్యూజిక్
ల్యాగ్ సీన్స్
వైబ్ ఉంది సాంగ్ లేకపోవడం
సెకండాఫ్‌లో కొంత వరకు
మొత్తానికి… మిరాకిల్ మిరాయ్