Lunar Environment: గత కొన్నేళ్లుగా అంతరిక్షంలోకి వెళ్తున్న ఆస్ట్రానాట్స్ సంఖ్య పెరుగుతూ వస్తోంది. టెక్నాలజీలు అడ్వాన్స్ అవ్వడం వల్ల అంతరిక్షంలోకి వెళ్తున్న ఆస్ట్రానాట్స్.. ఏ ఇబ్బందులు లేకుండా అక్కడ కొన్నిరోజుల పాటు ఉండగలుగుతున్నారు. అయితే అసలు ఆస్ట్రానాట్స్ స్పేస్‌కు వెళ్లడానికి మానసికంగా, శారీరికంగా ఉండగలుగుతున్నారా లేదా అన్న విషయాలపై కూడా పూర్తిస్థాయిలో ఫోకస్ చేయాలని చైనా నిర్ణయించుకుంది. దానికోసమే ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించింది.
ప్రస్తుతం చైనా ఫోకస్ అంత చంద్రుడిపైనే ఉంది. అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, కట్టడాలు జరిపించాలని.. ఇలా ఎన్నో ప్లాన్లతో చైనా సిద్ధంగా ఉంది. అందుకే ఇతర దేశాలకంటే ముందుగా చంద్రుడిపై అనేక కొత్త ప్రయోగాలు చేయడానికి సైలెంట్‌గా సన్నాహాలు చేసేస్తోంది. అంతే కాకుండా చంద్రుడిపై ఎక్కువకాలం ఉండడానికి ఆస్ట్రానాట్స్‌ను ఇప్పటినుండే సిద్ధం చేస్తోంది. కేవలం ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా లూనార్ ప్రయోగాలు చేయడానికి ఉపయోగపడేలా ఒక కొత్త ఛాంబర్‌ను తయారు చేసింది.
చంద్రుడి నేలపై ఉండే పరిస్థితలు ఆధారంగా చైనా శాస్త్రవేత్తలు కలిసి ఒక ఛాంబర్‌ను క్రియేట్ చేశారు. స్పెషల్‌గా డిజైన్ చేసిన ఈ వాక్యూమ్ ఛాంబర్‌లో ఒక ఎలక్ట్రానిక్ గన్, డ్యుటేరియం లైట్స్, వైబ్రేటింగ్ స్క్రీన్‌తో పాటు పలు ఇతర పరికరాలు కూడా ఉంటాయి. ఇవన్నీ అచ్చం చంద్రుడిపై కాలు పెట్టిన ఫీలింగ్‌నే అందిస్తాయి. ఈ ఛాంబర్‌లో ఆస్ట్రానాట్స్ మూన్‌పై ఎలాంటి ప్రయోగాలు చేయాలి అనే విషయాలను ప్రాక్టీస్ చేయవచ్చు. అంతే కాకుండా ల్యూనార్ కండీషన్స్‌లో వారు ఎలా జీవించాలో కూడా తెలుసుకోవచ్చు.
ముఖ్యంగా ఈ ఛాంబర్‌లో చంద్రుడిపై డస్ట్ ఎలా ఫార్మ్ అవుతుంది, దానిని ఎలా తొలగించాలి, ఆ డస్ట్‌లో ఎలా జీవించాలి.. అన్న పరిస్థితులను తెలుసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చైనా శాస్త్రవేత్తలు స్పేస్‌క్రాఫ్ట్, స్పేస్‌సూట్స్ వంటివి కూడా తయారు చేయవచ్చని వారు భావిస్తున్నారు. 2030 లోపు ఆస్ట్రానాట్స్‌ను చంద్రుడిపైకి లాంచ్ చేయాలని చైనా ప్రయత్నిస్తోంది. అందుకే ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలను చేయడానికి కూడా వెనకాడడం లేదు. ప్రస్తుతం ఈ ఛాంబర్ ద్వారా చంద్రుడిపై వాతావరణం గురించి ఆస్ట్రానాట్స్ మరింత క్లోజ్‌గా స్టడీ చేయనున్నారు.