AI Tools Attacking Privacy| స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, చాట్ జిపిటి, మైక్రోసాఫ్ట్ కోపైలట్ లాంటి ఏఐ అసిస్టెంట్లు, ఇతర కృత్రిమ మేధ సాధనాలు మన జీవితాన్ని సులభతరం చేస్తాయి. కానీ, ఇవి మన వ్యక్తిగత డేటాను సేకరించి ప్రైవెసీ ఒక సమస్యగా మారుతున్నాయి. వెస్ట్ వర్జీనియా యూనివర్శిటీలో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ రమెజాన్.. ఏఐ టూల్స్ యూజర్ల డేటాను ఎలా సేకరిస్తాయో? దానిని ఎలా రక్షించుకోవాలో వివరించారు. జనరేటివ్ AI (ChatGPT, Google Gemini) కొత్త కంటెంట్‌ను సృష్టించడానికి భారీగా ఇతరుల డేటాను ఉపయోగిస్తుంది. ప్రిడిక్టివ్ AI మన సెర్చింగ్ హిస్టరీ, ఏఐ చేత చేయించే గత టాస్క్ ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తుంది. ఉదాహరణకు, మీరు దేని గురించి ఎక్కువ సెర్చ్ చేస్తారు, ఎలాంటి సినిమాలపై మీ ఆసక్తి ఉంది అనేది ఏఐ సులభంగా అంచనా వేస్తుంది.
డేటా సేకరణ ఏఐ ఎలా చేస్తోంది?
ప్రొఫెసర్ రమెజాన్ ప్రకారం.. చాట్ జిపిటి వంటి జనరేటివ్ AI మీరు టైప్ చేసే ప్రతి ప్రశ్న, సమాధానం, ప్రాంప్ట్‌ను సేకరిస్తుంది. ఈ డేటా AI మోడల్‌ను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. OpenAI వంటి కంపెనీలు డేటాను యూజర్ గుర్తింపు లేకుండానే నిల్వ చేస్తామని చెప్పినప్పటికీ, దానిని తిరిగి గుర్తించే ప్రమాదం ఉంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్) మీ పోస్ట్‌లు, లైక్‌లు, కామెంట్‌లు, వీడియోలు, వాటిని చూసే సమయాన్ని సేకరించి డిజిటల్ ప్రొఫైల్‌ను సృష్టిస్తాయి. స్మార్ట్‌వాచ్‌లు, హోమ్ స్పీకర్లు బయోమెట్రిక్ సెన్సార్లు, వాయిస్ రికగ్నిషన్, లొకేషన్ ట్రాకింగ్ ద్వారా డేటాను సేకరిస్తాయి.
డేటా ప్రైవెసీ సమస్యలు
స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్లు ఆరోగ్య డేటా, కదలికలను ట్రాక్ చేస్తాయి. వాయిస్ రికార్డింగ్‌లు క్లౌడ్‌లో నిల్వ చేయబడతాయి. ఇవి అల్గారిథమ్‌లను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ఇది ప్రైవెసీ చట్టాలకు ఓ సవాలుగా ఉంది. కంపెనీలు సంక్లిష్టమైన గోప్యత విధానాలను ఉపయోగిస్తాయి, వీటిని అర్థం చేసుకోవడం కష్టం. ఒక అధ్యయనం ప్రకారం.. సాధారణంగా 29-32 నిమిషాలు పట్టే టర్మ్స్ ఆఫ్ సర్వీస్‌ను చదవడానికి ప్రజలు కేవలం 73 సెకన్లు ఖర్చు చేస్తారు. విశ్వసనీయ కంపెనీల వద్ద ఏఐ డేటా ఉన్నప్పటికీ.. ఈ డేటా ఇతరులకు విక్రయించబడవచ్చు. తద్వారా సైబర్ దాడులకు దుర్వినియోగం కావొచ్చు. రమెజాన్ ప్రకారం.. సైబర్‌క్రిమినల్స్ లేదా రాష్ట్ర-ప్రాయోజిత హ్యాకర్లు ఈ డేటాను దుర్వినియోగం చేయవచ్చు.
AI టూల్స్‌ను ఉపయోగించే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు
AI సాధనాలు పనిని సులభతరం చేస్తాయి. కానీ వీటిని ఉపయోగించే సమయంలో జాగ్రత్త అవసరం. రమెజాన్ సలహా ప్రకారం.. AI ప్లాట్‌ఫామ్‌లలో వ్యక్తిగత సమాచారం (పేరు, పుట్టిన తేదీ, చిరునామా) షేర్ చేయకూడదు. వృత్తిపరమైన సమాచారం లేదా రహస్య డేటాను ఏ మాత్రం ఉపయోగించకూడదు. మీరు టైప్ చేసిన డేటా పబ్లిక్ అయినా సమస్య లేనిదిగా ఉండాలి. స్మార్ట్ డివైస్‌లు ఆన్‌లో ఉన్నప్పుడు.. స్లీపింగ్ మోడ్‌లో కూడా డేటా సేకరిస్తాయి. గోప్యత కోసం స్మార్ట్ హోమ్ డివైస్‌లను ఆఫ్ చేయండి లేదా ప్లగ్ తీసేయండి. డివైస్‌ల టర్మ్స్ ఆఫ్ సర్వీస్, డేటా సేకరణ విధానాలను చదవి ముందుగానే తెలుసుకోండి. మీరు డేటా యాక్సెస్ ఇచ్చే ముందు పూర్తిస్థాయిలో దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Also Read: ఈ యాప్‌లను వెంటనే ఫోన్ నుంచి తొలగించండి.. గూగుల్ ప్లే స్టోర్ హెచ్చరిక
AI సాధనాలు మన జీవితాన్ని మెరుగుపరుస్తాయి, కానీ గోప్యత ప్రమాదాలను తెస్తాయి. డేటా సేకరణ, నిల్వ, షేరింగ్ గురించి పారదర్శకత లేకపోవడం పెద్ద సమస్య. AI సవాళ్లను పరిష్కరించే దశలోనే ఇంకా చట్టాలు నెమ్మదిగా అప్డేట్ అవుతున్నాయి. అందుకే, AI డివైస్‌లను ఉపయోగిస్తున్నప్పుడు అవగాహనతో జాగ్రత్త వహించాలి.