CE Mark: మనం రోజూ వాడే మొబైల్ ఫోన్లు, టీవీలు, ఛార్జర్ల వెనుక భాగంలో ఇంగ్లీషులో ‘CE’ అని రాసి ఉండటాన్ని అందరూ గమనించే ఉంటారు. అయితే చాలా మంది దీనిని ఒక సాధారణ బ్రాండ్ లోగోగానో, కేవలం ఒక డిజైన్ గుర్తుగానో భావిస్తుంటారు. కానీ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ రెండు అక్షరాలకు అత్యంత కీలకమైన ప్రాధాన్యత ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఈ ‘CE’ గుర్తు వెనుక ఉన్న అసలైన కథేంటో ఈ కథనంలో చూద్దాం.
వాస్తవానికి ‘CE’ అనేది ఫ్రెంచ్ పదం. యూరోపియన్ కన్ఫర్మిటీ (Conformité Européenne)గా పిలుస్తారు. ‘యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయబడింది’ అని దీనికి అర్థం. ఐరోపా సమాఖ్య (European Union) పరిధిలో అమ్ముడయ్యే ఎలక్ట్రానిక్ వస్తువులకు ఈ గుర్తు ఉండటం చట్టబద్ధంగా తప్పనిసరి.
చాలా మంది ఈ గుర్తు ఉంటే అది అత్యుత్తమ నాణ్యత గల ఫోన్, టీవీ అని తప్పుగా భావిస్తుంటారు. కానీ ‘CE’ అనేది నాణ్యతకు ఇచ్చే సర్టిఫికేట్ కాదు. ఇది కేవలం సదరు పరికరం వినియోగదారుడి ఆరోగ్యానికి, భద్రతకు ఎటువంటి హాని కలిగించదని, పర్యావరణ నియమాలను పాటిస్తూ తయారు చేయబడిందని తయారీదారు ఇచ్చే హామీ మాత్రమే. ఉదాహరణకు ఒక ఛార్జర్ పేలిపోకుండా ఉండేలా తగిన రక్షణ వ్యవస్థలు ఉన్నాయని ఈ గుర్తు నిర్ధారిస్తుంది.
Also Read: థియేటర్‌కు వెళ్లక్కర్లేదు.. IMAX స్క్రీన్ మజా.. ఈ బెస్ట్ ప్రొజెక్టర్లు మీకోసమే!
అయితే ప్రస్తుతం మార్కెట్లో నకిలీ ‘సీఈ’ గుర్తులు సైతం దర్శనమిస్తున్నాయి. చైనాకు చెందిన కొందరు వ్యాపారులు.. ‘China Export’ (చైనా ఎక్స్‌పోర్ట్) అని అర్థం వచ్చేలా ‘CE’ అనే అక్షరాలను ముద్రిస్తున్నారు. అసలైన యూరోపియన్ ‘CE’ మార్కులో ‘C’, ‘E’ అక్షరాల మధ్య తగినంత గ్యాప్ ఉంటుంది. కానీ చైనా ఎక్స్‌పోర్ట్ గుర్తులో ఈ రెండు అక్షరాలు ఒకదానికొకటి అతుక్కుపోయినట్లు ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ధరనే కాకుండా, వాటి భద్రతా ప్రమాణాలను సూచించే ఇలాంటి గుర్తులను గమనించడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: ఇంట్లోని ఏసీ సోలార్‌పై నడవాలంటే.. ఎన్ని ప్యానెళ్లు అవసరం? ఇదే అసలైన లెక్క!