DD Next Level Controversy : తమిళ సీనియర్ కమెడియన్ సంతానం నటిస్తున్న కొత్త సినిమా ‘డీడీ నెక్ట్స్ లెవల్’ (DD next level). ఇందులోని ‘కిస్సా 47’ అనే సాంగ్ లిరిక్స్ వివాదానికి కేరాఫ్ అడ్రస్ గా మారాయి. ఈ పాటలో ఉపయోగించిన ‘గోవింద గోవింద’ అనే పదాలు తిరుమల శ్రీవారిని కించపరిచేలా ఉన్నాయని హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. గత రెండ్రోజులుగా జరుగుతున్న ఈ వివాదంపై ఎట్టకేలకు టీటీడీ స్పందించింది. ఈ మేరకు చిత్రబృందానికి లీగల్ నోటీసులు పంపడమే కాకుండా, పరువు నష్టం దావా కూడా వేసింది.
మూవీ టీంకు టీటీడీ లీగల్ నోటీసులు
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్… నటుడు సంతానంతో పాటు ‘డీడీ నెక్స్ట్ లెవల్’ టీంకు లీగల్ నోటీసు పంపినట్టు సమాచారం. సంతానం, ఆయన నిర్మాణ సంస్థ డిడి నెక్ట్స్ లెవెల్ 100 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, ‘గోవింద’తో ప్రారంభమయ్యే పాటను తొలగించాలని నోటీసులో డిమాండ్ చేశారు. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వకపోతే క్రిమినల్ కేసు పెడతామని పేర్కొన్నారు. మరి మేకర్స్ ఈ నోటీసులకు ఎలా స్పందిస్తారో చూడాలి.
వివాదంపై చిత్రబృందం రియాక్షన్
సంతానం (Santhanam) నటించిన కొత్త చిత్రం ‘డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్’. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గీతిక తివారీ, సెల్వరాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నిజల్గల్ రవి, రాజేంద్రన్, కస్తూరి, రెడ్డిన్ కింగ్స్లీ, యాషిక ఆనంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ది షో పీపుల్ తరపున నటుడు ఆర్య సమర్పణలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ సినిమాలోని ‘శ్రీనివాస గోవింద’ పాట తిరుమల తిరుపతి దేవుడైన వెంకటేశ్వర స్వామిని అవమానించేలా ఉందని హిందూ సంస్థలు మండిపడుతున్నాయి. ఈ పాటను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
రెండ్రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను ఊహించని వివాదం చుట్టుముట్టడం చిత్ర బృందాన్ని షాక్ కు గురి చేసింది. సినిమాలోని కెలుతి సాహిత్యం అందించిన ‘కిస్సా 47’ పాట ఇప్పటికే 92 లక్షలకు వ్యూస్ తో ట్రెండింగ్‌లో ఉండడం గమనార్హం. ఇక తమిళనాడు బీజేపీ లీగల్ సెల్, సేలం పోలీస్ కమిషనర్‌కు ఇప్పటికే ఈ వివాదంపై కంప్లయింట్ చేసింది. పాటను తొలగించకపోతే సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు.
Read Also : మనుషులను పీక్కుతినే తోడేళ్లు… ట్విస్టులతో కళ్లు తిప్పుకోకుండా చేసే మూవీ
అయితే సంతానం ఈ వివాదంపై స్పందిస్తూ “నేను పెరుమాళ్ భక్తుడిని. దేవుడి గురించి పాట పెట్టాలనే కోరికతో ఆ పాట పెట్టాను. నేను ఆయనను ఎగతాళి చేయడం లేదు. నాకు దేవుడిపై నమ్మకం ఉంది. నాకు పెరుమాళ్ అంటే ఇష్టం” అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఈ వివాదం చల్లబడలేదు. అంతలోనే టీటీడీ ఇలా లీగల్ నోటీసులు పంపుతూ, శ్రీవారి ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసినందుకు 100 కోట్ల నష్టపరిహారం కోరడం హాట్ టాపిక్ గా మారింది.