Fruit Peels: మనం పండ్లు తిని తొక్కలను చెత్తబుట్టలో పడేస్తాం. కానీ మీకు తెలుసా ? మనం పడేసే ఆ తొక్కల్లోనే అసలైన పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చాలా మందికి తెలియని ఈ రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం పండ్లే కాదు.. వాటి తొక్కలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన జీర్ణక్రియను మెరుగు పరచడం నుంచి చర్మాన్ని కాంతివంతంగా మార్చడం వరకు అనేక రకాలుగా సహాయ పడతాయి.
ఇకపై మీరు పడేయకుండా ఉపయోగించాల్సినవి ఇవే..
1. నిమ్మకాయ :
నిమ్మకాయ తొక్కలో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో.. జీర్ణ క్రియను మెరుగు పరచడంలో సహాయ పడతాయి. నిమ్మ తొక్కను తురిమి సలాడ్స్‌పై చల్లుకోవచ్చు లేదా టీలో.. కూడా వేసుకోవచ్చు.
2. నారింజ :
నారింజ తొక్కలో ఉండే హెస్పరిడిన్ అనే ఫ్లేవనాయిడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే.. దానిలో ఉండే విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. నారింజ తొక్క పొడిని టీ లేదా స్మూతీస్‌లో కూడా కలుపుకోవచ్చు.
3. అరటి :
అరటి తొక్కలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్రకు సహాయపడుతుంది. దీన్ని పారేయకుండా.. కూరగాయలతో కలిపి కూడా వండుకోవచ్చు.
4. యాపిల్ :
యాపిల్ తొక్కలో ఫైబర్ , క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యానికి మంచివి. యాపిల్ తొక్కలను సలాడ్స్‌లో ఉపయోగించుకోవచ్చు.
5. దానిమ్మ :
దానిమ్మ తొక్కలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తొక్కను ఎండబెట్టి పొడిగా చేసి.. చర్మం సంరక్షణకు కూడా ఉపయోగించవచ్చు. మొటిమలు, మచ్చలు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
6. మామిడిపండు :
మామిడి తొక్కలో పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును తగ్గించడంలో సహాయ పడతాయి. మామిడి తొక్కను కొన్ని దేశాల్లో సలాడ్స్, ఊరగాయలలో ఉపయోగిస్తారు.
7. పుచ్చకాయ :
పుచ్చకాయ తొక్కలో ఉండే లైకోపీన్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. పుచ్చకాయ తొక్కను పారేయకుండా జ్యూస్ చేసుకోవచ్చు లేదా కూరలాగా వండుకోవచ్చు.
Also Read: విటమిన్ డి సప్లిమెంట్లతో.. ఎన్ని లాభాలో తెలుసా ?
8. కివీ :
కివీ తొక్కలో ఫైబర్, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండూ చర్మానికి, జీర్ణక్రియకు చాలా మంచిది. కివి పండును తొక్కతో సహా తినవచ్చు.
9. దోసకాయ :
దోసకాయ తొక్కలో విటమిన్ కె, ఫైబర్, పొటాషియం వంటివి ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, శరీరానికి అవసరమైన హైడ్రేషన్ అందించడానికి తోడ్పడతాయి. సలాడ్స్‌లో దోస కాయను తొక్కతో సహా తినడం ఉత్తమం.
ఈ పండ్ల తొక్కలను ఉపయోగించే ముందు వాటిని శుభ్రంగా కడగడం చాలా ముఖ్యం. వీలైనంత వరకు ఆర్గానిక్ పండ్లను వాడటానికి ప్రయత్నించండి. తొక్కలను పడేయకుండా ఈ విధంగా ఉపయోగించుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడు కోవడమే కాదు.. పర్యావరణానికి కూడా మేలు చేసిన వారవుతారు.