AI Secret Language| కృత్రిమ మేధస్సు (AI) ‘గాడ్‌ఫాదర్’ (సృష్టికర్త) గా పిలవబడే జెఫ్రీ హింటన్.. AI టెక్నాలజీ గురించి మానవులకు ప్రమాదం పొంచి ఉందని తీవ్రంగా హెచ్చరించారు. ఈ సాంకేతికత మానవుల నియంత్రణకు మించిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం AI ఇంగ్లీష్ భాషలో ఆలోచిస్తుంది, దీని వల్ల డెవలపర్లు దాని ఆలోచనలను అర్థం చేసుకోగలుగుతున్నారు. కానీ, భవిష్యత్తులో AI తన సొంత భాషను అభివృద్ధి చేసుకుంటే, మానవులు దాని ఆలోచనలను గుర్తించలేరని హింటన్ హెచ్చరించారు.
గత నెలలో విడుదలైన “వన్ డిసిషన్” పాడ్‌కాస్ట్‌లో హింటన్ మాట్లాడుతూ, “AI యంత్రాలు తమ సొంత భాషను అభివృద్ధి చేసుకుంటే, అది చాలా భయంకరంగా మారుతుంది. అవి తమ ఆలోచనల కోసం కొత్త భాషను సృష్టించుకోవచ్చు, అప్పుడు మనకు వాటి ఆలోచనలు ఏమిటో తెలియదు,” అని అన్నారు. AI ఇప్పటికే కొన్ని భయంకరమైన ఆలోచనలను చూపించిందని, మానవులు అర్థం చేసుకోలేని విధంగా ఆలోచించే సామర్థ్యం దానికి రావచ్చని ఆయన హెచ్చరించారు.
హింటన్ మెషిన్ లెర్నింగ్ రంగంలో పునాదులు వేసిన వ్యక్తి. అయితే, AI టెక్నాలజీ భవిష్యత్తు అభివృద్ధి గురించి ఆందోళన చెందిన హింటన్, గూగుల్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ సమస్య గురించి స్వేచ్ఛగా మాట్లాడేందుకు నిర్ణయం తీసుకున్నారు. “ఈ టెక్నాలజీ పారిశ్రామిక విప్లవంతో సమానంగా ఉంటుంది. కానీ, ఇది మానవుల శారీరక శక్తిని మించపోవడమే కాకుండా.. మానవుల మేధస్సును మించే సామర్థ్యం కలిగి ఉంటుంది. మనకంటే తెలివైన వాటితో జీవించడం ఎలా ఉంటుందో మనకు ఎలాంటి అనుభవం లేదు,” అని ఆయన అన్నారు.
AI టెక్నాలజీపై ప్రభుత్వం నియంత్రణలు విధించే అవసరమని హింటన్ గట్టిగా వాదిస్తున్నారు. ఈ టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది, ఇది మానవుల నియంత్రణకు మించిపోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. AI చాట్‌బాట్‌లు తప్పుడు ఆలోచనలను (హాలుసినేషన్స్) సృష్టించిన సందర్భాలు ఈ ఆందోళనను మరింత పెంచాయి.
ఉదాహరణకు.. ఓపెన్‌ఏఐ సంస్థ ఏప్రిల్‌లో తమ o3, o4-మినీ AI మోడళ్లను పరీక్షించినప్పుడు, ఈ మోడళ్లు ఊహించని విధంగా తప్పుడు సమాచారాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేశాయి. ఈ సమస్య ఎందుకు జరుగుతోందో తమకు తెలియదని ఓపెన్‌ఏఐ తెలిపింది. ఈ హాలుసినేషన్స్ సమస్యను అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరమని వారు ఒక సాంకేతిక నివేదికలో పేర్కొన్నారు.
ఈ వేగవంతమైన AI అభివృద్ధి, ఊహించని ప్రవర్తనలు మానవాళికి పెను సవాలుగా మారవచ్చని హింటన్ హెచ్చరిస్తున్నారు. ఈ సాంకేతికతను నియంత్రించడానికి సరైన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో మానవులు AI నియంత్రణను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.