iPhone 20 Pro Leaks: ఐఫోన్‌కు 20 ఏళ్లు పూర్తవుతున్న వేళ యాపిల్ ఏదైనా స్పెషల్ ప్లాన్ చేస్తోందా? వచ్చే ఏడాది రానున్న iPhone 20 Pro సిరీస్‌పై ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈసారి ఫోన్ల డిజైన్‌లో యాపిల్ భారీ మార్పులు చేయబోతుందనే వార్తలు ఇప్పటికే వచ్చాయి. ముఖ్యంగా ఇప్పటివరకు ఐఫోన్లలో కనిపిస్తున్న డైనమిక్ ఐలాండ్‌కు స్వస్తి పలికి, ఫ్రంట్ కెమెరాను స్క్రీన్ కిందకు తీసుకెళ్లనుందని ప్రచారం జరిగింది. కానీ తాజాగా వచ్చిన ఓ లీక్ ఈ అంచనాలను తలకిందులు చేస్తోంది.
iPhone 20 Pro Maxలో కూడా డైనమిక్ ఐలాండ్ కొనసాగుతుందని ప్రముఖ చైనీస్ లీకర్ Digital Chat Station వెల్లడించినట్లు సమాచారం. దీంతో అసలు కొత్త ఐఫోన్‌లో డైనమిక్ ఐలాండ్ ఉంటుందా? ఉంటే దాని సైజు ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి మొదలైంది. అయితే, ఈ వివరాలపై యాపిల్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
గతంలో వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం.. యాపిల్ తమ రాబోయే ప్రో మోడళ్లలో ఫ్రంట్ కెమెరాను డిస్‌ప్లే కింద అమర్చాలని భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అలా జరిగితే స్క్రీన్‌పై ప్రత్యేకమైన కటౌట్ అవసరం ఉండదని టెక్ అభిమానులు అనుకున్నారు. కానీ తాజా లీక్ ప్రకారం, iPhone 20 Pro Maxలో డైనమిక్ ఐలాండ్ ఉండే అవకాశం ఉంది. అంటే కంపెనీ ఈ ఫీచర్‌ను పూర్తిగా తొలగించకపోవచ్చని తెలుస్తోంది.
Also Read: వాట్సప్‌లో ఏఐతో పనులు మరింత ఈజీ.. ప్రైవసీ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటున్న సీఈఓ!
డైనమిక్ ఐలాండ్ ఉంటుందని వార్తలు వచ్చినా.. దాని పరిమాణం ఎంత ఉంటుందనే విషయం మాత్రం తెలియలేదు. iPhone 20 Proలో ఇది చిన్నగా మారుతుందా, లేక ఇప్పుడున్న పరిమాణంలోనే కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న అంచనాల ప్రకారం.. iPhone 18 Proలో ఉండే డైనమిక్ ఐలాండ్ సైజునే కొత్త మోడళ్లలోనూ యాపిల్ కొనసాగించవచ్చని చెబుతున్నారు. అయితే, దీనిపై నమ్మదగిన పూర్తి సమాచారం ఇంకా బయటకు రాలేదు.
ఈ ఫోన్‌లో మరో ముఖ్యమైన మార్పు క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే కావచ్చని లీకర్ పేర్కొన్నాడు. అంటే స్క్రీన్ నాలుగు వైపులా అంచుల దగ్గర వంపుగా ఉంటుంది. దీనివల్ల ఫోన్ ముందు భాగం మరింత ఆకర్షణీయంగా, బెజెల్స్ లేనట్టుగా కనిపించే అవకాశం ఉంది. అయితే, ఈ డిజైన్ రోజువారీ వాడకంలో ఎలా ఉంటుందో చూడాలి.
iPhone 20 Pro సిరీస్‌కు ఇంకా సమయం ఉండటంతో.. డిజైన్‌కు సంబంధించిన వివరాలు మారే అవకాశం ఉంది. కంపెనీ సాధారణంగా తమ కొత్త ఫోన్ల గురించి ముందుగానే పూర్తి వివరాలు వెల్లడించదు. అందుకే డైనమిక్ ఐలాండ్, డిస్‌ప్లే వంపులు వంటి అంశాలపై వచ్చే ప్రతి లీక్‌ను ఖరారైన సమాచారంగా భావించకూడదు. ఇతర ఫీచర్ల గురించి మాత్రం ప్రస్తుత లీక్‌లో వివరాలు లేవు. మిగతా ఫీచర్లపై సమాచారం లేదు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఈ ఫోన్లలో ఉండే మార్పులపై స్పష్టత వస్తుంది.
Also Read: మీ ఫోన్ పోయిందా? డేటా, బ్యాంక్ ఖాతాలను కాపాడుకోవాలంటే వెంటనే ఈ 6 పనులు చేయండి!