Ramam Raghavam Movie Review :’జబర్దస్త్’ వాళ్లలో కూడా మంచి టాలెంట్ ఉందని వేణు ‘బలగం’ చిత్రాన్ని డైరెక్ట్ చేసి చూపించాడు. దీంతో ధనరాజ్ డైరెక్ట్ చేస్తున్న ‘రామం రాఘవం’ పై అందరి అటెన్షన్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని ధనరాజ్ డైరెక్ట్ చేయడంతో పాటు.. ఇందులో హీరోగా కూడా నటించడం జరిగింది. పెద్దగా అంచనాలు లేకుండా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :
కథ : దశరథ రామం(సముద్రఖని) ఓ రిజిస్ట్రార్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటాడు. చాలా నిజాయితీ పరుడు. జీతం తప్ప ఒక్క రూపాయి కూడా ఎవ్వరి దగ్గర తీసుకోడు. దీంతో అతన్ని వ్యక్తిగతంగా అభిమానించే వారు ఎక్కువగా ఉంటారు. అతనికి తన కొడుకు రాఘవ(ధనరాజ్) అంటే ప్రాణం. కానీ రాఘవకి చదువు అబ్బదు. ఏ పని చేయకుండా గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటాడు. మద్యం, జూదంకి బానిస అయిపోతాడు. షార్ట్ కట్లో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనేది అతని తాపత్రయం. దీంతో ఒకసారి తండ్రి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి దొరికిపోతాడు. దీంతో రామం.. కొడుకు అనే కనికరం లేకుండా పోలీసులకి అప్పగిస్తాడు. తర్వాత రాఘవ తండ్రిపై కోపం పగ పెంచుకుంటాడు. తర్వాత అతని స్నేహితుడు, లారీ డ్రైవర్ అయినటువంటి దేవా(హరీష్ ఉత్తమన్)తో కలిసి తన తండ్రిని చంపాలని చూస్తాడు. దాని వల్ల రామం ఉద్యోగం అతనికి వస్తుంది. ఇన్సూరెన్స్ డబ్బులతో కోటీశ్వరుడు అయిపోతాడు అనేది రాఘవ ప్లాన్. ఈ క్రమంలో అతను చేసిన ఘోరాలు ఏంటి? చివరికి అతను మారాడా? లేదా? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ : కొడుకు జులాయిగా తిరగడం.. అతన్ని తండ్రి ద్వేషించడం వంటి లైన్ తో చాలా సినిమాలు వచ్చాయి. ‘గౌతమ్ ఎస్ ఎస్ సి’ నుండి ‘రఘువరన్ బి టెక్’ వరకు ఆ లైన్ తో చాలా సినిమాలు చూశాం. ‘రామం రాఘవం’ ఫస్ట్ హాఫ్ చూస్తే.. ఇది రొటీన్ సినిమానే కదా అనే ఫీలింగ్ వస్తుంది. అందుకే సెకండాఫ్ ను ఎవ్వరూ ఊహించని ట్విస్ట్..లతో మెస్మరైజ్ చేశాడు దర్శకుడు. ఇక్కడ దర్శకుడు కూడా ధనరాజ్ అనే సంగతి గుర్తుంచుకోవాలి. రొటీన్ గా కాకుండా చాలా సహజంగా స్క్రీన్ ప్లే ని రాసుకున్నాడు. సినిమా చూస్తున్నంత సేపు.. అందరూ తమ తండ్రులను గుర్తుచేసుకుని.. తండ్రులపై కోపం తెచ్చుకున్న సందర్భాలు కూడా నెమరువేసుకుని పశ్చాత్తాపపడేలా చేశాడు దర్శకుడు. ముఖ్యంగా క్లైమాక్స్ ని ధనరాజ్ డీల్ చేసిన విధానం బాగుంది. అక్కడ అందరూ కన్నీళ్లు పెట్టుకోవడం ఖాయం. టెక్నికల్ గా కూడా ఈ సినిమా పర్వాలేదు. తూర్పుగోదావరి జిల్లాల్లోని నేచురల్ లొకేషన్స్ ను చాలా అందంగా చూపించారు. ప్రతి ఫ్రేమ్ క్వాలిటీగా ఉంది.
నటీనటుల విషయానికి వస్తే.. ధనరాజ్ బాగా చేశాడు. కానీ అతని ప్లేస్లో ఇంకో హీరో ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది. ఎందుకంటే ‘విమానం’ సినిమాలో సముద్రఖని, ధనరాజ్ కలిసి ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళలా నటించారు. కాబట్టి.. ఇందులో వాళ్ళని తండ్రీకొడుకులుగా చూడటం కొంచెం కష్టంగా అనిపించింది. కానీ వాళ్ళ నటనతో దాన్ని కవర్ చేసే ప్రయత్నం అడుగడుగునా చేశారు. అయితే ఎంత కాదు అనుకున్నా.. ఇందులో కొంచెం నోటెడ్ హీరో కనుక ఉండుంటే.. కమర్షియల్ గా కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉండేవి. ఇక హరీష్ ఉత్తమన్ కి కూడా మంచి పాత్ర దొరికింది. అతను కూడా బాగానే చేశాడు. తల్లిగా చేసిన ప్రమోదిని కూడా క్లైమాక్స్ లో మెప్పించింది. హీరోయిన్ మోక్షకి చెప్పుకోదగ్గ పాత్ర కాదిది. మిగిలిన వాళ్ళు ఓకె ఓకె అన్నట్టు చేశారు.
ప్లస్ పాయింట్స్ :
సెకండాఫ్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
హీరోయిన్ ట్రాక్
మొత్తంగా ‘రామం రాఘవం’ చిత్రం రొటీన్ గా మొదలైనప్పటికీ.. సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ తో ఒకసారి చూడదగ్గ విధంగా అయితే ఉంది.
రేటింగ్ : 2.25/5