Ancient Alarm: పూర్వకాలంలో, మెకానికల్ లేదా డిజిటల్ గడియారాలు లేనప్పుడు, సమయాన్ని తెలుసుకోవడానికి మనుషులు తెలివైన పద్ధతులను ఉపయోగించారు. అందులో ఒక పధ్ధతి కొవ్వొత్తి గడియారం. ఈ టెక్నిక్ చైనా, జపాన్, యూరప్ వంటి వివిధ దేశాలలో కూడా ఉపయోగించడమే కాదు అది ఒక అలారం వ్యవస్థగా కూడా పనిచేసింది. తెలుగు ప్రాంతాల్లో దీని ఉపయోగం గురించి స్పష్టమైన అధరాలు లేనప్పటికీ, ధార్మిక, వ్యవసాయ, రోజువారీ పనుల కోసం సమయాన్ని తెలుసుకోవడానికి దక్షిణ భారతదేశంలో కూడా ఈ పద్ధతిని ఉపయోగించారు.
కొవ్వొత్తి గడియారం ఒక సాధారణ కానీ సమర్థవంతమైన టెక్నిక్. ఇందులో ఒక ఖచ్చితమైన ఎత్తుమందంతో కూడిన కొవ్వొత్తిని ఉపయోగించి, దానిపై సమాన దూరంలో గుర్తులను పెడతారు. ఈ గుర్తులు సమయ విరామాలను తెలుపుతాయి. ఉదాహరణకు, చైనా కవి యూ జియాంగు (క్రీ.శ. 520) వివరించిన పద్ధతిలో, 12 అంగుళాల పొడవైన కొవ్వొత్తులు ఒక అంగుళం విభాగాలుగా గుర్తించి, ప్రతి అంగుళం 20 నిమిషాలు, మొత్తం కొవ్వొత్తి 4 గంటలు కాలుతుంది. ఈ కొవ్వొత్తులను గాలి నుండి రక్షించడానికి కలప లేదా హార్న్ ప్యానెల్స్ తో చేసిన ఫ్రేములలో పెట్టేవారు.
అలారం కోసం, కొవ్వొత్తిలో పెట్టిన గుర్తు దగ్గర ఒక లోహ గోరును చొప్పించేవారు. కొవ్వొత్తి కరిగి ఆ గుర్తుకు వచ్చేసరికి, గోరు కింద ఉన్న లోహ గిన్నెలో పడి శబ్దం చేసి నిద్రలేపే అలారంగా పనిచేసేది. ఈ పధ్ధతి పురాతన రోమ్ లో, ఇంగ్లండ్ రాజు ఆల్ఫ్రెడ్ ది గ్రేట్ చర్చిలలో ఉపయోగించినట్లు చెప్పుకుంటారు. 12వ శతాబ్దంలో ముస్లిం ఇంజినీర్ అల్-జజారీ బరువులు, పుల్లీలతో కూడిన మోడర్న్ కొవ్వొత్తి గడియారాన్ని రూపొందించారు, ఇది సమయాన్ని మరింత ఖచ్చితంగా సూచించేది.
ఈ టెక్నిక్ రాత్రిపూట లేదా మబ్బులు కమ్మిన రోజులలో సమయాన్ని గుర్తించడానికి ఉపయోగపడేది, ఎందుకంటే సూర్యుడు లేదా చంద్రుడు కనిపించని సమయాల్లో సన్డయల్స్ పనిచేయవు. అయితే, కొవ్వొత్తి గడియారాలు ఖచ్చితమైన సమయాన్ని చెప్పలేకపోయినా గడిచిన సమయ వ్యవధిని మాత్రం ఖచ్చితంగా చెప్పగలవు. అలాగే గాలి లేదా కరిగే మైనం వంటి విషయాలు ఖచ్చితత్వాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ పధ్ధతి మెకానికల్ గడియారాలు కనిపెట్టక ముందు వరకు బాగా ఉపయోగించారు అలాగే ఇది పూర్వకాలం మనుషుల తెలివితేటలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.