Ustaad Bhagat Singh:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లోకి వెళ్ళకముందు ఒప్పుకున్న మూడు సినిమాలను పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యి విడుదలైంది. అలాగే ఓజీ సినిమా(OG Movie)షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్టు ఈ మధ్యనే చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక్కటే..ఈ సినిమా కూడా పూర్తి చేసి పవన్ ఇక రాజకీయాలకే పరిమితం అవుతారనే ప్రచారం నడుస్తుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagath singh) నిర్మాతల నిర్వాకంపై తెలుగు ఫిలిం ఫెడరేషన్ యూనియన్ సభ్యులు మండి పడుతున్నారు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ సెట్ లో ఏం జరిగింది.. ? యూనియన్ సభ్యులు నిర్మాతలపై ఎందుకు మండి పడుతున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..
ఆగస్టు 4 నుండి షూటింగ్స్ బంద్..
తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో పని చేసే కార్మికులకు 30% వేతనాలు పెంచాల్సిందే అంటూ తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్(Telugu Film Employees Federation) ఆగస్టు 4 నుండి షూటింగ్స్ అన్ని బంద్ అంటూ తెలిపింది. తమ వేతనాలు 30% పెంచితేనే షూటింగ్ లకి వస్తామని,లేకపోతే సినిమా షూటింగ్ లకి రాము అంటూ డిమాండ్ చేశారు.. అయితే నిర్మాతల మండలి వీరి డిమాండ్లను పట్టించుకోకుండా ఇప్పటికే ఎక్కువ వేతనాలు ఇస్తున్నాం. ఇంకా ఎక్కువ కావాలంటే ఇవ్వలేం అంటూ తేల్చి చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ దశలో ఉన్న చాలా సినిమాలు ఆగిపోయాయి.
యూనియన్ ఆగ్రహానికి గురైన ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతల నిర్వాకం..
అయితే పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్షన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి డేట్స్ ఇచ్చారు. దాంతో ఇచ్చిన డేట్స్ నే వినియోగించుకోవాలని.. ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు టాలీవుడ్ లో ఉండే కార్మికులు షూటింగ్లకు రావడం లేదు కాబట్టి ముంబై, చెన్నై (Chennai) వంటి ప్రాంతాల నుండి వర్కర్లను తెప్పించారట. అయితే ఈ విషయం తెలుసుకున్న యూనియన్ ప్రతినిధులు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ సెట్ కి వెళ్లి సినిమా షూట్ ఆపడానికి ప్రయత్నించారట.దాంతో ఇరువర్గాల మధ్య వాదనలు తలెత్తినట్లు తెలుస్తోంది.
ఇతర ప్రాంతాల నుండి కార్మికులను తీసుకురావడంపై మండిపాటు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు షూటింగ్ ని అడ్డుకొని.. షూటింగ్ చేయడానికి వీలు లేదు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ సెట్లో గడబిడ వాతావరణం నెలకొంది. మరి దీనిపై చిత్ర నిర్మాతలు ఏ విధంగా సంజాయిషీ ఇస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోని కార్మికులు షూటింగ్ కి రాలేదని ఇతర ప్రాంతాల నుండి కార్మికులను తీసుకువచ్చి పనిచేయించుకోవడం ఏమాత్రం బాగోలేదని ఈ విషయం తెలిసిన వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. అటు ఫిలిం ఛాంబర్ వద్ద కూడా హై టెన్షన్ మొదలయ్యింది. కార్మికులు సమ్మెకు దిగడంతో వాతావరణం వేడెక్కింది అని చెప్పవచ్చు.