క్యాన్సర్ వ్యాధి నిర్థారణలో వైద్యులు కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేస్తుండవచ్చు. కొన్నిసార్లు క్యాన్సర్ వచ్చే ముప్పుని వైద్యులు ముందస్తుగా అంచనా వేయలేరు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ పనిచేస్తోంది. వైద్యులు కూడా గుర్తించని లక్షణాలను చక్కగా విశ్లేషిస్తోంది. ప్రొస్టేట్ క్యాన్సర్ ని గుర్తించడంలో ఏఐ అద్భుతంగా పనిచేస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు. డిటెయిల్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టారు.
అత్యంత సాధారణ క్యాన్సర్..
పురుషుల పునరుత్పత్తి వ్యవస్థలో భాగమైన ప్రోస్టేట్ గ్రంథిలో అసాధారణంగా కణాలు పెరగడమే ప్రొస్టేట్ క్యాన్సర్. అత్యంత సాధారణ క్యాన్సర్ రకాలలో ఇది కూడా ఒకటి. అయితే దీన్ని గుర్తించడం కష్టం. క్యాన్సర్ శరీరంలో ఉన్నా దాని పెరుగుదల అతి నెమ్మదిగా ఉంటుంది. అంటే దాని వల్ల జరిగే నష్టం కూడా నెమ్మది నెమ్మదిగా మొదలై, ఒక్కసారిగా ప్రాణాంతకంగా మారుతుంది. ప్రారంభ దశలోనే దీన్ని కనుగొనగలిగితే నివారణ సులభం. అయితే క్యాన్సర్ ప్రారంభంలో ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు బయటకు కనపడవు. క్యాన్సర్ కణితి బాగా పెరిగి మూత్రనాళంపై ఒత్తిడి పెంచినప్పుడు మాత్రమే దీని లక్షణాలు కనిపిస్తాయి. మూత్రవిసర్జన చేసే సమయంలో ఇబ్బంది పడటం, మూత్ర విసర్జన తర్వాత కూడా మూత్రాశయం ఖాళీ లేదన భావన ఉండటం, రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి రావడం, అకస్మాత్తుగా మూత్ర విసర్జన చేయాలన్న ఆలోచన రావడం.. వంటివి దీని లక్షణాలు. ముఖ్యంగా ఇది వృద్ధుల్లో కనపడుతుంది. అందుకే యువకులు, మధ్య వయస్కులు దీనిపట్ల పెద్దగా అవగాహన కలిగి ఉండరు.
నిర్థారణ ఇలా..
ప్రొస్టేట్ క్యాన్సర్ నిర్థారణకు ప్రస్తుతం ప్రాథమిక పరీక్షలు జరుపుతున్నారు. రోగ నిర్ధారణకు రక్తంలో PSA (ప్రోస్టేట్-స్పెసిఫిక్ యాంటిజెన్) స్థాయిలను గమనిస్తారు. ప్రోస్టేట్ బయాప్సీ కూడా చేస్తారు. ఒకవేళ అప్పటికే క్యాన్సర్ ఉన్నట్లయితే, గ్లీసన్ స్కోర్ ద్వారా కణితి పరిమాణాన్ని అంచనా వేస్తారు. అయితే బయాప్సీ పరీక్ష ద్వారా వ్యాధి నిర్థారణ చేయడంలో ఏఐ మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికిప్పుడు వారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు కనిపించకపోయినా భవిష్యత్ లో కచ్చితంగా వ్యాధికి గురవుతారని ఏఐ తేల్చి చెప్పింది. అంటే ప్రొస్టేట్ గ్రంధిలో క్యాన్సర్ కణితి పెరిగే అవకాశాలను అది కచ్చితంగా అంచనా వేసిందనమాట. ఒకవేళ కణితి పెరిగేందుకు అక్కడ అవకాశం ఉందే, దానివల్ల ప్రొస్టేట్ గ్రంథిలో కచ్చితంగా మార్పులు కనపడతాయి. అది బయాప్సీ పరీక్షలో బయటపడదు. ఏఐ మాత్రం దాన్ని కచ్చితంగా అంచనా వేయడం విశేషం.
ఇటీవల కాలంలో వైద్య విభాగంలో ఏఐ పనితీరుచూసి వైద్య నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. వైద్య విభాగం ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు వ్యాధి నిర్థారణలో ఇదే అతిపెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. ఏఐ వల్ల వ్యాధి నిర్థారణ కచ్చితంగా జరుగుతోందని, ముందస్తుగా వ్యాధిని గుర్తించడం వల్ల చికిత్స కూడా సులభం అవుతుందని చెబుతున్నారు. క్యాన్సర్ తో పాటు ఇతర కొన్నిరకాల వ్యాధుల నిర్థారణ చికిత్సలో కూడా నిపుణులు ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం విశేషం. రాబోయే రోజుల్లో వైద్య రంగంలో ఏఐ మరిన్ని విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని అంటున్నారు.