పందిర్ల కింద పచ్చటి ప్రకృతి. నేల లేకుండా పురుగు మందుల వాడకం లేకుండా పంట. అవును.. భవిష్యత్ వ్యవసాయానికి ఇది సరికొత్త రూపం. హైడ్రోపానిక్స్ లేదంటే ఆక్వా పానిక్స్. ఇప్పుడు ఔత్సాహిక వ్యవసాయదారుల నోళ్లలో మెదులుతున్న పదాలు. దీన్నే మట్టిలేని సాగు, న్యూట్రీ కల్చర్ అని పిలుస్తుంటారు.
మన దగ్గర వ్యవసాయం ఎట్ల చేస్తమో అందరికీ తెలుసు. పొలం దున్ని, నాట్లేసి, ఎరువులు, పురుగుమందులు చల్లి, అవసరానికి తగినన్ని నీళ్లు పట్టి, పంటను కోసి, బస్తాలకెత్తి.. అదో పెద్ద వ్యవహారం. నాట్లేసినప్పటి నుంచి పసిపిల్లాడిని చూసుకున్నట్టు జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. చుక్కనీరు ఎక్కువైనా, తక్కువైనా అసలుకే మోసం. ఇదీ మనకు తెలిసిన వ్యవసాయం. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. పండించాలంటే పొలమే అక్కర్లేదు. ఆమాటకొస్తే అసలు మట్టే అక్కర్లేదు. కలుపు మొక్కల బెడద లేదు. మడులు తియ్యక్కర్లేదు. తెగుళ్ల సమస్య లేదు. పురుగుమందుల పిచికారీ అస్సల్లేదు. మట్టి అవసరం లేని పొలమేంటి? అదేం వ్యవసాయం అని ఆశ్యర్యపోతున్నరా? అవును..మీరు వింటున్నది నిజమే. మట్టి అవసరం లేకుండా వ్యవసాయం చేయొచ్చు!
వాస్తవానికి మొక్కలకు పెరగటానికి కొంత ప్రదేశం, నీరు, ఇతర పోషకాలు ఉంటే చాలు. పెరిగి పెద్దవవడానికి మట్టి ఏ మాత్రం అక్కరలేదని శాస్త్రవేత్తలు ఆల్‌రెడీ ప్రూవ్ చేశారు. సాధారణంగా నేలమీద పెరిగే మొక్కలు తమకు అవసరమైన పదార్ధాలను మట్టిలోని నీటి నుంచే గ్రహిస్తాయి..ఇక్కడ మట్టి మినరల్ న్యూట్రియెంట్ రిజర్వాయిర్‌గా పనిచేస్తుంది. అంతే తప్ప మట్టి అవసరం మొక్కలకు ప్రత్యేకంగా ఉండదు. అంటే, నీటిలో కలిసిన లవణాలే మొక్కకి నేలలా ఉపయోగపడుతున్నాయి. ఇక్కడే సైంటిస్టులకు ఇంకో ఐడియా వచ్చింది. నీళ్లలో ఆర్టిఫీషియల్‌గా లవణాలను కలిపి మొక్కలను పెంచగలమా అని..! ఈ ప్రయోగం సక్సెస్ అయింది.. దీని ఆధారంగనే హైడ్రోపానిక్స్, ఆక్వా పానిక్స్ లాంటి పద్ధతులు డెవలప్ అయ్యాయి.
అర్బనైజేషన్ ఇప్పటికే ఎన్నో పంట పొలాలకు ఎసరు పెట్టింది. పెరుగుతున్న జనాభా తిండి గింజల కొరతను సృష్టించింది. భూమిని గజం లెక్కన ముక్కలు చేసి అమ్ముకునే రియల్ దందా పొలాలను మింగేసింది. ఇంకో పక్క ఆహార పంటలకు డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతోంది. కుదించుకుపోతున్న పొలాల విస్తీర్ణం, అడుగంటిపోతున్న భూసారాన్ని దృష్టిలో ఉంచుకుని చేసిన పరిశోధనలే ఈ హైడ్రో ఫోనిక్స్. ఇప్పటికే చాలామంది పాలకూర, తీగ బచ్చలి, చిక్కుడు, ఆనపకాయ, టమాటా, ఆలుగడ్డ మొక్కలతో పాటు, నిమ్మ, సీతాఫలం, ద్రాక్ష లాంటి పండ్ల చెట్లను పెంచుతున్నారు. పశుగ్రాసం పెంచడానికి కూడా ఈ విధానాలను వాడుతున్నరు. అంతేకాక ఈ విధానంలో సంప్రదాయ పద్ధతిలో అయ్యే ఖర్చుకంటే తక్కువ ఖర్చుతో, కాలం కాని కాలంలో కూడా పండించొచ్చు. 40 రోజులకు వచ్చే పంటను 16 రోజుల్లో పండించొచ్చు. ఒకే జాతి మొక్కలను అనేక సార్లు పెంచే అవకాశం కూడా ఉంది. మొక్కలకు గాలి నీరు పోషకాలు సమతుల్యంగా అందించొచ్చు. తక్కువ ప్రదేశంలో ఎక్కువ ఉత్పత్తులు పొందవచ్చు. చీడపీడల బెడద లేదు. పురుగుమందుల పిచికారీ అంతకన్నా లేదు. జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ చేయవచ్చు! ఈ విధంగా మట్టి అవసరం లేకుండా ఇంటి పట్టున కుండీల్లో, ప్లాస్టిక్ కంటెయినర్లలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల చెట్లను పెంచుకోగలిగితే అది పెద్ద ఎఛీవ్‌మెంటే అవుతుంది. అంత కంటే మానవాళికి కావలసింది ఏముంటుంది!
Read Also: ఉద్యోగికి పొరపాటున 300 రెట్లు ఎక్కువ జీతం చెల్లించిన కంపెనీ, ఊహించని తీర్పు ఇచ్చిన కోర్టు!