Google New Logo: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ లోగోను మార్చింది. సుమారు దశాబ్దం తర్వాత తన ఐకానిక్ లోగోలో పలు మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉన్న లోగోలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం బ్లాకులు కనిపించేవి. ఇప్పుడు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుతోనే కొత్త గ్రేడియంట్ డిజైన్ ను తీసుకొచ్చింది. అంతేకాదు, త్వరలో మరిన్ని ఆర్టిఫీషియల్ ఫీచర్లను పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది. గూగుల్ ప్రధానమైన వర్డ్ మార్క్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే, AI సేవలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో గ్రేడియంట్ డిజైన్ ఇతర సర్వీసులకు విస్తరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
2015 తర్వాత ఇదే తొలిసారి!
నిజానికి గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్ బాధ్యతలు స్వీకరించిన కొత్తలో(2015)లో లోగోను మార్చారు. ఆ తర్వాత 10 ఏళ్లకు ఇప్పుడు మళ్లీ మార్పులు చేశారు. ప్రస్తుతం కొత్త లోగో IOS, పిక్సెల్ డివైజ్ లలో కనిపిస్తోంది. అటు గూగుల్ 16.18 బీటా వెర్షన్ ఉన్న ఆండ్రాయిడ్ డివైజ్ లలో ఈ లోగో కనిపిస్తోంది. మరికొద్ది వారాల్లో వివిధ పరికరాలు, ప్లాట్ ఫారమ్ లలో కొత్త డిజైన్ మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గూగుల్ వర్క్ మార్క్ కు కూడా మార్పులు!
ప్రస్తుతం గూగుల్ లోగో మార్చినప్పటికీ కంపెనీ ఇంకా ప్రధాన గూగుల్ వర్డ్ మార్క్ కు ఎలాంటి మార్పులు చేయలేదు. గూగుల్ క్రోమ్, గూగుల్ మ్యాప్స్ లాంటి ఇతర ఉత్పత్తులకు సంబంధించి లోగోలు కూడా మార్పులు, చేర్పులకు గురవుతాయా? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కానీ, తప్పకుండా గ్రేడియంట్ డిజైన్ ను ఇతర సేవలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కొత్త లోగోపై నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ఇక గూగుల్ తాజాగా తీసుకొచ్చిన లోగోపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది పాజిటివ్ గా స్పందిస్తుంటే, మరికొంత మంది నెగెటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. రెండింటికీ పెద్దగా తేడా ఏం కనిపించడం లేదని మరికొంత మంది అంటున్నారు. “గూగుల్ లోగో మార్చారా? మార్చినట్లు పెద్దగా ఏం కనిపించడం లేదు. నాకు పాత లోగోనే నచ్చింది. కొత్తదాని కంటే పాతదే బాగుంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “AI డిజిటల్ ఎక్స్ పీరియెన్స్ పెరుగుతున్న నేపథ్యంలో లోగో మరింత డైనమిక్ గా జెమినీ లాంటి గూగుల్ ప్రొడక్ట్స్ దృశ్య శైలికి సరిపోయేలా ఉంది” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మొత్తంగా దశాబ్దం తర్వాత మారిన గూగుల్ లోగోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కంపెనీ త్వరలోనే తన అన్ని ఉత్పత్తులకు సంబంధించిన లోగోలను కూడా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూజర్ల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ను పరిగణలోకి తీసుకొని కొత్త లోగోలను మరింత స్క్రీన్ ఫ్లెండ్లీగా రూపొందించే అవకాశం ఉంది.
Read Also: ఓడియమ్మ.. రోబోలు డాన్స్ చెయ్యడం ఏంటి మస్క్ మామ? నువ్వు తోపు అంతే!