 
					Telangana: తెలంగాణ రాష్ట్రంలో తుఫాను మోంథా కారణంగా గత కొన్ని రోజులుగా తీవ్రమైన వర్షాలు, వరదలు ఉద్భవించాయి. ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు, ఇళ్లు, పశుసంపద మీద భారీ నష్టం ఏర్పడింది. ముఖ్యంగా వరంగల్, హుస్నాబాద్, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి వంటి జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రభుత్వం తక్షణ సహాయ చర్యలు చేపట్టి, రైతులు, బాధితులకు పరిహారం అందించేందుకు సిద్ధమైంది. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు ఆ దాంతో ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు.
తుఫాను మోంథా కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 4.48 లక్షల ఎకరాల పంటలు, 2.53 లక్షల మంది రైతులపై ప్రాథమిక అంచనాల ఆధారంగా తీసుకున్నది. ధాన్యం, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు ఎక్కువగా నష్టపోయాయి. మంత్రి మాట్లాడుతూ, “ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించబడుతుంది. దీని గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టంపై సర్వేలు నిర్వహించి, సహాయం అందించే ప్రక్రియ మొదలైంది. శుక్రవారం నుంచి వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తూ, ప్రతి రైతు పంట వివరాలను నమోదు చేస్తారు.
ఈ సహాయం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు అమలు చేయబడుతుంది. మంత్రి తుమ్మల, “సీఎం గారు పరిశీలించిన తర్వాత చివరి నిర్ణయం తీసుకుంటాము. కానీ ఇప్పటికే రూ.10 వేల పరిహారం పరిగణనలో ఉంది” అని తెలిపారు. ఈ నష్టం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పంట నష్టం తీవ్రంగా ఉందని తేల్చింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో మొంథా తుఫాను ప్రభావానికి పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో వరి, మక్కలు, పత్తి తడిసిపోయాయి. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ ప్రాథమిక సర్వే నిర్వహించింది. 2 లక్షల 82 వేల 379 ఎకరాల్లో వరి, లక్షా 51 వేల 707 ఎకరాల్లో పత్తి, 4 వేల 963 ఎకరాల్లో మొక్కజొన్న, 3 వేల 613 ఎకరాల్లో మిర్చి, ఒక వెయ్యి 228 ఎకరాల్లో పప్పు ధాన్యాలు, 2 వేల 674 ఎకరాల్లో వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. ఇక ఒక వెయ్యి 300 ఎకరాల్లో ఉద్యాన పంటలు కలిపి మొత్తం 4 లక్షల 47 వేల 864 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించింది. అత్యధికంగా వరంగల్ జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 80 వేల 500 మంది రైతులు నష్టపోయారు. ఖమ్మం జిల్లాలో 62 వేల 400 ఎకరాలు, సూర్యాపేటలో 56 వేల 330, నల్లగొండలో 52 వేల 071 ఎకరాల్లో పంటనష్టం జరిగింది.
Also Read: తుఫాన్ నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా..
అంతేకాకుండా తుఫాను ప్రభావంతో పశుసంపద, ఇళ్లు నష్టపోయిన బాధితులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తుమ్మల భరోసా ఇచ్చారు.