Odela 2 Movie Review : తమన్నా శివశక్తిగా నటించిన ‘ఓదెల 2’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి భాగం ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఓటీటీలో మంచి విజయం అందుకుంది. అందుకే ‘ఓదెల 2’ పై కొద్దిపాటి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
రాధ(హెబ్బా పటేల్) తిరుపతిని(వసిష్ఠ ఎన్ సింహా) హతమార్చిన తర్వాత ఏమైంది అనే సస్పెన్స్ ను ట్రైలర్ కట్ చేశారు. అయితే సినిమా స్టార్టింగ్ రాధ తలతో ఓ చిన్న పాప పోలీస్ స్టేషన్ కి వెళ్లడం దగ్గర నుండి కథ మొదలవుతుంది. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వస్తాయి. తిరుపతి చనిపోయిన తర్వాత అతని అంత్యక్రియలు జరగనివ్వకుండా… శవాన్ని నిట్ట నిలువుగా ఉంచి సాధించేయడంతో తిరుపతి ఆత్మ శాంతించదు. దీంతో అతను ప్రేతాత్మ అయిపోతాడు. ఆ తర్వాత ఊర్లో ఎవరి పెళ్లి జరిగినా… మొదటి రాత్రి రోజున ఎవరొకర్ని ఆవహించి వధూవరులను చంపేస్తూ ఉంటాడు.
ఈ క్రమంలో అతను ఆవహించిన వాళ్ళు నిందలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ తర్వాత తిరుపతి ఆత్మ ఇదంతా చేస్తుంది అని తెలుసుకుని.. జైల్లో ఉన్న రాధ వద్దకి వెళ్తే…ఆమె తన సోదరి భైరవి(తమన్నా) అనే నాగ సాధువు గురించి చెప్పి ఆమె మాత్రమే ఈ సమస్య నుండి ఓదెలని(ఊరుపేరు) బయటపారేస్తుంది అని పరిష్కార మార్గం చెబుతుంది. మరి రాధని తిరుపతి ఏ కారణంతో తెగనరికి చంపాడు? చివరికి భైరవి ఊరి జనాలను ఎలా రక్షిస్తుంది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
‘ఓదెల రైల్వేస్టేషన్’ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. దానిపై ఆడియన్స్ కి ఎటువంటి అంచనాలు లేవు కాబట్టి, పైగా ఇంట్లో కూర్చుని చూసే సినిమా కాబట్టి.. దాన్ని ఒకసారి ట్రై చేశారు. బాగానే అనిపించింది. కానీ రెండో భాగం సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో చేయాలని అనుకున్నారు. ఆ ఐడియాని నిజంగా మెచ్చుకోవాల్సిందే. ‘ఓదెల 2’ కి విడుదల ముందు బిజినెస్ బాగా జరగడానికి కారణం కూడా అదే. అయితే సినిమా స్టార్టింగ్ పోర్షన్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడా ఆసక్తికలిగించేలా సాగదు.
ఒక్కటీ సీన్ ని మళ్ళీ మళ్ళీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతే, సెకండాఫ్ కూడా అంతే. సినిమాలో గ్రాఫిక్స్ కోసం నిర్మాత బాగా ఖర్చు పెట్టాడు. అలా అని అవి కూడా అబ్బురపరిచేలా ఏమీ ఉండవు. కానీ చెప్పుకోవడానికి అవి కొంచెం బెటర్ అని చెప్పాలి. నిర్మాత ఖర్చు బాగా పెట్టాడు. దర్శకుడు అశోక్ తేజ ఈ రిజల్ట్ కి బాధ్యత వహించాల్సిందే. సంపత్ నంది రైటింగ్, డైరెక్షన్ సూపర్ విజన్, డైలాగ్స్ విభాగంలో ఏం చేశాడో ఆయనకే తెలియాలి. కేవలం బిజినెస్ కోసమే అతను పేరు వేసుకున్నాడేమో అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే… తిరుపతిగా వశిష్ట సింహ బాగా చేశాడు. అతని గొంతు చాలా బాగుంది. కంటెంట్ ఎలా ఉన్నా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇతని రూపంలో టాలీవుడ్ కు మరో సోనూ సూద్ దొరికినట్టే. ఇక తమన్నాకి మంచి పాత్ర దొరికింది. హీరో రేంజ్లో ఈమెకు ఎలివేషన్ సీన్స్ కూడా రాశాడు సంపత్ నంది. కానీ ఈమె పలికించిన హావభావాలు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా లేవు. ఫస్ట్ పార్ట్ లో మెయిన్ లీడ్ గా చేసిన హెబ్బా పటేల్.. ఇందులో సైడ్ క్యారెక్టర్ అయిపోయింది. శ్రీకాంత్ అయ్యంగార్, మురళీ శర్మ బాగా నటించారు కానీ… వారి క్యారెక్టర్లకి సరైన జస్టిఫికేషన్ లేకపోవడం బాధాకరం.
ప్లస్ పాయింట్స్ :
నిర్మాణ విలువలు
స్టోరీ లైన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్ :
డైరెక్షన్
స్క్రీన్ ప్లే
మొత్తంగా ‘ఓదెల 2’ … కొన్ని చోట్ల ‘అరుంధతి’ ని గుర్తుచేస్తుంది. అలా అని ‘అరుంధతి 2’ అని తప్పుగా మాట్లాడకూడదు. ఇది ‘అరుంధతి’ కి పేరడీ అనుకోవాలి. ఎంతో ఓపిక ఉంటే తప్ప ఈ సినిమాని క్లైమాక్స్ వరకు చూడటం కష్టం.
Odela 2 Movie Rating : 1.75/5