Apple iPhone Air 2: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ బ్రాండ్ నుంచి కొత్త ఫోన్ వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియుల్లో ఆసక్తి అమాంతం పెరుగుతుంది. ఐఫోన్ కొనాలనే కోరికతో పాటు, యాపిల్ తీసుకొచ్చే కొత్త డిజైన్లు, ఫీచర్ల కోసం ఎదురుచూసే వాళ్లూ ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారిని ఆకర్షించేందుకు మరో కొత్త ఫోన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అత్యంత సన్నని డిజైన్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న iPhone Air సిరీస్‌లో రెండో తరం మోడల్‌ను తీసుకొచ్చేందుకు యాపిల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది స్ప్రింగ్ సీజన్‌లోనే ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. మరి ఈసారి iPhone Air 2లో ఎలాంటి కొత్త ఫీచర్లు ఉండబోతున్నాయి? డిజైన్‌తో పాటు కెమెరా, బ్యాటరీ విషయంలోనూ యాపిల్ కీలక మార్పులు చేయనుందా? వంటి వివరాలు తెలుసుకుందాం.
గతంలో సెప్టెంబర్ ఈవెంట్‌లో మాత్రమే ఐఫోన్లు వచ్చేవి. కానీ యాపిల్ ఇప్పుడు తమ ప్లాన్‌ను మార్చుకుంది. ప్రో మోడల్స్‌ను ఒక సమయంలో, మిగతా బేస్ మోడల్స్‌ను మరో సమయంలో లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలోనే iPhone Air 2ను వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ప్రత్యేకంగా విడుదల చేసే అవకాశం ఉంది. మార్కెట్లో దీని కోసం చాలామంది టెక్ ప్రియులు ఎదురుచూస్తున్నారు.
Also Read: మేడ్ ఇన్ ఇండియా మొబైల్స్ ఈజ్ బ్యాక్.. కార్బన్ నుంచి రాబోతున్న ఆ రెండు ఫోన్లు ఇవే!
ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నా.. ధర గురించే అందరికీ ముందుగా డౌట్ వస్తుంది. ఈ ఫోన్ సుమారు 256GB, 512GB, 1TB వేరియంట్లలో వచ్చే ఛాన్స్ ఉంది. భారతదేశంలో దీని బేస్ మోడల్ ధర సుమారు రూ.1.20 లక్షల నుంచి ప్రారంభం కావొచ్చని అంచనా. ఇక 512GB వేరియంట్ రూ.1.40 లక్షలు, అలాగే 1TB మోడల్ రూ.1.60 లక్షల వరకు ఉండొచ్చని టాక్. అయితే విడిభాగాల ధరలు పెరగడం వల్ల యాపిల్ ధరల్లో కొంచెం మార్పులు చేసే అవకాశం కూడా లేకపోలేదు.
మొదటి వెర్షన్‌లో సింగిల్ కెమెరా ఉండటంతో చాలా విమర్శలు వచ్చాయి. దీన్ని సరిచేసేలా ఈసారి వెనుకవైపు రెండు కెమెరాలు ఇచ్చే అవకాశం ఉంది. దీని మందం కేవలం 5.2 మిమీ మాత్రమే ఉండబోతోంది. సన్నగా ఉన్నప్పటికీ టైటానియం ఫ్రేమ్‌తో చాలా గట్టిగా ఉండేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. అలాగే పెద్ద బ్యాటరీ, శక్తివంతమైన కొత్త ప్రాసెసర్‌ను ఇందులో అమర్చనున్నారు.
ఈ ఫోన్‌లో లేటెస్ట్ ఐఓఎస్ 27 సాఫ్ట్‌వేర్‌ను అందించనున్నారు. దీని ద్వారా పూర్తిగా అప్డేట్ అయిన కొత్త Siri ఏఐ ఫీచర్‌ను వాడుకోవచ్చు. ఇది మనం చెప్పే మాటలను సులభంగా అర్థం చేసుకుని పనులు చేస్తుంది. మొత్తానికి సన్నని బాడీతో, అదిరిపోయే ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త ఐఫోన్ యాపిల్ లవర్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.
Also Read: 40 గంటల బ్యాటరీ బ్యాకప్.. ఫ్రీ గానా సబ్‌స్క్రిప్షన్‌తో Noise Buds R1 Gaana Edition లాంచ్!