పెద్ద పెద్ద కంపెనీలేవీ తమ ఉద్యోగుల జీతాలు, ప్యాకేజీల వివరాలు బయటపెట్టవు. కంపెనీవైపు నుంచి కానీ, ఉద్యోగుల వైపు నుంచి కానీ వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతుంది యాజమాన్యం. కానీ ఇప్పుడు అనుకోకుండా గూగుల్ కంపెనీ ఉద్యోగుల వ్యవహారాలన్నీ బట్టబయలయ్యాయి. వర్క్ వీసా డేటా ను బహిర్గతం చేయాలన్న నిబంధనలతో గూగుల్ తనకు తాను ఈ సమాచారాన్ని బయట పెట్టాల్సి వచ్చింది. దీంతో ఈ వివరాలన్నీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు టాప్ క్లాస్ జీతాలు..
గూగుల్ కంపెనీలో చాలా రకాల ఉద్యోగాలున్నాయి. అకౌంట్ మేనేజర్లు, ఫైనాన్స్ మేనేజర్లు, క్వాలిటీ అనలిస్ట్ లు, డేటా ఇంజినీర్లు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, హార్డ్ వేర్ ఇంజినీర్లు.. వంటి ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంకా చాలా రకాల కేటగిరీలున్నాయి కానీ అందరిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల జీతాలే ఎక్కువగా ఉండటం విశేషం. గరిష్టంగా 3 లక్షల 40వేల డాలర్ల జీతం తీసుకునే ఉద్యోగులు కూడా ఉన్నారు. మిగతా విభాగాలకంటే సాఫ్ట్ వేర్ విభాగం, అందులోనూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల జీతం ఎక్కువగా ఉంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకే గూగుల్ కంపెనీ అధిక వేతనాలు చెల్లిస్తోంది.
ఇప్పటి వరకు రహస్యం..
ఉద్యోగుల జీతాలను కంపెనీలు రహస్యంగా ఉంచాలనే చూస్తాయి. ఇటీవల కాలంలో ఏఐ విభాగంలో ఉద్యోగుల వలసలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. కంపెనీలు భారీ ఆఫర్లు ఇచ్చి మరీ ఉద్యోగుల్ని తరలించుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో జీతాలు బహిర్గతం చేయడం కంపెనీలకు ఇష్టం లేదు. అయితే ప్రత్యర్థి కంపెనీలు ఎలాగైనా ఆ జీతం వివరాలు తెలుసుకుని, తాము తీసుకోవాలనుకుంటున్న ఉద్యోగులకు భారీ ఆఫర్లు ఇస్తుంటాయి. మరోవైపు గూగుల్ లాంటి మల్టీ నేషనల్ కంపెనీలు అమెరికాలో స్థానికులకు ఇచ్చే ప్యాకేజీకంటే.. భారత్ నుంచి వలస వచ్చినవారికి అధిక ప్యాకేజీ చెల్లిస్తుంటాయి. ఇలాంటి వ్యత్యాసాలు బయటకు చెప్పేందుకు కంపెనీలు ఇష్టపడవు. కానీ అమెరికాలో తీసుకొచ్చిన నూతన నిబంధనల వల్ల ఉద్యోగుల జీతాలు బయటపెట్టక తప్పలేదు.
బిజినెస్ అనలిస్ట్ (85,500 డాలర్ల నుంచి 2,35,000 డాలర్ల వరకు)
అకౌంట్ మేనేజర్ (85,500 డాలర్ల నుంచి 1,66,000 డాలర్ల వరకు)
గూగుల్ సైంటిస్ట్ లు (1,33,000 డాలర్ల నుంచి 3,03,000 డాలర్ల వరకు)
సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు (1,09,180 డాలర్ల నుంచి 3,40,000 డాలర్ల వరకు)
హార్డ్ వేర్ ఇంజినీర్లు (1,30,000 డాలర్ల నుంచి 2,84,000 డాలర్ల వరకు)
మొత్తమ్మీద సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు గూగుల్ కంపెనీలో జీతాలు ఎక్కువగా ఉండగా, అకౌంట్ మేనేజర్లకు మాత్రం జీతం కనిష్టంగా ఉండటం విశేషం. గూగుల ల్ జీతాల వివరాలు ఆన్ లైన్ లో బయటకు రావడంతో అందరికీ ఆసక్తి ఏర్పడింది. ఈ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గూగుల్ కంపెనీలో పనిచేసే వారిలో ఎవరెవరికి ఎక్కువ ప్రయారిటీ ఉంది, ఎవరికి ఎక్కువ జీతం ఇస్తారు అనేది ఇప్పుడు తెలిసిపోయింది. గూగుల్ తో పాటు మరికొన్ని కంపనీల జీతాలు కూడా ఇలాగే బయటకు వచ్చినా.. కేవలం గూగుల్ జీతాలు మాత్రం వైరల్ కావడం విశేషం.