ChatGpt : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే చాట్ జీపీటీపై గ్లోబల్ పబ్లిషర్స్ న్యూఢిల్లీలో కాపీరైట్ దావా వేసింది. తమ కంటెంట్ ను అనుమతిలేకుండా యాక్సిస్ చేయడం నిలిపివేయాలంటూ ఈ దావాలో పేర్కొంది.
భారతీయ పుస్తక ప్రచురణ కర్త గ్లోబల్ పబ్లిషర్స్ ఓపెన్ ఏఐకు వ్యతిరేకంగా ఢిల్లీలో కాపీరైట్ దావా వేసింది. యాజమాన్య కంటెంట్ ను యాక్సెస్ చేయటాన్ని చాట్ జీపీటీ వెంటనే ఆపాలని కోరింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలకు శిక్షణ ఇవ్వడానికి సాంకేతిక సంస్థలు తమ కంటెంట్ ను కాపీ చేస్తున్నాయని.. చాట్ బాట్ లకు శిక్షణ ఇచ్చేందుకు తమ కంటెంట్ ఉపయోగిస్తున్నాయని ఇప్పటికే పలు సంస్థలు ఆరోపించిన సంగతి తెలిసిందే. చాట్ బాట్ ఈ పద్ధతిని మార్చుకోవాలని, శిక్షణ ఇచ్చే సమయంలో ఉపయోగించే కంటెంట్ తమదేనని.. అనుమతులు లేకుండా ఈ కంటెంట్ ను ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచురణకర్తలతో పాటు వార్తా సంస్థలు సైతం ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించాయి.
బ్లూమ్స్‌బరీ, పెంగ్విన్ రాండమ్ హౌస్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్, పాన్ మాక్‌మిలన్ వంటి ప్రచురణకర్తలతో పాటు ఇండియాకు చెందిన రూపా పబ్లికేషన్స్, ఎస్.చాంద్ అండ్ కో వంటి ఫెడరేషన్ సభ్యులందరి తరపున ఈ కేసు దాఖలైంది. “మా కాపీరైట్ కంటెంట్‌ను యాక్సెస్ చేయడాన్ని ఓపెన్‌ఏఐ ఆపాలని కోర్టును ఆశ్రయిస్తున్నాం. ఇక నుంచైనా మా కంటెంట్ ను యాక్సిస్ చేయటం ఆపాలి..” అంటూ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ప్రణవ్ గుప్తా తెలిపారు.
ALSO READ : ఈ మెుబైల్స్ ఫీచర్స్ లో తేడాలు ఏంటంటే..!
“చాట్ జీపీటీ మాతో ఒప్పందం కుదుర్చుకొని కంటెంట్ వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ అలా కాని పక్షంలో మా కంటెంట్ ను వెంటనే తొలగించాలి. AI శిక్షణలో ఉపయోగించిన డేటాసెట్‌లను తొలగించాలి. లేదంటే ఈ విషయంలో మాకు ఎలా పరిహారం చెల్లించబడుతుందో వివరించాలి. నిజానికి ఈ విషయం మా ప్రతిభను దొంగలిస్తున్నట్లే..” అంటూ తెలిపారు.
ఇక ఈ ఆరోపణలపై ఓపెన్ ఏఐ ఇప్పటివరకూ స్పందించలేదు. డిసెంబర్ లో ఈ వాజ్యం దాఖలైనప్పటికీ మొదటిసారి నివేదించారు. కాగా పబ్లిక్ గా అందుబాటులో ఉన్న డేటాను మాత్రమే ఉపయోగించుకుంటున్నామని చెబుతున్న ఏఐ.. ప్రతీ ఒక్కరి డేటాను వాడుకుంటుందని ఆరోపణలు ఎప్పటి నుంచో ఎదురవుతున్నాయి.
నవంబర్ 2022 ChatGPT లాంఛ్ తర్వాత జనరేటివ్ AIలో OpenAI పెట్టుబడులు… కార్పొరేట్ విభాగంలో మరింత కాపీ కంటెంట్ ను ప్రోత్సహించాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చాట్ జీపీటీతో ఓపెన్ ఏఐ గత ఏడాది 6.6 బిలియన్ డాలర్లు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇక ముందు నుంచి ఓపెన్ ఏఐ కంటెంట్ ను కాపీ చేస్తుంది అంటూ పలు వాదనలు వినిపిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పెంగ్విన్ రాండమ్ హౌస్ దాని శీర్షిక కాపీరైట్ పేజీలో ఈ పుస్తకంలో ఏ భాగాన్ని కాపీ చేయడానికి వీలు లేదు అంటూ రాసుకొచ్చింది. ఈ విషయంపై భారత్ లో వాజ్యం దాఖలు కావటంతో ముందు ముందు ఓపెన్ ఏఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరి ఈ నేపథ్యంలో భవిష్యత్తులో భారత్లో ఓపెన్ ఏఐ సేవలు నిలిచిపోనున్నాయి అనే రీతిలో సైతం టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ విషయంపై ఓపెన్ ఏఐ ఎలా స్పందిస్తుందో.. కోర్టు ఎలాంటి అనుమతులు జారీ చేస్తుందో వేచి చూడాలి.