Delivery box data theft: ప్రతి పండగ సీజన్‌లో లేదా ప్రత్యేక సేల్స్‌లో మనం అనేక వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తుంటాం. డెలివరీ బాయ్ వచ్చి మనకు పార్శిల్ ఇవ్వగానే, ఆ ఉత్సాహంలో బాక్స్‌ను ఓపెన్ చేసి లోపలి ఐటెమ్‌ను తీసుకుంటాం. ఆ తర్వాత ఆ ఖాళీ బాక్స్ లేదా ప్లాస్టిక్ కవర్‌ను చెత్తబుట్టలో లేదా ఇంటి బయట పారేస్తుంటాం. కానీ.. ఆ బాక్స్ పై అట్టకు అంటించి ఉండే షిప్పింగ్ లేబుల్ పై మీ పూర్తి పేరు, మొబైల్ నంబర్, ఇంటి అడ్రస్ , పిన్ కోడ్ వంటి ముఖ్యమైన వివరాలు స్పష్టంగా ప్రింట్ అయి ఉంటాయి. అయితే మోసగాళ్లు దీనినే తమ ఆయుధంగా మలుచుకుంటున్నారు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది పార్శిల్ బాక్సులను ముక్కలు చేయకుండా లేదా ఆ స్టిక్కర్లను తొలగించకుండానే చెత్తలో పడేస్తారు. చెత్త ఏరుకునే వారు లేదా సైబర్ నేరగాళ్లు ఇలాంటి బాక్సుల కోసం గమనిస్తూ ఉంటారు. మీ అడ్రస్, ఫోన్ నంబర్ సేకరించిన తర్వాత వారు రకరకాల మోసాలకు పాల్పడతారు.
ఫేక్ కొరియర్ కాల్స్: మీ పేరు చెప్పి, మీ పేరు మీద ఒక పార్శిల్ వచ్చిందని, కస్టమ్స్ డ్యూటీ లేదా డెలివరీ ఛార్జీల పేరుతో.. ఆన్‌లైన్‌లో డబ్బులు కట్టాలని లింక్స్ పంపుతారు.
ఫైబర్ లేదా లోన్ ఫ్రాడ్స్: మీ పర్సనల్ వివరాలను ఉపయోగించి మీ పేరు మీద నకిలీ లోన్లు లేదా క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేసే ప్రమాదం ఉంది.
సేఫ్టీ: మీరు ఏ సమయంలో ఇంట్లో ఉంటున్నారు, మీ చిరునామా ఏంటి అనే పూర్తి సమాచారం దుండగుల చేతికి చిక్కితే అది మీ కుటుంబ భద్రతకే ముప్పుగా మారుతుంది.
ఈ రకమైన డేటా చోరీకి ప్రత్యక్షంగా డబ్బులు ఖర్చు కాకపోయినా, మోసగాళ్ల ఉచ్చులో పడితే వేల రూపాయలు కోల్పోవాల్సి వస్తుంది. ఉదాహరణకు, ఒక ఫేక్ ఫిషింగ్ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీ బ్యాంకు అకౌంట్ లోని మొత్తం డబ్బును క్షణాల్లో కాజేసే అవకాశం ఉంది. కాబట్టి నిర్లక్ష్యం మన కొంప ముంచవచ్చు.
Also Read: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆడియోను.. ఫోన్ రింగ్‌టోన్‌గా సెట్ చేయండిలా!
1.స్టిక్కర్లను తొలగించడం లేదా చింపడం: డెలివరీ బాక్స్ లేదా కవర్ పైన ఉన్న షిప్పింగ్ లేబుల్‌ను పూర్తిగా చింపివేయాలి లేదా చిన్న ముక్కలుగా చేసి పడేయాలి.
2.మార్కింగ్ చేయడం: మీ పేరు , ఫోన్ నంబర్ స్పష్టంగా కనిపించే చోట మార్కర్ తో లేదా ఇంక్‌తో ఆ వివరాలను కనిపించకుండా చేయాలి.
3.బాక్సులు: కార్ట్‌బోర్డ్ బాక్సులను అలాగే పడేయకుండా.. చిన్న ముక్కలుగా కట్ చేసి చెత్త డబ్బాలో వేయడం బెస్ట్.
4. డిజిటల్ అవేర్‌నెస్: సోషల్ మీడియాలో .. మీ పార్శిల్స్ ఫోటోలను అడ్రస్‌తో సహా పోస్ట్ చేయెద్దు.
ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఆనందం ఎంత ముఖ్యమూ.. మన పర్సనల్ డేటా కూడా అంతే ముఖ్యం. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే.. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా సురక్షితంగా ఉండొచ్చు.