BSNL Rural Entry Plan: భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ టెలికాం సంస్థ BSNL ఒక అద్భుతమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది. ‘రూరల్ ఎంట్రీ ప్లాన్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ సరికొత్త ఆఫర్ ద్వారా గ్రామాల్లోని ప్రజలకు చాలా తక్కువ ధరలోనే హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం రూ.259కే అన్‌లిమిటెడ్ డేటాతో పాటు మరెన్నో అదనపు ప్రయోజనాలను ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు.
గ్రామాల్లోనూ, చిన్న పట్టణాల్లోనూ ఉండే కుటుంబాలకు చౌకగా, నమ్మకమైన ఇంటర్నెట్ అందించడమే పరమావధిగా BSNL ఈ అడుగు వేసింది. ప్రభుత్వానికి చెందిన భారత్‌నెట్ (డిజిటల్ భారత్ నిధి) సహకారంతో ఈ సేవలను విస్తరిస్తున్నారు. నగరాలతో పోలిస్తే పల్లెటూళ్లలో ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యాలు సరిగ్గా లేని లోటును భర్తీ చేయడానికి, డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఈ రూరల్ ఎంట్రీ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
Also Read: ఇకపై రాత్రిపూట కూడా సూర్యకాంతి.. అమెరికా కొత్త స్పేస్ ప్రాజెక్ట్‌పై శాస్త్రవేత్తల ఆందోళన ఎందుకు?
ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 25 Mbps వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. దీంతో ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థులకు, వర్క్‌ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు, వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో నెలకు ఏకంగా 700GB వరకు పూర్తి వేగంతో డేటా వాడుకోవచ్చు. ఒకవేళ ఆ లిమిట్ దాటినా కూడా ఇంటర్నెట్ ఆగిపోదు, కాకపోతే స్పీడ్ 2 Mbpsకి తగ్గుతుంది. దీంతో పాటు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా అపరిమిత వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అసలు విశేషం ఏంటంటే.. కొత్తగా కనెక్షన్ తీసుకునే వారి కోసం ఎలాంటి ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు లేకుండా ఉచితంగా మోడెమ్‌ను కూడా అందిస్తున్నారు.
కేవలం ఇంటర్నెట్, కాల్స్ మాత్రమే కాకుండా వినోదానికి కూడా BSNL పెద్ద పీట వేసింది. ఈ ప్లాన్ తీసుకున్న వారికి బీఎస్ఎన్ఎల్‌కు చెందిన Waves ఓటీటీ ప్లాట్‌ఫారమ్ యాక్సెస్ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు సినిమాలు, టీవీ షోలు, ఇతర ఆసక్తికరమైన కంటెంట్‌ను తమ కుటుంబంతో కలిసి చూడవచ్చు. ఈ ప్లాన్ కావాలనుకునే వారు BSNL అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా గానీ, కస్టమర్ కేర్‌ను సంప్రదించి గానీ సులభంగా బుక్ చేసుకోవచ్చు.
మరోవైపు అత్యవసర పరిస్థితుల కోసం BSNL ఒక శాటిలైట్ ఫోన్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించారు. సాధారణ టెలికాం సిగ్నల్స్ అస్సలు దొరకని లోతైన గనులు, దట్టమైన అడవులు, సముద్ర ప్రయాణాలు, అలాగే కొండ ప్రాంతాల్లో ట్రెకింగ్ చేసే వారికి ఈ ఫోన్ ఒక సంజీవనిలా పనిచేస్తుంది. అత్యంత దుర్ఘటమైన ప్రాంతాల్లో కమ్యూనికేషన్ కోసం డిజైన్ చేసినందున ఇది ప్రీమియం శ్రేణిలో అందుబాటులో ఉంది.
Also Read: బ్లాక్‌బస్టర్ డీల్.. Samsung Galaxy S26 Ultraపై ఎగిరి గంతేసే భారీ డిస్కౌంట్.. వెంటనే కొనేయండి!